Iran Protests:


10 వేల మంది నిరసనలు..


ఇరాన్‌లో హిజాబ్‌కు వ్యతిరేకంగా జరుగుతున్న నిరసనలు రోజురోజుకీ తీవ్రమవుతున్నాయి. 40 రోజుల క్రితం మహసా అమినీ అనే యువతి హిజాబ్ ధరించనందుకు మొరాలిటీ పోలీస్‌లు ఆమెను అరెస్ట్ చేశారు. కస్టడీలో ఉండగానే ఆ యువతి మృతి చెందడంతో దేశం భగ్గుమంది. అప్పటి నుంచి మహిళలు రోడ్లపైకి వచ్చి హిజాబ్‌ను గాల్లోకి విసిరేస్తూ నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. మహసా అమినీ చనిపోయి 40 రోజులు పూర్తైన సందర్భంగా ఆమె హోమ్‌టౌన్‌కు వేలాది మంది ఆందోళనకారులు తరలివెళ్లారు. అక్కడే నిరసన చేపట్టారు. వెస్టర్న్ కుర్దిస్థాన్ ప్రావిన్స్‌లో ఆమె సమాధి వద్దకు వేలాది మంది రావటం స్థానికంగా కలకలం రేపింది. ఇరాన్ భద్రతా బలగాలు ఒక్కసారిగా అక్కడికి వచ్చి కాల్పులకు దిగాయి. అప్పటికే 10 వేల మంది అక్కడికి తరలి వచ్చారు. శాంతి భద్రతల దృష్ట్యా ఇరాన్ ప్రభుత్వం ఇంటర్నెట్‌ను నిలిపివేసింది. ఆర్మీ బేస్‌పై దాడి చేసేందుకే ఇంత మంది వచ్చారని కొందరు వాదిస్తున్నారు. ఇందులో నిజం ఉందా లేదా అన్నది స్పష్టత లేదు. ఈ నిరసనల్లో ఓ యువతి హిజాబ్‌ను తొలగించి కార్ ఎక్కి నిలబడిన ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆమె ముందు వేలాది మంది నిరసనకారులున్నారు. 










అంతర్జాతీయంగానూ మద్దతు..


ఇరాన్‌లో హిజాబ్‌కు వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమానికి అంతర్జాతీయంగా మద్దతు లభిస్తోంది. ముఖ్యంగా అమెరికా ఇరాన్‌కు సపోర్ట్ ఇస్తోంది. యూఎస్ మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా దంపతులు ఇప్పటికే ఇరాన్ మహిళలకు మద్దతు తెలుపుతూ లేఖ విడుదల చేశారు. ఇప్పుడు అమెరికాలోని పౌరులు కూడా వారికి అండగా నిలుస్తున్నారు. లాస్ ఏంజిల్స్, వాషింగ్టన్ డీసీలో వేలాది మంది రోడ్లపైకి వచ్చిఇరాన్ మహిళలకు మద్దతుగా నిలిచారు. AP న్యూస్ ఏజెన్సీ వెల్లడించిన వివరాల ప్రకారం...అన్ని వయసుల వాళ్లు రోడ్లపైకి వచ్చి ఇరాన్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. యూఎస్ నేషనల్ మాల్ (US National Mall) వద్ద ఇరాన్‌ దేశ జెండాను పట్టుకుని నిరసన తెలిపారు. "మేమంతా ఒక్కటవుతున్నాం. ఇక మీరు భయపడాల్సిందే" అంటూ ఇరాన్‌ను హెచ్చరిస్తూ నినాదాలు చేశారు. హిజాబ్‌పై పోరాడి పోలీస్‌ల కస్టడీలో మృతి చెందిన మహసా పేరునీ గట్టిగా పలుకుతూ నినదించారు. కొన్ని సంస్థలు ప్రత్యేక చొరవ చూపించి ఇలా ప్రజల్ని ఒక్కతాటిపైకి తీసుకొచ్చారు. కొందరు ఈ నిరసనల్లో పాల్గొనేందుకు టొరంటో నుంచి వచ్చారు. "Help Free Iran" అనే నినాదాలున్న టిషర్ట్‌లు వేసుకున్నారు కొందరు యువతులు. "మానవ హక్కుల్ని, స్వేచ్ఛను హరించే పాలకులు మాకు అవసరం లేదు" అని తేల్చి చెప్పారు. కొందరు ఇరాన్‌కు వ్యతిరేకంగా పాటలు కూడా పాడారు. "We want freedom" అంటూ గొంతెత్తారు. 


Also Read: Covid Patient in China: క్రేన్ సాయంతో కొవిడ్ రోగుల తరలింపు- చైనాలో షాకింగ్ ఘటన!