IPS PV Sunil demands removal of all posts of Deputy Speaker Raghuram: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఐపీఎస్ అధికారి సునీల్ కుమార్ హాట్ టాపిక్ అవుతున్నారు. ఇటీవల సీఎం పదవిని మీరు తీసుకోండి..మాకు ఉపముఖ్యమంత్రి పదవి ఇవ్వండంటూ ఓ సమావేశంలో మరో కులాన్ని ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. తాజాగా ఆయన మరో ట్వీట్ చేశారు. దర్యాప్తు సక్రమంగా జరగడం కోసం నన్ను సస్పెండ్ చేశారని.. రఘురామకృష్ణరాజు ని కూడా అన్ని పదవులనుండి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. బ్యాంక రుణాల ఎగవేత కేసులో రఘురామకృష్ణరాజుపై సీబీఐ విచారణకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అందుకే ఆయనను పదవుల నుంచి తీసేయాలని పీవీ సునీల్ డిమాండ్ చేస్తున్నారు.
పీవీ సునీల్ కుమార్ ప్రస్తుతం సస్పెన్షన్ లో ఉన్నారు. ఆయన గతంలో చెప్పకుండా విదేశాలకు వెళ్లారన్న కారణంగా విచారణ జరుగుతోంది. అందుకే సస్పెన్షన్ వేటు వేశారు. తనపై విచారణ జరుగుతున్నందని సస్పెన్షన్ వేటు వేసినందున.. రఘురామపైనా అలాగే చేయాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. ఆయన రఘురామను టార్గెట్ చేసుకోవడానికి కారణం ఉంది. రెండురోజుల ముందే పీవీ సునీల్ రఘురామను కస్టోడియల్ టార్చర్ కు గురి చేసిన కేసులో సిట్ విచారణకు హాజరయ్యారు.
గత వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో 2021లో అప్పటి నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజును సీఐడీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయనపై రాజద్రోహం కేసుల్ని సుమోటోగా పెట్టారు. అరెస్టు చేసి గుంటూరు సీఐడీ ఆఫీసుకు తీసుకెల్లారు. అక్కడ కస్టడీలో చిత్రహింసలకు గురిచేశారని రఘురామ ఆరోపణలు చేశారు. ఈ కేసులో మాజీ సీఐడీ చీఫ్ పీవీ సునీల్ కుమార్‌ను ప్రధాన నిందితుడిగా ఉన్నారు. ప్రస్తుత టీడీపీ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, రఘురామ ఫిర్యాదుతో కేసు మళ్లీ రిజిస్టర్ అయింది. సునీల్ కుమార్‌ను సస్పెండ్ చేసి, దర్యాప్తు చేపట్టారు.
ఇటీవల రాజకీయ వ్యాఖ్యలు చేస్తున్న ఆయనపై రఘురామ కేంద్రానికి ఫిర్యాదు చేశారు. సర్వీసులో ఉండి రాజకీయాలు మాట్లాడుతూ సర్వీస్ రూల్స్ ఉల్లంఘిస్తున్నారని ఆయనను సర్వీస్ నుంచి తొలగించాలని ఫిర్యాదు చేశారు. ఇప్పుడు ఆయనపై నేరుగా రాజకీయ ఆరోపణలు చేయడం హాట్ టాపిక్ అయింది.