Is a new epidemic overwhelming hospitals in China: మానవుడ్ని ఏ రోగం ఏమీ చేయలేదు. గుండె ఆగిపోకుండా చేసే ప్రయోగాలు చేస్తున్నారని అనుకుంటూ వచ్చారు కానీ.. కంటికి కూడా కనిపించని ఒక్క కరోనా వైరస్ ప్రపంచాన్ని అతలాకుతరం చేసేసింది. కరోనా దెబ్బకు ప్రాణాల మీద ఆశలు వదులుకున్న వారు లక్షల మంది ఉన్నారు. అలాంటి వైరస్‌లు ఎక్కడిక్కడ పుట్టుకొస్తున్నాయి. తాజాగా చైనాలో ఈ వైరస్‌ల ప్రభావం చాలా ఎక్కువగా ఉంది.
కొత్త ఏడాదిలో చైనాలోని ఆసుపత్రులు, శ్మశానవాటికలు ఫుల్ బిజీగా మారిపోయాయి. దీంతో కొత్త మహమ్మారి చుట్టుముట్టిందన్న ప్రచారం ప్రారంభమయింది. ఇన్ఫ్లుఎంజా ఎ, హెచ్ఎంపివి, మైకోప్లాస్మా న్యుమోనియా , కోవిడ్ -19 తో సహా "బహుళ వైరస్లు" వేగంగా వ్యాప్తి చెందుతున్నాయని కొంత మంది చైనా పౌరులు వీడియోలను షేర్ చేస్తున్నారు. ఆస్పత్రుల్లో పరిస్థితుల్ని.. శ్మశానవాటికల్లో రద్దీని కూడా సాక్ష్యాలుగా చూపిస్తున్నారు. పరిస్థితి చూస్తూంటే చైనా ఎమర్జెన్సీని ప్రకటించిందని కొంత మంది అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే చైనా ఆరోగ్య అధికారులు కానీ.. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) కానీ చైనాలో కొత్త వైరస్ వచ్చి పడిందని చెప్పడం లేదు. ఎలాంటి ప్రకటన చేయలేదు.
ఆసుపత్రులు, శ్మశానవాటికలను అంటువ్యాధులు ముంచెత్తడంతో చైనా ఎమర్జెన్సీని ప్రకటించిందని ఓ నెటిజన్ ట్వీట్ చేశారు. ఇన్ఫ్లుఎంజా ఎ, హెచ్ఎంపివి, మైకోప్లాస్మా న్యుమోనియా మరియు కోవిడ్ -19తో సహా అనేక వైరస్లు చైనా అంతటా వేగంగా వ్యాప్తి చెందుతున్నాయి. 2025కి ఒక్క రోజు కూడా నిండలేదని, ఇప్పటికే చైనాలో వైరస్ ప్రబలిపోయిందని ఓ యూజర్ ప్రకటించారు. 2020 నాటి పరిస్థితులు ఉన్నాయని కొంత మంది చెబుతున్నారు. అయితే చైనా నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు.
నిజానికి చైనా తమ దేశం నుంచి ఎలాంటి సమాచారాన్ని బయటకు రానివ్వదు. అక్కడ సోషల్ మీడియా అకౌంట్లు ఆ దేశాలకు చెందినవే ఉంటాయి. కోవిడ్ ప్రపంచంపై పడే సమయానికి చైనా అసలు నిజాలను దాచి పెట్టింది. అందుకే కొవిడ్-19 మూలాలపై పారదర్శకంగా వ్యవహరించాలని డబ్ల్యూహెచ్ఓ చైనాను కోరుతోంది. కోవిడ్-19 మూలాలను అర్థం చేసుకోవడానికి డేటా పంచుకోవాలని చైనాను కోరుతున్నాము అని డబ్ల్యూహెచ్ఓ తాజా పుకార్ల కారణంగా ప్రకటన చేసింది. బహుశా ప్రస్తుతం చైనాలో మళ్లీ కరోనా తరహా పరిస్థితులు ఉన్నందున ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇలాంటి ప్రకటన చేసి ఉంటుందని అనుమానిస్తున్నారు. ప్రపంచానికి ముప్పుగా మారక ముందే చైనాలో ఏం జరుగుతుందో ఆ దేశమే ప్రకటిస్తే బాగుంటుందన్న అభిప్రాయం వినిపిస్తోంది.