India-Canada Clash: 


ఖలిస్థానీ ఉద్యమం ఉద్ధృతం 


కెనడాలో ఖలిస్థానీ ఉద్యమం ఉద్ధృతమవుతోంది. ఇప్పటికే భారత్, కెనడా మధ్య ఈ విషయంలో ఉద్రిక్తతలు నెలకొన్నాయి. విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ ప్రధాని మోదీతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఖలిస్థాన్ వేర్పాటువాద సమస్యని ఎలా పరిష్కరించుకోవాలనే దానిపై చర్చించారు. ఈ క్రమంలోనే ఖలిస్థాన్ వేర్పాటువాద సంస్థ Sikhs for Justice (SFJ) కెనడాలోని హిందువులకు వార్నింగ్ ఇచ్చింది. వీలైనంత త్వరగా దేశం విడిచి వెళ్లిపోవాలని హెచ్చరించింది. SFJ లీగల్ కౌన్సిల్ గురుపత్వంత్ సింగ్ పన్నన్ (Gurpatwant Singh Pannun) ఈ వార్నింగ్ ఇచ్చాడు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. హిందువులందరూ వెంటనే కెనడా విడిచి వెళ్లిపోవాలని బెదిరించాడు. 


"కెనడాలోని హిందువులంతా వీలైనంత త్వరగా ఇండియాకి వెళ్లిపోండి. మీరు సపోర్ట్ చేసేది ఇండియాకి మాత్రమే కాదు. ఖలిస్థాన్ మద్దతుదారుల భావ ప్రకటనా స్వేచ్ఛని అణిచివేయడాన్నీ సపోర్ట్ చేస్తున్నారు. ఖలిస్థాన్‌కి మద్దతునిచ్చే సిక్కుల వాక్‌ స్వాతంత్య్రాన్ని అడ్డుకుంటున్నారు. షహీద్ నిజ్జర్‌ని దారుణంగా హత్య చేస్తే దాన్ని సెలబ్రేట్ చేసుకున్నారు"


- గురుపత్వంత్ సింగ్ పన్నన్, సిక్స్ ఫర్ జస్టిస్ 






ఖలిస్థాన్ మద్దతుదారులు చాలా గొప్ప ఉద్యమం చేస్తున్నారని, దేశ చట్టాలు, రాజ్యాంగాన్ని గౌరవిస్తూనే ఉద్యమిస్తున్నారని స్పష్టం చేశారు గురుపత్వంత్ సింగ్. అయితే...భారత్ మాత్రం గురుపత్వంత్‌ని టెర్రరిస్ట్‌గా ప్రకటించింది. ఈ వీడియో వైరల్ అవడం వల్ల మరోసారి ఉద్రిక్తత నెలకొంది. కెనడాలో ఇటీవల జరిగిన ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో భారత్ ప్రమేయం ఉందంటూ కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో చేసిన సంచలన ఆరోపణలపై భారత్ స్పందించింది. జస్టిన్ ట్రూడో చేసిన ఆరోపణలను భారత విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ తీవ్రంగా ఖండించారు. కెనడా ప్రధాని వ్యాఖ్యలు పూర్తిగా అసంబద్ధమైనవని, ప్రేరేపితమైనవని అన్నారు. సర్రేలో ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ హత్యలో భారత్ పాత్ర ఉందనడాన్ని తోసిపుచ్చారు. 'కెనడా పార్లమెంటులో ఆ దేశ ప్రధాని జస్టిన్ ట్రూడో, ఆ దేశ విదేశాంగ శాఖ మంత్రి చేసిన ప్రకటన చూశాం. కెనడాలో ఏదైనా హింసాత్మక చర్యలో భారత ప్రభుత్వం ప్రమేయం ఉందనే ఆరోపణలు పూర్తిగా అసంబద్ధమైనవి, ప్రేరేపితమైనవి' అని విదేశాంగ శాఖ విడుదల చేసిన ఓ ప్రకటనలో కేంద్రమంత్రి జైశంకర్ పేర్కొన్నారు.ఇదే ఏడాది జూన్ లో సర్రేలోని గురుద్వారా ఎంట్రన్స్ వద్ద ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యకు గురైన విషయం తెలిసిందే. జలంధర్ లో హిందూ పూజారిని చంపిన కేసులో ఖలిస్థానీ టైగర్ ఫోర్స్ కు చెందిన నిజ్జర్ ప్రధాన నిందితుడిగా ఉన్నట్లు నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ప్రకటించింది. 


Also Read: అమెరికా మహిళతో చైనా విదేశాంగ మంత్రి వివాహేతర సంబంధం, అందుకే సైడ్ చేశారా?