జమిలీ ఎన్నికల విషయంపై లా కమిషన్ చేసిన సిఫార్సులను పరిశీలిస్తున్నామని కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజుజు పార్లమెంట్‌కు తెలిపారు. దీంతో జమిలీ ఎన్నికల అంశం రాజకీయవర్గాల్లో మరోసారి చర్చనీయాంశం అవుతోంది. రిజుజు సమాధానం చెప్పిన విధానం పరిశీలిస్తే కేంద్ర ప్రభుత్వం జమిలీ ఎన్నికలు నిర్వహించాలని చాలా పట్టుదలగా ఉందన్న అభిప్రాయం కలుగుతుంది. లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలు వేర్వేరుగా జరిగితే ఖర్చు పెరుగుతుందన్న ఉద్దేశంతో అన్ని ఎన్నికలనూ ఏకకాలంలో నిర్వహించాలని పార్లమెంటరీ స్థాయీ సంఘం సిఫార్సు చేసినట్లు రిజుజు చెప్పారు. అలాగే కమిషనర్ కూడా ఎన్నికల సంస్కరణలపై సిఫార్సులు చేసిందని ప్రభుత్వ పరిశీలనలో ఉందని  తెలిపారు. 


బీజేపీ విధానం "వన్ నేషన్ - వన్ ఎలక్షన్"..!


భారతీయ జనతా పార్టీ విధానం "ఒకే దేశం - విధానం".  ఇప్పటికే అనేక అంశాల్లో ఈ విధానాన్ని అమలు చేస్తున్నారు. వన్ నేషన్ - వన్ ఎలక్షన్ అనే నినాదాన్ని కూడా చాలా కాలంగా వినిపిస్తున్నారు. 2019లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన  వెంటనే... అఖిలపక్ష భేటీ ఏర్పాటు చేసి పార్లమెంట్‌లో ప్రాతినిధ్యం ఉన్న ప్రతీ పార్టీ అధ్యక్షుడ్ని ఆహ్వానించారు. అప్పుడే జమిలీ ఎన్నికల అవశ్యకత గురించి మోడీ చెప్పారు. కాంగ్రెస్ మినహా దాదాపుగా అన్ని పార్టీలు అంగీకారం తెలిపాయి.  భారతీయ జనతా పార్టీ ఒక దేశం - ఒకే ఎన్నికల కోసం... ఓ ప్రణాళిక ప్రకారం నిర్ణయాలు తీసుకుంటూ వెళ్తోంది.  పార్లమెంట్, అసెంబ్లీ, పంచాయతీ, మున్సిపాలిటీ ఇలా ప్రతి ఒక్క ఎన్నికకు ఒకే సారిఎన్నిక జరగాలనేది మోడీ అభిలాష. అలా జరిగితే.. మళ్లీ మళ్లీ ఎన్నికలన్న ప్రస్తావన రాదని..అభివృద్ధి కార్యక్రమాలపై దృష్టి పెట్టవచ్చనేది ఆయన అభిప్రాయం.  


రాజ్యాంగ సవరణ చేస్తే జమిలీ ఎన్నికలు నిర్వహిస్తామన్న ఈసీ..! 


కేంద్ర ఎన్నికల సంఘం కూడా కొంత కాలం కిందట జమిలీ ఎన్నికల నిర్వహణకు తాము సిద్దంగా ఉన్నామని ప్రకటించింది. పార్లమెంట్‌లో ఎప్పుడు రాజ్యాంగ సవరణ చేస్తే అప్పుడు ఎన్నికలు నిర్వహించేస్తామని చెప్పింది. ముందస్తుగా జమిలీ ఎన్నికలు నిర్వహించాలంటే.. కొన్ని రాష్ట్ర ప్రభుత్వాల పదవీ కాలాన్ని తగ్గించాలని.. మరికొన్నింటినీ పొడిగించాల్సి ఉంటుంది. దీని కోసం రాజ్యాంగ సవరణ చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం.. కేంద్రం తల్చుకుంటే.. రాజ్యాంగ సవరణ సులువే. అందుకే..  ఇలాంటి అవకాశం మళ్లీ రాదని.. ఎట్టి పరిస్థితుల్లోనూ జమిలీ ఎన్నికలు పెట్టాలన్న ఆలోచన చేస్తున్నరాన్న చర్చ జరుగుతోంది.  


ప్రధాని తల్చుకుంటే వచ్చే ఏడాదే జమిలీ ఎన్నికలు..!    


కేంద్రం జమిలీ ఎన్నికలు నిర్వహించదల్చుకుంటే 2022లో నిర‌్వహించే అవకాశం ఉంది. ఎందుకంటే ఏడాది పొడవునా దాదాపుగా ఎనిమిది రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉంది. ఆ తర్వాత ఏడాది మరో ఐదు రాష్ట్రాలకు జరగాల్సి ఉంది. లా కమిషన్ సిఫార్సుల మేరకు రాజ్యాంగ సవరణ చేస్తే.. జమిలీ నిర్వహించడానికి అవకాశం ఉంది. దేశానికి జమిలీ ఎన్నికలు కొత్తేం కాదు. స్వాతంత్ర్యం వచ్చిన మొదట్లోనే మూడు సార్లు జమిలీ ఎన్నికలు జరిగాయి. జమిలీ ఎన్నికలు జరగాలి అంటే... ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షా అనుకోవాలి.  ప్రధానమంత్రి కూడా పదే పదే జమిలీ ఎన్నికల గురించి ప్రస్తావిస్తున్నారు.  దేశానికి జమిలీ ఎన్నికలు ఎంతో ముఖ్యమైనవి.. ఒకే దేశం - ఒకే ఎన్నిక అనేది అత్యంత అవశ్యమని ఆయన చెబుతున్నారు. అందుకే జమలీ ఎన్నికలు జరుగుతాయని ఎక్కువ మంది విశ్వసిస్తున్నారు.