ప్రమాదం ఎలా జరిగింది..? 


ఈ మధ్య కాలంలో విమానాల ప్రమాదాలు పెరిగిపోతున్నాయి. కేవలం రెండు నెలల వ్యవధిలోనే స్పైస్‌జెట్ విమానాలు 8 సార్లు చిన్న చిన్న ప్రమాదాలకు గురయ్యాయి. 8 వారాల వరకూ 50% ఆక్యుపెన్సీతో స్పైస్‌జెట్‌ విమానాలను నడపాలని ఆదేశాలు వచ్చాయి. ఇండిగో విమానాలకూ ఇలాంటి ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. కలకత్తాలోని ఇండిగో విమానం టేకాఫ్ అయ్యే క్రమంలో రన్‌వేపై అదుపు తప్పింది. జారి పోయి పక్కకు వెళ్లిపోయింది. జోర్‌హట్‌-కలకత్తా రూట్‌లో నడుస్తున్న ఈ ఫ్లైట్‌కు తృటిలో ప్రమాదం తప్పిందని అధికారులు వెల్లడించారు. టెక్నికల్ ఇష్యూ కారణంగా గంటల పాటు విమానం అలాగే నిలిచిపోయింది. చివరకు ఫ్లైట్‌ను రద్దు చేశారు. ఈ ప్రమాదంలో ప్రయాణికులెవరూ గాయపడలేదు. ఎందుకిలా జరిగిందని విచారణ కొనసాగిస్తున్నారు. విమానం బయల్దేరే ముందు ఎలాంటి సమస్య లేదని, ఉన్నట్టుండి ఎందుకిలా జరిగిందో అర్థం కావటం లేదని అధికారులు వెల్లడించారు. స్థానిక జర్నలిస్ట్ ఒకరు ఇండిగో విమానం ప్రమాదానికి గురైన ఫోటోను షేర్ చేశారు. అందులో ఫ్లైట్ రన్‌వే నుంచి పూర్తిగా పక్కకు వచ్చినట్టు స్పష్టంగా కనిపిస్తోంది. "జోర్‌హట్ విమానాశ్రయంలో గువాహటి కలకత్తా ఫ్లైట్ రన్‌వే నుంచి స్లిప్ అయింది. పక్కనే ఉన్న మట్టి దిబ్బలోకి వెళ్లిపోయింది. మధ్యాహ్నం 2.20 నిముషాలకు బయల్దేరాల్సి ఉన్నా, ఈ ప్రమాదం కారణంగా ఆలస్యమైంది" అని ట్వీట్ చేశారు. ఇందుకు ఇండిగో బదులిచ్చింది. "ఈ ప్రమాదం ఎందుకు జరిగిందో విచారిస్తున్నాం. మా టీం అదే పనిలో ఉంది. మీరు సేఫ్‌గానే మీ గమ్యస్థానానికి చేరుకున్నారని భావిస్తున్నాం" అని ఇండిగో ట్వీట్ చేసింది. రాత్రి 8 గంటల వరకూ చూసి, అప్పుడు ఫ్లైట్‌ను క్యాన్సిల్ చేసింది ఇండిగో సంస్థ. ఈ ప్రమాదం జరిగిన సమయంలో విమానంలో 98 మంది ప్రయాణికులున్నట్టు అధికారులు తెలిపారు.