ఇండోనేషియా దేశ రాజధాని జకార్తాలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. బాంటెన్ ప్రావిన్స్ జైలులో బుధవారం ఉదయం జరిగిన ఈ ఘటనలో 41 మంది ఖైదీలు మరణించారు. మరో 39 మంది తీవ్రంగా గాయపడ్డారు. బుధవారం తెల్లవారుజామున ఒంటి గంట సమయంలో జైలులో మంటలు చెలరేగాయి. దీంతో అగ్నిమాపకశాఖ సిబ్బందికి సమాచారం అందించారు. ప్రమాద స్థలికి చేరుకున్న అగ్నిమాపకశాఖ సిబ్బంది మంటలు ఆర్పేందకు యత్నిస్తున్నారు. సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు జైలు అధికారులు వెల్లడించారు.
జకార్తా శివార్లలోని టాంగెరంగ్ జైలులోని బ్లాక్ సి వద్ద అగ్నిప్రమాదం జరిగిందని.. ప్రభుత్వ అధికారి ఒకరు వెల్లడించారు. అగ్ని ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నట్లు ఇండోనేషియా న్యాయ మంత్రిత్వ శాఖ ఆధీనంలోని జైళ్ల శాఖ అధికార ప్రతినిధి రికా అప్రియంతి వెల్లడించారు.
ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉండటంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు జైలు అధికారులు అంచనా వేస్తున్నారు. మాదక ద్రవ్యాల అక్రమ రవాణా కేసుల్లో అరెస్టు అయిన ఖైదీలు ఈ బ్లాక్‌లో ఉంటారు. 122 మంది ఉండేందుకు ఈ జైలులో ఏర్పాట్లు ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. ప్రమాదం జరిగినప్పుడు అక్కడ ఎంత మంది ఉన్నారనే వివరాలు మాత్రం తెలియరాలేదు.
సామర్థ్యానికి మించి ఖైదీలు..
ఇండోనేషియా జైళ్లలో సామర్థ్యానికి మించి ఖైదీలను ఉంచుతున్నట్లు గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. ఇది ఇప్పుడు ఇండోనేషియాలో పెద్ద సమస్యగా మారింది. తాజాగా ప్రమాదం జరిగిన టాంగెరంగ్ జైలు విషయానికి వస్తే.. దీనిలో 1,225 మందిని ఉంచవచ్చు. అయితే ప్రస్తుతం ఈ జైలులో సామర్థ్యానికి మించి దాదాపు 2000 మందిని ఉంచారు. జైళ్లలో కనీస వసతులు కూడా సరిగా ఉండవనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. నిధుల కేటాయింపులో ప్రభుత్వం అలసత్వం వహిస్తుందనే వాదనలు కూడా ఉన్నాయి. ఈ క్రమంలో జైళ్లలో ఖైదీల మధ్య గొడవలు, తగదాలు వంటివి పరిపాటిగా మారాయి. కొంతమంది ఖైదీలు తప్పించుకోవడానికి కూడా యత్నాలు చేస్తుంటారు. ఇలా తప్పించుకునే క్రమంలో చిన్న చిన్న అగ్ని ప్రమాదాలు సంభవించిన ఘటనలు చాలా ఉన్నాయి.
Also Read: Petrol-Diesel Price, 8 September 2021: ఇవాళ్టీ పెట్రోల్, డీజిల్ ధరలు ఇవే.. తెలుగు రాష్ట్రాల్లో ఇలా..