Wrestlers Protest Today: రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలకు సంబంధించి రెజ్లర్లు ఏమాత్రం పోరు సడలించడం లేదు. మొదటి నుంచి ఒకే వైఖరి కనబరుస్తున్నారు. ఇప్పుడు బ్రిజ్ భూషణ్ సింగ్‌పై చర్యలు తీసుకోవడంలో జాప్యం ఏమిటని రెజ్లర్ భజ్ రంగ్ పూనియా ప్రశ్నించారు. బ్రిజ్ భూషణ్‌ పై చాలా ఆధారాలు ఉన్నాయని పూనియా చెప్పుకొచ్చారు. ఇన్ని ఆధారాలు ఉన్నా ముందుకు వెళ్లడంలేదేందుకని నిలదీశారు. 
రెజ్లర్ భజ్ రంగ్ పూనియా రైతులకు మద్దతు తెలిపేందుకు గానూ కురుక్షేత్ర చేరుకున్నారు. హర్యానాలో కనీస మద్దతు ధర (ఎంఎస్‌పి) అమలు చేయాలంటూ రైతులు ఆందోళనకు దిగగా.. వారి పోరాటానికి స్టార్ రెజ్లర్ మద్దతుగా నిలిచారు. వేదికపై నుంచి రైతులను ఉద్దేశించి భజ్ రంగ్‌ పూనియా మాట్లాడుతూ.. రైతులు పండించిన పంటలకు కనీస ధర కల్పించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.


'తేనీపై ఎందుకు చర్యలు తీసుకోలేదు'


బ్రిజ్‌ భూషణ్‌ తో పాటు, లఖింపూర్ ఖేరీలో రైతుల మరణాల సమస్యను భజ్ రంగ్ పూనియా లేవనెత్తారు. అన్నదాతల మృతికి కారణమైన కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రా తేనీపై ఇప్పటివరకు ఎందుకు చర్యలు తీసుకోలేదని భజ్ రంగ్ పూనియా ప్రశ్నించారు. రెజ్లర్లు అందరం ఇప్పటికీ బ్రిజ్‌ భూషణ్‌ కు వ్యతిరేకంగా పోరాడుతున్నట్లు గుర్తు చేశారు..


రెజ్లర్లు అందరం రైతుల వెంటే ఉన్నామని పూనియా పేర్కొన్నారు. తాము కూడా రైతు బిడ్డలమే అని, వారి బాధను అర్థం చేసుకోగలమని అన్నారు. అందుకే రైతులకు మద్దతుగా నిలిచేందుకు వచ్చినట్లు తెలిపారు.


పోలీసుల నోటీసులు..


WFI చీఫ్‌ బ్రిజ్ భూషణ్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు చేస్తున్న రెజ్లర్లను సాక్ష్యాధారాలు ఉంటే చూపించాలని ఢిల్లీ పోలీసులు అడిగారు. ఆయనను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్న రెజ్లర్లతో మాట్లాడిన పోలీసులు "ఎవిడెన్స్" కావాల్సిందేనని తేల్చి చెప్పారు. ఆయన లైంగికంగా వేధించాడు అనడానికి సాక్ష్యంగా ఫోటోలు, వీడియోలు లేదంటే ఆడియో క్లిప్స్ ఏమైనా ఉంటే ఇవ్వాలని ఇద్దరు మహిళా రెజ్లర్లకు చెప్పారు. వాటిని ఆధారాలతో సహా ఇస్తేనే కేసు బలంగా ఉంటుందని వెల్లడించారు. దీనిపై ఇప్పటికే ఓ రిపోర్ట్ కూడా తయారు చేశారు ఢిల్లీ పోలీసులు. బ్రిజ్ భూషణ్ చాలా సార్లు బలవంతంగా హగ్‌ చేసుకున్నాడని రెజ్లర్లు ఆరోపించారు. దీనికీ ఎవిడెన్స్ ఉందా అని ప్రశ్నించారు. ఈ ఏడాది ఏప్రిలే 21వ తేదీన ఇద్దరు మహిళా రెజ్లర్లు తమ స్టేట్‌మెంట్ ఇచ్చారు. బ్రిజ్ భూషణ్ తమతో అసభ్యంగా ప్రవర్తించాడని ఆరోపించారు. CRPC సెక్షన్ 91 కింద ఈ రెజ్లర్లకు నోటీసులిచ్చారు పోలీసులు. "ఆరోపణలకు సంబంధించి ఏ సాక్ష్యం ఉన్న కచ్చితంగా సబ్మిట్ చేయాల్సిందే" అని తేల్చి చెప్పారు. బ్రిజ్ భూషణ్ బెదిరింపు కాల్స్ కూడా చేశారన్న ఆరోపణలకూ ఆధారాలు అడిగారు. ఫోటోలు, కాల్‌ రికార్డింగ్‌లు, వాట్సాప్‌ చాట్‌లు ఏమైనా ఉంటే ఆ వివరాలు ఇవ్వాలని తెలిపారు.  అటు రెజ్లర్లు మాత్రం ఢిల్లీ పోలీసుల తీరుని తప్పుపడుతున్నారు. కావాలనే కేసులని తప్పుదోవ పట్టిస్తున్నారని మండి పడుతున్నారు. తమ స్టేట్‌మెంట్‌లు వెనక్కి తీసుకోవాలంటూ కొందరు ఒత్తిడి తెస్తున్నారని ఆరోపించారు. ఆయనపై కఠిన చర్యలు తీసుకోకపోతే ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తామని అల్టిమేటం ఇచ్చారు. 


కేంద్రంతో చర్చలు జరుగుతున్న తరుణంలో రెజ్లర్లు కీలక వ్యాఖ్యలు చేశారు. Asian Gamesలో ఆడతారా లేదా అన్న అనుమానాలపై క్లారిటీ ఇచ్చింది రెజ్లర్ సాక్షి మాలిక్. సోనిపట్‌లో మీడియాతో మాట్లాడిన ఆమె...ప్రస్తుత సమస్య పరిష్కారం అయ్యాకే ఆ గేమ్స్‌లో పాల్గొంటామని తేల్చి చెప్పింది. తాము ఎంత మానసిక క్షోభను అనుభవిస్తున్నామో ఎవరూ అర్థం చేసుకోవడం లేదని అసహనం వ్యక్తం చేశారు. ఈ నెల 15లోగా బ్రిజ్ భూషణ్‌ని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.