Indian Army Day 2023:


సైనిక దినోత్సవం..


ఆర్మీ డే సందర్భంగా బెంగళూరులోని గోవిందస్వామి పరేడ్‌ గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ పాండే ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సైనికులను ఉద్దేశించి ప్రసంగించారు. "మొదటి సారి సైనిక దినోత్సవ కార్యక్రమాలను ఢిల్లీలో కాకుండా ఇలా వేరే చోట చేసుకుంటున్నాం. ప్రజలకు దగ్గరయ్యేందుకు ఇదో మంచి అవకాశం అని భావిస్తున్నాను. భవిష్యత్‌లో మన దేశ ప్రజలతో బంధం బలోపేతం అవడానికి ఇది ఉపకరిస్తుందని బలంగా నమ్ముతున్నా" అని అన్నారు. 


"ఎల్‌ఏసీ వద్ద మనం చాలా శక్తిమంతంగా ఉన్నాం. ఎలాంటి సవాలు ఎదురైనా ఎదుర్కోనేందుకు సిద్ధం. ఇప్పటికీ కొన్ని చోట్ల ఉగ్రవాదుల స్థావరాల ఉనికి కనిపిస్తూనే ఉంది. పంజాబ్,జమ్ముకశ్మీర్‌లలో డ్రోన్‌ల దాడులు పెరుగుతున్నాయి. డ్రగ్స్‌ని స్మగ్లింగ్ చేస్తున్నారు. అందుకే..ఎయిర్‌ డ్రోన్ సిస్టమ్స్‌తో పాటు జామర్స్‌నీ ఏర్పాటు చేశాం" 






- మనోజ్ పాండే, ఆర్మీ చీఫ్ జనరల్ 


కొత్త ఉగ్రసంస్థలు..


కొత్తగా పుట్టుకొచ్చిన కొన్ని ఉగ్రవాద సంస్థలు తమ ఉనికిని చాటుకునేందుకు టార్గెట్ కిల్లింగ్స్‌కు పాల్పడుతున్నాయని మండి పడ్డారు మనోజ్ పాండే. ప్రస్తుతం ఇది కూడా ఓ పెద్ద సవాలుగా మారిందని వివరించారు. భద్రతా బలగాలు ఆయా సంస్థల పని పట్టేందుకు ప్రయత్నిస్తు న్నాయని చెప్పారు. 


"గతేడాది ఇండియన్ ఆర్మీ ఎన్నో సవాళ్లు ఎదుర్కొంది. వీటిని అధిగమించేందుకు కొన్ని ప్రయత్నాలూ చేశాం. మా సమర్థతను పెంచుకున్నాం. సైనికులకు కఠినతరమైన శిక్షణ అందించాం. భద్రతా బలగాలను మరింత బలోపేతం చేశాం" 


- మనోజ్ పాండే, ఆర్మీ చీఫ్ జనరల్ 


యుద్ధానికి రెడీ..


ఇటీవలే ఢిల్లీలో ప్రెస్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేశారు...ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ పాండే. ఈ సందర్బంగా కీలక వ్యాఖ్యలు చేశారు. సరిహద్దుల్లో వాతావరణం భారత్‌కు అనుకూలంగానే ఉందని తేల్చి చెప్పారు. చైనాతో ఇప్పటికే చర్చలు కొనసాగు తున్నాయని వెల్లడించారు. ప్రస్తుతానికి పరిస్థితులు అదుపులోనే ఉన్నాయని తెలిపారు. అయితే...ఎలాంటి కవ్వింపు చర్యలకు పాల్పడినా భారత్‌ ఢీకొట్టేందుకు సిద్ధంగా ఉందని ధీమాగా చెప్పారు. 


"సరిహద్దులో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం. కానీ ఇండియన్ ఆర్మీ మాత్రం రెడీగా ఉంది. చైనాతో మనకు 7 రకాల సమస్యలున్నాయి. ఇందులో దాదాపు 5 సమస్యలు చర్చల ద్వారా పరిష్కరించుకున్నారు. మిలిటరీ కమాండర్ల స్థాయిలో చర్చలు ఇంకా కొనసాగుతున్నాయి. ఎలాంటి పరిస్థితి వచ్చినా పోరాడేందుకు సరిపడ సామగ్రి మా వద్ద సిద్ధంగా ఉంది" 
-ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ పాండే


ఇదే సమయంలో పాకిస్థాన్‌పై విరుచుకుపడ్డారు మనోజ్ పాండే. కావాలనే టార్గెట్ కిల్లింగ్స్‌కు పాల్పడుతోందని విమర్శించారు. ఇటీవల జరిగిన రాజౌరీ ఘటనను ప్రస్తావిస్తూ దాయాదిపై మండిపడ్డారు. 


"పాకిస్థాన్‌ టార్గెట్ కిల్లింగ్‌కు పాల్పడుతోంది. పిర్ పంజాల్ రేంజ్‌లో మైనార్టీలు లక్ష్యంగా దాడులు చేస్తోంది. ఇదే ప్రాంతంలో పాకిస్థాన్ సైనికులు మన భూభాగంలోకి చొచ్చుకు రావడానికి పదేపదే ప్రయత్నిస్తున్నారు. బీఎస్‌ఎఫ్‌తో పాటు ఆర్మీ కూడా ఈ చొరబాటును అడ్డుకుంటున్నాయి. డ్రోన్‌ల సాయంతో నిలువరిస్తోంది. శత్రు దేశ డ్రోన్‌లు మనవైపు రాకుండా జామర్స్ ఏర్పాటు చేశాం. మునుపటితో పోల్చుకుంటే హింసాత్మక ఘటనలు కొంత మేర తగ్గాయి. ఈశాన్య రాష్ట్రాల్లోనూ శాంతియుత వాతావరణం కనిపిస్తోంది" 


-ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ పాండే


Also Read: IndiGo Flight: ఫ్లైట్‌లో రక్తం కక్కుకున్న ప్రయాణికుడు, అత్యవసర ల్యాండింగ్ - ప్రాణాలు దక్కలేదు