Indigo Crew Attackced by Passenger:
సిబ్బందిపై దాడి..
ఢిల్లీ నుంచి గోవా వెళ్తున్న ఇండిగో ఫ్లైట్ సిబ్బందిపై ఓ ప్రయాణికుడు దాడి చేయడం సంచలనం సృష్టించింది. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వాతావరణం సహకరించకపోవడం వల్ల ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో ఇండిగో ఫ్లైట్ నిలిచిపోయింది. దాదాపు 10 గంటల పాటు ప్రయాణికులు ఫ్లైట్‌లోనే ఉండిపోయారు. అప్పటికే చాలా మంది సహనం కోల్పోయారు. సిబ్బందితో గొడవ పడ్డారు. కానీ సిబ్బంది మాత్రం వాతావరణం సరిగ్గా లేదని, వెంటనే వెళ్లిపోలేమని చెప్పింది. "దయచేసి ఓపిక పట్టండి" అని రిక్వెస్ట్ చేసింది. ఆ సమయంలోనే ఓ ప్యాసింజర్ ఉన్నట్టుండి ముందుకి వచ్చాడు. ఫ్లైట్ కో కేప్టెన్‌పై పిడిగుద్దులు గుద్దాడు. పక్కనే ఉన్న ఎయిర్‌హోస్టెస్ వాళ్లిద్దరి మధ్య ఓ టేబుల్‌ని అడ్డుగా పెట్టింది. మళ్లీ దాడి చేయకుండా అడ్డుకుంది. ఈ ఘటనతో విమానంలోని ప్రయాణికులంతా షాక్ అయ్యారు. గట్టిగా అరిచారు. "ఎందుకిలా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. ఫ్లైట్ కదలకపోతే డోర్ తెరవండి వెళ్లిపోతాం" అని ఆ ప్రయాణికుడు గట్టిగా వాదించాడు. అందుకు ఎయిర్‌హోస్టెస్‌లు గట్టిగా అరుస్తూ సమాధానం చెప్పారు. ఇప్పటికిప్పుడు వెళ్లలేమని, ఇలా దాడి చేయడం సరికాదని వారించారు. ఇదంతా ఓ ప్యాసింజర్ వీడియో తీశాడు. సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దాడి చేసిన ప్రయాణికుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అన్ని గంటల పాటు ఫ్లైట్‌లోనే కూర్చోబెడితే ఎవరికైనా కోపం వస్తుంది కదా అని సోషల్ మీడియాలో కొందరు వాదిస్తున్నారు. మరికొందరు మాత్రం ఇలా చేయడం తప్పంటూ కామెంట్స్ పెడుతున్నారు.
ఎందుకు ఆలస్యమైంది..?
ఇండిగో ఫ్లైట్ ఢిల్లీ నుంచి ఉదయమే బయల్దేరాల్సి ఉంది. అయితే...ఇప్పటికే ఉత్తరాది రాష్ట్రాల్లో మంచు కమ్మేసింది. విజిబిలిటీ పడిపోయింది. ఫలితంగా ఫ్లైట్స్‌ని ఎక్కడికక్కడే నిలిపి వేశారు. చాలా వరకూ కంపెనీల ఫ్లైట్స్ ఆలస్యమయ్యాయి. దాదాపు 168 విమానాల సర్వీస్‌లకు అంతరాయం కలిగింది. 100 వరకూ ఫ్లైట్స్‌ని రద్దు చేశారు. ఈ క్రమంలోనే ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో గంటల పాటు అలాగే ఫ్లైట్ నిలిచిపోయింది. ఈ అసహనంతోనే ప్రయాణికుడు సిబ్బందిపై దాడి చేశాడు.