H3N2 Virus in India:


H3N2 వైరస్ కలకలం..


ఇప్పుడిప్పుడే కాస్త కరోనా వ్యాప్తి తగ్గిపోయి ప్రపంచమంతా కుదుట పడుతోంది. నిన్న మొన్నటి వరకూ చైనాలో భారీగా నమోదైన కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. మిగతా దేశాల్లోనూ పెద్దగా కేసులు నమోదు కావడం లేదు. ఇలా ఊపిరి పీల్చుకుంటున్న క్రమంలో ఇప్పుడు మరో వైరస్ దాడి చేయడం మొదలు పెట్టింది. H3N2 Influenza వ్యాప్తి చెందుతోంది. సోకడమే కాదు. ఇద్దరి ప్రాణాలు బలి తీసుకుంది కూడా. కర్ణాటకలో ఓ వృద్ధుడు, హరియాణాలో ఓ వ్యక్తి ఈ వైరస్ సోకి మృతి చెందారు. ఒక్కసారిగా దేశమంతా ఈ మరణాలతో ఉలిక్కి పడింది. ఇది కూడా కరోనాలాగే పీడిస్తుందా అన్న అనుమానాలు, భయాలు వ్యక్తమవుతున్నాయి. కరోనా ప్యాండెమిక్‌లాగే ఇది కూడా చాలా రోజుల పాటు మనల్ని వేధిస్తుందా అని కంగారు పడిపోతున్నారంతా. ఈ వైరస్ వ్యాప్తిపై అన్ని రాష్ట్రాలనూ కేంద్ర ప్రభుత్వం అప్రమత్తం చేసింది. ICMR కూడా కొన్ని మార్గదర్శకాలు జారీ చేసింది. అటు నిపుణులు కూడా ప్రస్తుత పరిస్థితులను పరిశీలిస్తున్నారు. కొందరు కీలక ప్రకటనలు చేశారు. ఇప్పటికైతే ఇన్‌ఫ్లుయెంజా కేసుల్లో పెరుగుదల సాధారణంగానే ఉందని వెల్లడించారు. ఢిల్లీలోని గంగారాం హాస్పిటల్‌కు చెందిన డాక్టర్ ధిరెన్ గుప్త కూడా ఇదే విషయం చెప్పారు. గత రెండేళ్లుగా కరోనా జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ఇన్‌ఫ్లుయెంజా వైరస్ వ్యాప్తి చెందలేదని అన్నారు. అయితే...సాధారణంగా ఈ వైరస్ ప్రాణాలు తీసేంత ప్రమాదకరమైంది కాదని వివరించారు. పిల్లల్లోనూ ఈ వైరస్‌ వ్యాప్తి చెందకపోవడానికి కారణం..కరోనా జాగ్రత్తలు పాటించడమేనని స్పష్టం చేశారు. ఇప్పుడు క్రమంగా ఈ జాగ్రత్తల్ని పక్కన పెట్టేశారని, అందుకే ఈ వైరస్ దాడి చేయడం మొదలు పెట్టిందని అన్నారు. 


 "H3N2 వైరస్‌లో మ్యుటేషన్‌లు స్వల్పంగానే ఉంటాయి. ఇవి ప్రాణాంతకమైతే కాదు. ఇప్పటికే దీర్ఘకాలిక రోగాలతో బాధ పడే వారికి మాత్రం కాస్త ముప్పు ఉంటుంది. మృతుల్లో వీరే ఎక్కువగా ఉంటారు. మరో విషయం ఏంటంటే. వ్యాక్సిన్‌ల ప్రభావం ఈ వైరస్‌పై తక్కువగానే ఉంటుంది. అందులోనూ ఈ ఏడాది మన దేశంలో వ్యాక్సినేషన్‌ రేటు తక్కువగా ఉంది"


-డాక్టక్ ధిరేన్ గుప్త, ఢిల్లీ గంగారాం హాస్పిటల్


భయం వద్దు: వైద్యులు


అయితే ప్రస్తుతానికి పలు చోట్ల ఈ కేసులు నమోదవుతున్నాయి. ఒడిశాలో 59 మందికి ఈ వైరస్ సోకింది. పంజాబ్, గుజరాత్‌లోనూ బాధితులున్నారు. ఈ కేసులు పెరుగుతుండటాన్ని చూసి ఇది కూడా కరోనా వేవ్‌లాగే వస్తుందా అని భయపడుతున్నారు. కానీ వైద్య నిపుణులు మాత్రం అలాంటి పరిస్థితులేమీ రాకపోవచ్చని చెబుతున్నారు. హాస్పిటలైజేషన్‌ చాలా తక్కువగా ఉంటుందని, పెద్దగా భయపడాల్సిన పని లేదని అంటున్నారు. కరోనా సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నామో వాటినే మళ్లీ పాటిస్తే ముప్పు తొలగిపోతుందని సూచిస్తున్నారు.