ప్రశాంత్ కిశోర్.. దేశ రాజకీయాల్లో ఒక హాట్ టాపిక్. ఎక్కడ కనిపిస్తే.. అక్కడ ఊహాగానాలు జోరందకుంటాయి. పీకే ఇది చేస్తున్నాడు.. పీకే ఆ పార్టీలో జాయిన్ అవుతున్నాడంటూ.. బహిరంగ చర్చలు. కొన్నిరోజుల క్రితం ఎన్సీపీ అధినేత శరద్ పవర్ ను కలవడంతో ఇక బీజేపీకి వ్యతిరేకంగా కూటమి కట్టేస్తున్నాడంటూ.. చర్చ జరిగింది. మెున్న కాంగ్రెస్ అగ్రనేతలతో కలవడంతో ఇక కాంగ్రెస్ లోకి పీకే అంటూ వార్తలొచ్చాయి.


ప్రస్తుతం పీకే అడుగులు చూస్తుంటే.. రాజకీయ వ్యూహకర్తగానే కాదు.. సక్సెస్ ఫుల్ పొలిటీషియన్ గా నిరూపించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ముఖ్యమైన రాజకీయ నేతలతో భేటీ అయ్యారు ప్రశాంత్ కిశోర్. మెున్నటికి మెున్న సోనియాతో పాటు రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీతోనూ సమావేశమయ్యారు. కాంగ్రెస్ పెద్ద నేతలతో భేటీతో.. ఏదో పెద్ద ప్లాన్ జరుగుతున్నట్టు విశ్లేషణలు వచ్చాయి.  


ఇప్పటికే పీకే.. వారితో చాలా సార్లు సమావేశమైనట్టు తెలుస్తోంది. వచ్చే ఎన్నికలను కాంగ్రెస్ పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తోంది.. మోదీని ఎలాగైనా గద్దె దింపాలని చూస్తోంది. ఈ ప్లాన్ లో భాగంగానే పీకేతో సమావేశాలని విశ్లేషకులు చెబుతున్నారు. 
అయితే పీకే... పాత స్ట్రాటజిస్ట్ గా వెళ్తాడా? లేక కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుని నేరుగా మోదీపైకి దండెత్తుతాడా? అనేది తెలియాల్సి ఉంది. తన వ్యూహాలతో గెలిచిన మోదీ నిర్ణయాలను పీకే బహిరంగంగానే చాలా సార్లు వ్యతిరేకించారు.


కొంత కాలంగా పంజాబ్ కాంగ్రెస్ లో సంక్షోభం ఏర్పడింది. అమరీందర్ సింగ్, సిద్ధు మధ్య పొలిటికల్ చిచ్చు రేగింది. ఇరు వర్గాలు పరస్పర ఆరోపణలు చేసుకోవడంతో పంజాబ్ రాజకీయాలు హాట్‌హాట్‌గా మారిపోయాయి.  ఇలాంటి పరిస్థితుల్లో ప్రశాంత్ కిషోర్, కాంగ్రెస్  ముఖ్య నేతల భేటీ  ప్రాధాన్యత సంతరించుకొంది. ఇదే సమావేశంలో మరో ముగ్గురు పంజాబ్ కాంగ్రెస్ ప్యానెల్ సభ్యులు కూడా పాల్గొనడంపైనా చర్చలు జరిగాయి. పంజాబ్ కాంగ్రెస్ లో గొడవలను సరిచేసేందుకు పీకే కాంగ్రెస్ అగ్రనేతలను కలిశారని వార్తలు కూడా వచ్చాయి.


2014 ఎన్నిక‌ల్లో బీజేపీకి స్ట్రాట‌జిస్ట్ గా పనిచేసిన ప్రశాంత్ కిషోర్.. మోదీ ప్రచారాన్ని ఓ రేంజీకి తీసుకెళ్లారు. అప్పటి నుంచే పీకే పేరు మారుమోగింది. ఆ తర్వాత వైసీపీ అధినేత జగన్ కు కూడా పని చేశారు.  చాలా రాష్ట్రాల్లో పార్టీలకు పని చేసి.. ఆ పార్టీల గెలుపులో తన మార్క్ ను చూపించారు. త‌న సొంత రాష్ట్రం బీహార్ లో అధికార పార్టీ జేడీయూలో చేరిన పీకేకు ఆ పార్టీ ఉపాధ్యక్ష  ప‌ద‌వి కూడా ద‌క్కింది. విభేదాలతో ఆ పార్టీ నుంచి బయటకు వచ్చేశారు.  తాజాగా పశ్చిమ బెంగాల్ లో మమతకు, తమిళనాడులో స్టాలిన్ కు కూడా అధికారం దక్కేలా వ్యూహాలు రచించారు. పశ్చిమ బెంగాల్ ఎన్నికల తర్వాత ఎన్నికల వ్యూహకర్తగా తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. ఈ ప్రకటన తర్వాతే.. దేశంలోని ముఖ్యమైన నేతలను కలుస్తూ వస్తున్నారు. పూర్తిస్థాయి రాజకీయ నాయకుడిగా పీకే మారతాడేమోనని విశ్లేషకులు చెబుతున్నారు. 


 


Also Read: KTR BIRTHDAY : గులాబీ దళంలో ఈ ఉత్సాహం  పట్టాభిషేక సూచికేనా..!?