Indian Student Attacked in Chicago: అమెరికాలోని చికాగోలో భారతీయ విద్యార్థిపై దొంగలు దారుణంగా దాడి చేశారు. సాయం కోసం గట్టిగా అర్థిస్తూ రోడ్డుపై బాధితుడు పరిగెత్తిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రక్తస్రావం అవుతున్నా దొంగల దాడి నుంచి తప్పించుకునేందుకు పరుగులు పెట్టాడు. ఈ ఘటనపై హైదరాబాద్‌లోని బాధితుడు కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. అవసరమైన సాయం అందించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. బాధితుడి పేరు సయ్యద్ మజహిర్ అలీ. దొంగలు దాడి చేయడం వల్ల నోరు, ముక్కు నుంచి తీవ్ర రక్తస్రావమైంది. బాధితుడి భార్య భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్‌కి లేఖ రాసింది. వైద్యం అందించాలని విజ్ఞప్తి చేసింది. 


"చికాగోలో ఉన్న నా భర్త ప్రాణాలకు భద్రత లేదనిపిస్తోంది. ఈ విషయంలో చాలా ఆందోళనగా ఉంది. దయచేసి ఆయనకు సరైన వైద్యం అందించండి. వీలైతే నేనూ అమెరికాకి వెళ్లేందుకు తగిన ఏర్పాట్లు చేయండి. నా పిల్లలతో సహా నా భర్త దగ్గరికి వెళ్లేలా అనుమతించండి"


- బాధితుడి భార్య 






కుటుంబ సభ్యుల ఆందోళన..


చికాగోలోని ఇండియానా వెస్లేన్ యూనివర్సిటీలో మాస్టర్స్ డిగ్రీ చేశాడు సయ్యద్ మజహిర్. చికాగోలోని తన ఇంటి వద్దే నలుగురు దొంగలు వచ్చి తనపై దాడి చేసినట్టు వీడియోలో వివరించాడు. అక్కడి సీసీటీవీ ఫుటేజ్‌లోనూ ఈ దాడికి సంబంధించిన విజువల్స్ రికార్డ్ అయ్యాయి. ఏడాది కాలంగా అమెరికాలో భారతీయ విద్యార్థులపై దాడులు పెరుగుతున్నాయి. ఈ ఏడాదిలోనే నలుగురిపై దాడులు జరిగాయి. 


"నేను ఇంటికి వెళ్తుండగా నలుగురు వచ్చి నాపై దాడి చేశారు. జారి కింద పడిపోయాను. ఆ తరవాత వాళ్లు నాపై పిడిగుద్దులతో దాడి చేశారు. దయచేసి నాకు సాయం చేయండి"


- సయ్యద్ మజహిర్ అలీ, బాధితుడు 


అమెరికాలోని న్యూజెర్సీలో భారత్‌కి చెందిన ఓ యువతి అదృశ్యమైంది. నాలుగేళ్ల క్రితం కనిపించకుండా పోయిన ఈ యువతి కోసం ఇంకా అన్వేషిస్తూనే ఉన్నారు. ఈ క్రమంలోనే గతేడాది డిసెంబర్‌లో FBI కీలక ప్రకటన చేసింది. ఈ యువతి ఆచూకీ తెలిపిన వారికి 10 వేల డాలర్లు నజరానాగా ఇస్తామని వెల్లడించింది. 2019 ఆగస్టు 29వ తేదీన చివరిసారి జెర్సీ సిటీలోని తన అపార్ట్‌మెంట్ నుంచి బయటకు వస్తూ కనిపించింది (Mayushi Bhagat Missing) మయూషి భగత్. గతేడాది మే 1వ తేదీన ఆమె కుటుంబ సభ్యులు మిస్సింగ్ కంప్లెయింట్ ఇచ్చారు. ఆమె అదృశ్యమైనప్పటి నుంచి జాడ తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు పోలీసులు. కానీ ఇప్పటికీ ఆచూకీ దొరకలేదు. గతేడాది జులైలో Missing Persons జాబితాలో భగత్ పేరుని చేర్చింది. అప్పటి నుంచి ప్రజల సహకారమూ అడుగుతోంది. ఎవరికి సమాచారం తెలిసినా తమకు చెప్పాలని కోరుతోంది. స్టూడెంట్ వీసాపై అమెరికా వెళ్లిన మయూషి న్యూయార్క్‌ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో చదువుతోంది. ఇంగ్లీష్, హిందీతో పాటు ఉర్దూ కూడా బాగా మాట్లాడుతుందని ఆమె స్నేహితులు పోలీసులకు వివరించారు. 


Also Read: Briton Visa Charges Hike: బెంబేలెత్తిస్తున్న బ్రిట‌న్ వీసా.. భారీగా పెంచేసిన చార్జీలు.. ఎవ‌రెవ‌రికి ఎంతెంత‌?