Israel Iran Conflict: ఇజ్రాయేల్ హమాస్ యుద్ధం (Israel Hamas War) కొనసాగుతుండగానే మధ్యలో ఇరాన్ కూడా వచ్చి చేరింది. ఇరాన్‌లోని మిలిటరీ స్థావరాలపై ఇజ్రాయేల్ దాడులు చేసినప్పటి నుంచి అలజడి మొదలైంది. రోజురోజుకీ ఈ రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. ఈ క్రమంలోనే ఇరాన్ (Israel Iran Tensions) సుప్రీం లీడర్ అయతొల్ల అలి ఖమెనీ ఇజ్రాయేల్‌కి వార్నింగ్ ఇచ్చారు. తాము కూడా అణుబాంబులను తయారు చేసుకోడానికి సిద్ధంగా ఉన్నామని హెచ్చరించారు. ఇంకా కవ్విస్తే కచ్చితంగా వాటిని వాడాల్సి వస్తుందని తేల్చి చెప్పారు. ఇప్పటి వరకూ అణు బాంబుల తయారీ గురించి ఆలోచించలేదని, కానీ ఇరాన్‌ ఉనికి ప్రమాదంలో పడితే మాత్రం కచ్చితంగా తమ యుద్ధ రీతుల్ని మార్చుకోవాల్సి ఉంటుందని వెల్లడించారు అయతొల్ల. ఏప్రిల్‌లో ఇజ్రాయేల్‌ ఇరాన్‌లోని మిలిటరీ క్యాంపులపై డ్రోన్‌లు, మిజైల్స్‌తో దాడులు చేసింది. ఆ దాడుల్లో ఇరాన్‌కి చెందిన టాప్ మిలిటరీ కమాండర్లు ప్రాణాలు కోల్పోయారు. అప్పటి నుంచి ఇరాన్‌ తీవ్ర ఆగ్రహంతో ఉంది. ప్రతి దాడులు మొదలు పెట్టింది. ఇప్పుడే కాదు. 


గతంలోనూ ఇరాన్‌ అణుబాంబుల ప్రస్తావన తీసుకొచ్చింది. పశ్చిమ దేశాల నుంచి వస్తున్న ఒత్తిడికి అనుగుణంగా ఇరాన్‌ న్యూక్లియర్ పాలసీలో మార్పులు చేర్పులు చేసుకోవాల్సిన అవసరముందని స్పష్టం చేసింది. న్యూక్లియర్ ఫెసిలిటీస్‌పై ఇజ్రాయేల్ దాడులు మొదలు పెడితే తాము పోరాడే విధానం పూర్తిగా మారిపోతుందని ఇరాన్ హెచ్చరించింది. ఇప్పటికే ఇరాన్‌ International Atomic Energy Agency తో సంప్రదింపులు జరుపుతోంది. ఈ చర్చలు సానుకూలంగా సాగినట్టు సమాచారం. అయితే...ఈ విషయంలో ఇరాన్ చాలా తొందరపడుతోంది. ఈ తొందరపాటుపై IAEA ఆందోళన వ్యక్తం చేస్తోంది. అన్ని విధాలుగా ఆలోచించి ముందుకెళ్లాలని సూచిస్తోంది. అటు ఇరాన్ మాత్రం గతేడాది నుంచి కసరత్తు మొదలు పెట్టింది. పలు చోట్ల యురేనియం ఖనిజాల్ని కనుగొంది. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో తొందరపడడం మంచిది కాదని IAEA సూచిస్తోంది.