Indonesia Schools at 5 30 AM:



ఇదేం రూల్‌రా బాబు..


ఉదయమే లేచి త్వరత్వరగా రెడీ అయిపోయి స్కూళ్లకు వెళ్లడమంటే మహా చిరాగ్గా అనిపిస్తుంది చాలా మంది విద్యార్థులకు. స్కూల్‌ డేస్ ఎప్పుడు అయిపోతాయ్‌రా బాబా అని ఎదురు చూస్తుంటారు. టైమ్ టు టైమ్ అన్నీ పక్కా ప్లాన్ ప్రకారం చేయడం అవసరమా అని కొందరు చిరాకు పడుతుంటారు కూడా. ఉదయం 9 గంటలకు స్కూల్ అంటేనే ఇలా ఉంటే...ఇక తెల్లవారు జామునే పాఠాలు మొదలైపోతే...? ఏ సాకులూ చెప్పకుండా కచ్చితంగా స్కూల్‌కు ఆ టైమ్‌కే రావాలని ఆర్డర్‌ ఇస్తే..? ఇంకెంత చిరాగ్గా ఉండాలి. ఇండోనేషియాలోని విద్యార్థులు (Indonesia Schools) ఇప్పుడీ అవస్థలే పడుతున్నారు. అక్కడ ఓ సిటీలో పైలట్ ప్రాజెక్ట్ కింద ఉదయం 5.30గంటలకే స్కూళ్లు మొదలు పెట్టేస్తున్నారు. ఇదెక్కడి కర్మరా బాబూ అని చాలా బద్ధకంగా బడులకు వెళ్తున్నారు విద్యార్థులు. చెప్పాలంటే జాంబీల్లా నడుచుకుంటూ వెళ్తున్నారు. Kupangలో ఈ పైలట్ ప్రాజెక్ట్ మొదలు పెట్టారు. 12th గ్రేడ్ చదువుతున్న విద్యార్థులకే ఈ కండీషన్ పెట్టారు. దాదాపు 10 హై స్కూల్స్‌లో ఈ ప్రాజెక్ట్ అమలు చేస్తున్నారు. మరీ ఇంత ఉదయమే ఎందుకు..? అని అడిగితే అక్కడి అధికారులు ఏం సమాధానం చెబుతున్నారో తెలుసా..? "ఇలా చేస్తేనే కదా వాళ్లకు క్రమశిక్షణ అలవాటయ్యేది" అని అంటున్నారు. గత నెల గవర్నర్ విక్టర్ లైస్కోదత్ ఈ ప్రాజెక్ట్‌ను ప్రకటించారు. అప్పటి నుంచి దీనిపై ఎన్నో విమర్శలు వెల్లువెత్తాయి. విద్యార్థులు కూడా బాగా అలిసిపోతున్నారని తల్లిదండ్రులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. 


సాధారణంగా ఇండోనేషియాలో ఉదయం 7-8 గంటల మధ్యలో స్కూళ్లు మొదలవుతాయి. కానీ ఇప్పుడు ఉదయం 5.30కే టైమింగ్ మార్చేశారు. ఫలితంగా...అంత పొద్దున్నే లేచి విద్యార్థులంతా రోడ్లపైకి వచ్చి ట్యాక్సీల కోసం పడిగాపులు కాస్తున్నారు. ఇలా వెళ్లడం చాలా కష్టమైపోతోందని అంటున్నారు. 


"అంత చీకట్లో లేచి వాళ్లు బయటకు వెళ్లడం చాలా కష్టంగా ఉంది. ఇది కచ్చితంగా ఖండించాల్సిన విషయం. అంత చీకట్లో వాళ్లు బయటకు వెళ్తున్నారు. మరి వాళ్ల సేఫ్‌టీకి గ్యారెంటీ ఏంటి..?. స్కూల్‌కి టైమ్‌కు వెళ్లాలనే తొందరలో ఉదయం నాలుగు గంటలకే నిద్ర లేస్తున్నారు. రాత్రి వచ్చే సరికి బాగా అలిసిపోతున్నారు. వెంటనే పడుకుంటున్నారు. " 


- ఓ విద్యార్థి తల్లి 






ఆరోగ్యం సంగతేంటి..? 


విద్యార్థుల్లో క్రమశిక్షణ పెంచాలంటే ఎన్నో మార్గాలున్నాయని, ఇది మాత్రం సరైంది కాదని అంటున్నారు అక్కడి నిపుణులు. నిద్ర లేకపోవడం వల్ల వాళ్ల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడే ప్రమాదముందని హెచ్చరిస్తున్నారు. గతంలో American Academy of Pediatrics కీలక సూచనలు చేసింది. స్కూల్ టైమింగ్స్ ఉదయం 8.30 గంటల తరవాత ఉంటేనే విద్యార్థులకు సరిపడా నిద్ర ఉంటుందని, లేకపోతే హెల్త్‌పై ఇంపాక్ట్ చూపిస్తుందని వెల్లడించింది. అందుకు విరుద్ధంగా Kupangలో కొత్త రూల్ తీసుకురావడంపై స్థానికులు కూడా మండి పడుతున్నారు. ఇలాంటి పనికి రాని రూల్స్ పెట్టి పిల్లల ఆరోగ్యాన్ని పాడు చేస్తారా అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 


Also Read: Imran Khan Arrest: లండన్‌ ప్లాన్‌లో భాగంగానే నా అరెస్ట్, ఇదంతా నవాజ్ షరీఫ్ కుట్ర - ఇమ్రాన్ ఖాన్ ఆరోపణలు