Indian Man Handcuffed Pinned To Floor At US Airport : అమెరికాకు చదువు కోసం వచ్చిన విద్యార్థిని అత్యంత అవమానకరంగా అక్కడి పోలీసులు వెనక్కి పంపారు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ విద్యార్థి హిందీలో  "మైం పాగల్ నహీం హూం, యే లోగ్ ముఝే పాగల్ సాబిత్ కరనా చాహ్తే హైం" ("నేను పిచ్చివాడిని కాదు, వీళ్లు నన్ను పిచ్చివాడిగా చూపించడానికి ప్రయత్నిస్తున్నారు") అని అరుస్తూ ఉండటం కనిపించినట్లుగా వీడియోను రికార్డు చేసిన వ్యక్తి సోషల్ మీడియాలో పోస్టు చేశాడు.  ఆ విద్యార్థి ఎవరు.. ఎందుకు డిపోర్టు చేశారన్నది ఇంకా బయటకు తెలియలేదు.     న్యూయార్క్‌లోని భారత కాన్సులేట్ జనరల్ జూన్ 9, 2025న Xలో  ఈ వీడియోపై స్పందించింది.  "నెవార్క్ లిబర్టీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో ఒక భారతీయ పౌరుడు సమస్యలను ఎదుర్కొంటున్నట్లు సోషల్ మీడియా పోస్ట్‌ల ద్వారా మాకు తెలిసింది. మేము ఈ విషయంలో స్థానిక అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నాము. భారతీయ పౌరుల శ్రేయస్సు కోసం కాన్సులేట్ ఎల్లప్పుడూ కట్టుబడి ఉంది" అని పేర్కొంది.  

కాంగ్రెస్ పార్టీ ఈ ఘటనను తీవ్రంగా ఖండించింది, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ విషయంలో నిశ్శబ్దంగా ఉన్నారని ఆరోపించింది. జనరల్ సెక్రెటరీ జైరామ్ రమేష్ 2013లో భారత దౌత్యవేత్త దేవయానీ ఖోబ్రగాడే యూఎస్‌లో అవమానకర చికిత్సను ఎదుర్కొన్న ఘటనతో పోల్చారు, అప్పటి యూపీఏ ప్రభుత్వం గట్టిగా స్పందించినట్లు గుర్తు చేశారు.  

 యూఎస్‌లో భారతీయుల డిపోర్టేషన్‌ను "అమానవీయం. ఆమోదయోగ్యం కాదని కాంగ్రెస్ నేతలంటున్నారు. నెటిజన్లు ఇలాంటి అవమానాలను ఎదుర్కొంటూ అమెరికాకు ఎందుకు వెళ్లాలని ప్రశ్నిస్తున్నారు. ఇటీవలి కాలంలో విద్యార్థి వీసా నిబంధనలు కఠినతరం చేశారు.  తరగతులకు హాజరు కాకపోవడం లేదా పూర్తి సమయం నమోదు చేయకపోవడం వంటి చిన్న ఉల్లంఘనలకు వీసా రద్దు చేస్తున్నారు.  ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆకస్మిక దాడులు, వీసా రద్దులు, హెచ్చరిక లేకుండా డిపోర్టేషన్‌లు పెరిగాయి.