Kolkata Metro: దేశంలోనే పురాతన మెట్రో సర్వీసు కోల్‌కతా మెట్రో చరిత్ర సృష్టించింది. భారత దేశంలోనే తొలిసారిగా ఓ మెట్రో.. నది కింద వేగంగా దూసుకెళ్లింది. హౌరా నుంచి కోల్‌కతాలోని ఎస్ప్లానేడ్ వరకు హుగ్లీ నది కింద రైలును నడిపారు. కోల్‌కతా నగరానికి ఈ రన్ చారిత్రాత్మక ఘట్టమని కోల్‌కతా మెట్రో జనరల్ మేనేజర్ పి ఉదయ కుమార్ రెడ్డి అభివర్ణించారు. హుగ్లీ నదిలో.. రైలు వెళ్లడం ఇదే తొలిసారని ఉదయ్ కుమార్ రెడ్డి అన్నారు. ఇది 33 మీటర్ల లోతులో ఉన్న అత్యంత లోతైన స్టేషన్. భారత్‌లో ఇలా జరగడం ఇదే తొలిసారి. కోల్‌కతా నగరానికి ఇది చారిత్రాత్మక ఘట్టం. వచ్చే 7 నెలల పాటు హౌరా మైదాన్ నుంచి ఎస్ప్లానేడ్ వరకు ట్రయల్ రన్ కొనసాగుతుందని తెలిపారు. దీని తర్వాత ప్రజల కోసం రెగ్యులర్ గా ప్రారంభిస్తారు.






45 సెకన్లలో 520 మీటర్ల దూరం..


ఈ సంవత్సరం హౌరా - ఎస్ప్లానేడ్ విభాగంలో వాణిజ్య సేవలు ప్రారంభం అవుతాయని భావిస్తున్నారు. హుగ్లీ నది కింద 520 మీటర్ల దూరాన్ని 45 సెకన్లలో ఈ మెట్రో అధిగమించింది. నది కింద ఉన్న ఈ సొరంగం.. నది అడుగున 32 మీటర్ల దిగువన ఉంది. ఈ విభాగం కోల్‌కతాలోని ఐటీ హబ్ సాల్ట్ లేక్‌లోని హౌరా మైదాన్, సెక్టార్ Vని కలుపుతోంది తూర్పు - పశ్చిమ మెట్రో కారిడార్‌. ఈ ప్రాజెక్ట్ కోల్‌కతా మెట్రో నార్త్ - సౌత్ లైన్ ఎస్ప్లానేడ్ స్టేషన్‌ను హౌరా, సీల్దాలోని భారతీయ రైల్వే స్టేషన్‌లతో కలుపుతుంది. 1984లో కోల్‌కతాలో ప్రారంభమైన ఈరైలు.. దేశంలోనే తొలి మెట్రో రైలుగా కూడా నిలిచింది. దీని తర్వాత భారతదేశ రాజధాని ఢిల్లీ.. 2002లో మెట్రో సేవలను అందించడం ప్రారంభించింది. కాలక్రమంలో మిగతా ప్రధాన నగరాల్లో మెట్రో తన సేవలను విస్తరించింది.