India Canada Tensions:



ఉద్రిక్తతలు..


భారత్ కెనడా మధ్య ఉద్రిక్తతలు ముదురుతున్న క్రమంలో కెనడా ఎంపీ చంద్ర ఆర్య సంచలన వ్యాఖ్యలు చేశారు. ఖలిస్థాన్ వేర్పాటు వాదులు కెనడాలోని హిందువులపై దాడులు చేసే అవకాశముందని హెచ్చరించారు. ఇండియాకి వెళ్లిపోవాలని బెదిరింపులకు పాల్పడే అవకాశాలున్నాయని అన్నారు. కెనడాలోని హిందువులంతా శాంతంగా ఉండాలని, ఏమైనా అవాంఛనీయ ఘటనలు జరిగితే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు చంద్ర ఆర్య. ప్రత్యేకంగా ఓ వీడియో విడుదల చేశారు. ఇండో కెనడియన్ అయిన చంద్ర ఆర్య...ప్రధాని ట్రూడో పార్టీ అయిన  Liberal Party of Canada నుంచే ఎంపీగా గెలుపొందారు. 


"కెనడాలో హిందువులను లక్ష్యంగా చేసుకుని దాడులు జరుగుతున్నాయి. ప్రస్తుతం హిందువులంతా భయాందోళనలకు లోనవుతున్నట్టు తెలుస్తోంది. కానీ మీరేం భయపడాల్సిన పని లేదు. శాంతంగా, అప్రమత్తంగా ఉండండి. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరిగినా వెంటనే ప్రభుత్వానికి సమాచారం అందివ్వండి. కొందరు కావాలనే విద్వేషాలను రెచ్చ గొడుతున్నారు. హిందూ సిక్కు వర్గాలను విడదీయాలని కుట్ర చేస్తున్నారు. కెనడాలో ఉన్న సిక్కుల్లో చాలా మంది ఈ ఖలిస్థాన్ వేర్పాటువాదాన్ని సహించడం లేదు"


- చంద్ర ఆర్య, కెనడా ఎంపీ






సిక్కులకే నచ్చడం లేదు..


సిక్కుల్లో చాలా మంది ఖలిస్థాన్‌కి మద్దతు ఇవ్వడం లేదని స్పష్టం చేశారు చంద్ర ఆర్య. కెనడా పౌరులు ఈ ఉద్యమాన్ని బహిరంగంగా ఖండించలేకపోతున్నారని, ఉగ్రవాదులు ఏమైనా చేస్తారేమో అన్న భయంతో గడుపుతున్నారని వెల్లడించారు. హిందూ కమ్యూనిటీతో ఇక్కడి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులూ లేవని తేల్చి చెప్పారు. చాలా రోజులుగా హిందూ ఆలయాలపై దాడులు జరుగుతున్నాయని అసహనం వ్యక్తం చేశారు. అంతే కాదు. ఆ మధ్య కొందరు ఖలిస్థాన్ మద్దతుదారులు భారత మాజీ ప్రధాని ఇందిరా గాంధీ హత్యోదంతాన్ని పండగలా చేసుకున్నారు. పెద్ద ర్యాలీ నిర్వహించారు. దీనిపై భారత్ చాలా తీవ్రంగా స్పందించింది. ఈ ఘటననూ ప్రస్తావించారు చంద్ర ఆర్య. చట్టానికి అనుగుణంగానే వాళ్లపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఉగ్రవాదాన్ని పెంచి పోషించడం, భావ ప్రకటనా స్వేచ్ఛ పేరుతో విద్వేష పూరిత ప్రసంగాలు చేయడం చెల్లదని స్పష్టం చేశారు. కెనడాలోని హిందువుల సక్సెస్‌ని కొందరు జీర్ణించుకోలేకపోతున్నారని, అందుకే ఇలాంటి దాడులకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. భారత్ కెనడా మధ్య ఉద్రిక్తతలు  (India Canada Tensions) అంతకంతకూ పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కెనడాకు వెళ్లే వాళ్లకు వీసాలు జారీ చేసే ప్రక్రియను తాత్కాలికంగా సస్పెండ్ చేస్తున్నట్టు ప్రకటించింది. మళ్లీ ఆదేశాలిచ్చేంత వరకూ ఈ ఆంక్షలు కొనసాగుతాయని తేల్చి చెప్పింది. ఇవాళ్టి నుంచే (సెప్టెంబర్ 21) ఇది అమల్లోకి వస్తుందని వెల్లడించింది.


Also Read: ఖలిస్థాన్‌ వేర్పాటువాదం వెనక పాకిస్థాన్! సంచలన విషయం చెప్పిన నిఘా వర్గాలు