Narayana Murthy Vs Wipro:
జాబ్ కోసం ప్రయత్నాలు..
ఇన్‌ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి ఒకప్పుడు విప్రోలో ఉద్యోగం కోసం ప్రయత్నించారట. ఈ మధ్య ఓ ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ ఆసక్తికర విషయం చెప్పారు. జాబ్ కోసం అప్లై చేసినప్పటికీ ఆయన అప్లికేషన్‌ని విప్రో రిజెక్ట్ చేసిందట. ఆ తరవాతే ఆయన సొంతగా కంపెనీ పెట్టాలన్న పట్టుదలతో ఇన్‌ఫోసిస్‌ని స్థాపించారు. ప్రస్తుతం ఐటీ ఇండస్ట్రీలో విప్రో, ఇన్‌ఫోసిస్ మధ్య గట్టి పోటీయే ఉంది. ఇప్పటికీ ఆ పోటీ కొనసాగుతోంది. ఆ మధ్య విప్రో ఫౌండర్ అజీమ్ ప్రేమ్‌జీ కూడా నారాయణ మూర్తిని తమ కంపెనీలో చేర్చుకోకపోవడంపై అసహనం వ్యక్తం చేశారు. తన జీవితంలో చేసిన అతి పెద్ద తప్పుల్లో నారాయణ మూర్తికి ఉద్యోగం ఇవ్వకపోవడమే అని ఒప్పుకున్నారు. ఒకవేళ ఆయనను తమ కంపెనీలో చేర్చుకుని ఉంటే కంపెనీ రూపురేఖలు ఇంకా మారిపోయి ఉండేవని అన్నారు. 1981లో నారాయణ మూర్తి ఇన్‌ఫోసిస్‌ని స్థాపించారు. ఆరుగురు స్నేహితులతో కలిసి సుధా మూర్తి ఇచ్చిన రూ.10 వేలతో కంపెనీ ప్రారంభించారు. అటు అజీమ్ ప్రేమ్‌జీ వెజిటబుల్ ఆయిల్ బిజినెస్ నుంచి క్రమంగా ఐటీవైపు మళ్లారు. ప్రస్తుతం ఇన్‌ఫోసిస్ కంపెనీ వాల్యూ రూ.6.65 లక్షల కోట్లుగా ఉండగా...విప్రో విలువ రూ. 2.43 లక్షల కోట్లకు పరిమితమైంది.
రీసెర్చ్ అసోసియేట్‌గా..
నారాయణ మూర్తి IIM Ahmedabadలో రీసెర్చ్ అసోసియేట్‌గా తన కెరీర్‌ని ప్రారంభించారు. ఆ తరవాత చీఫ్ సిస్టమ్ ప్రోగ్రామర్‌గా పని చేశారు. కొలీగ్‌తో కలిసి ఇండియాలోనే తొలి BASIC ఇంటర్‌ప్రిటర్‌ని తయారు చేశారు. అప్పటి నుంచి పూర్తిగా ఐటీపై ఫోకస్ పెట్టారు. సొంతగా ఐటీ వెంచర్‌ని మొదలు పెట్టారు. కానీ..పెద్దగా సక్సెస్ కాలేకపోయారు. ఆ తరవాత పట్టుదలతో ఇన్‌ఫోసిస్‌ని ప్రారంభించి అక్కడి నుంచి అంచెలంచెలుగా ఎదిగారు. 2019లో అజీమ్ ప్రేమ్‌జీ విప్రో బాధ్యతల నుంచి తప్పుకున్నారు. ఆయన తరవాత ఆయన కొడుకు రిషద్ ప్రేమ్‌జీ ఆ బాధ్యతలు తీసుకున్నారు. కానీ...ఇన్‌ఫోసిస్ విషయంలో మాత్రం ఇలా జరగలేదు. నారాయణ మూర్తి కొడుకు రోహన్ ఇన్‌ఫోసిస్ పగ్గాలు చేపట్టాలని అనుకోవడం లేదని తేల్చి చెప్పారు. ఈ విషయంలో తన కన్నా తన కొడుకే చాలా కచ్చితంగా ఉన్నాడని స్పష్టం చేశారు నారాయణ మూర్తి.
ఇన్ఫోసిస్ సహ వ్యవవస్థాపకులు నారాయణమూర్తి.. కీలక వ్యాఖ్యలు చేశారు. ఐటీ సెక్టార్‌లో మరింత అభివృద్ధి సాధించాలంటే... కొన్ని మార్పులు జరగాలన్నారు. మన దేశం ప్రపంచంతో పోటీ పడాలంటే మరింత వేగంగా ముందడుగులు వేయాలన్నారు. ముఖ్యంగా యువతకు కొన్ని సూచనలు చేశారాయన. ఐటీ రంగంలో పనిచేస్తున్న యువ ఉద్యోగులు.. వారంలో 70గంటల పనిచేయడానికి సిద్ధంగా ఉండాన్నారు. ఆర్థిక వ్యవస్థల పరంగా గణనీయ వృద్ధి సాధించిన దేశాల సరసన భారత్ నిలవాలంటే.. యువత తీవ్రంగా కష్టపడాల్సిన అవసరం ఉందన్నారు ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి.గత రెండు, మూడు దశాబ్దాలుగా అద్భుతమైన ప్రగతి సాధించిన ఆర్థిక వ్యవస్థలతో... మన భారత దేశం పోటీ పడాలంటే యువత తప్పకుండా వారానికి 70 గంటలు పని చేయాలని అన్నారు ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి. దేశంలో పని ఉత్పాదకత.... చాలా తక్కువగా ఉందని, ప్రపంచంలోనే అత్యల్ప ర్యాంక్‌లో ఉందని అన్నారు. ఈ వ్యాఖ్యలపై పెద్ద డిబేట్ జరిగింది.
Also Read: పంచెకట్టు నల్లకోటుతో ప్రధాని మోదీ సంక్రాంతి వేడుకలు, వీడియో వైరల్