Indonesia News:
ఏడాది జైలు శిక్ష..
ఇండోనేషియా కొత్త చట్టం తీసుకురానుంది. పెళ్లికి ముందు శృంగారం చేయడాన్ని నేరంగా పరిగణించనుంది. ఈ నేరానికి పాల్పడిన వారికి కనీసం ఏడాది పాటు జైలు శిక్ష విధించనున్నారు. పెళ్లి తరవాత భాగస్వామితో కాకుండా వేరే వాళ్లతో శృంగారంలో పాల్గొనడమూ నేరంగానే తేల్చి చెప్పనుంది. పెళ్లి చేసుకోకుండా సహజీవనం చేయడాన్నీ ఇకపై అనుమతించరు. దీనిపై పూర్తి స్థాయి నిషేధం విధించనున్నారు. ఈ కొత్త క్రిమినల్ కోడ్‌ను తీసుకురావాలని దశాబ్దాలుగా చర్చలు జరుపుతున్నారు. ఇన్నాళ్లకు అది నిజం కానుంది. డిసెంబర్ 15న ఈ చట్టాన్ని అమల్లోకి తీసుకురానున్నారు. "ఇండోనేషియా సంస్కృతిని, విలువలను కాపాడే ఇలాంటి చట్టాలు చేయడం పట్ల మేమెంతో గర్వంగా ఉన్నాం" అని ఇండోనేషియా డిప్యుటీ జస్టిస్ మినిస్టర్ ఎడ్వర్డ్ ఆనందం వ్యక్తం చేశారు. వచ్చే వారంలోగా ఈ బిల్‌ను పార్లమెంట్‌లో ప్రవేశ పెట్టేందుకు అంతా సిద్ధం చేసుకుంటున్నారు. ఈ చట్టం ఒకసారి అమల్లోకి వస్తే ఇండోనేషియా ప్రజలతో పాటు ఇక్కడికి వచ్చే విదేశీయులు కూడా ఈ రూల్స్‌ని ఫాలో అవ్వాల్సిందేనని ప్రభుత్వం తేల్చి చెప్పింది. అయితే...ఈ నిర్ణయంతో టూరిజం రంగంపై ప్రభావం పడుతుందని భావిస్తున్నారు. చాలా మంది టూరిస్ట్‌లు ఇండోనేషియాకు తరలి వస్తుంటారు. అటు ముస్లిం గ్రూప్‌లు మాత్రం ఈ చట్టానికి మద్దతునిస్తున్నారు. నిజానికి 2019లోనే ఈ బిల్ పాస్ అవ్వాల్సి ఉన్నా..అప్పట్లో దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమయ్యాయి. అందుకే..ప్రభుత్వం పక్కన పెట్టింది. మళ్లీ ఇప్పుడు దానికి చట్టంగా మార్చేందుకు పావులు కదుపుతోంది. ఈ బిల్‌లో ఎన్నో అభ్యంతరకరమైన విషయాలున్నాయంటూ అప్పట్లో పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. వందలాది మంది రోడ్లపైకి వచ్చి నినాదాలు కూడా చేశారు. దీనిపై దృష్టి సారించిన ప్రభుత్వం..బిల్‌లో చిన్న చిన్న మార్పులు చేర్పులు చేసింది. ఈ నేరానికి పాల్పడిన వారికి మరణ శిక్ష విధించాలని గతంలో బిల్‌లో చేర్చారు. దానిపై వ్యతిరేకత రావడం వల్ల ఆ శిక్షను ఏడాదికి తగ్గించారు.
వివాదాస్పద నిబంధనకు స్వస్తి..
ఇండోనేషియాలో గతంలో ఓ వివాదాస్పద నిబంధన ఉండేది. సైన్యంలో చేరే అమ్మాయిలు అన్ని పరీక్షల్లో అర్హత సాధించినా.. వర్జినిటీ టెస్టులో కూడా పాస్ కావాలి. ఈ విధానాన్ని ‘ది టూ ఫింగర్ టెస్ట్’ అని పిలుస్తారు. ఆ పరీక్షలో యువతి వర్జిన్ కాదని తేలితే సైన్యంలోకి తీసుకోరు. ఫలితంగా ఎంతోమంది అమ్మాయిలు ఆర్మీలో అవకాశాలను కోల్పోయారు. ఈ నేపథ్యంలో మానవ హక్కుల సంఘాలు కూడా ఆర్మీపై ఒత్తిడి తీసుకొచ్చాయి. ఇండోనేషియా ఆర్మీ చీఫ్ ఆఫ్ స్టాఫ్ జనరల్ అందికా పెర్కాశా స్పందిస్తూ.. ‘‘కొన్ని దశాబ్దాలుగా సాగుతున్న ఈ పరీక్షలకు ఇక ముగింపు పలుకుతున్నాం. పురుషుల తరహాలోనే మహిళలను ఆర్మీలో నియమిస్తాం. కేవలం ఫిట్‌నెస్, విద్యార్హతలు ఆధారంగానే నియామకాలు ఉంటాయి’’ అని తెలిపారు. దీంతో మానవ హక్కుల సంఘాలు ఈ నిర్ణయాన్ని స్వాగతించాయి. ఇండోనేషియా మహిళలు సైతం ఈ నిర్ణయంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Also Read: Viral Video: దొంగల్లో మంచి దొంగలూ ఉంటారండి, ఎంత నిజాయతీపరుడో - వైరల్ వీడియో