Wrestlers Protest: భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ ను జూన్ 9వ తేదీలోగా అరెస్టు చేయాలని భారతీయ కిసాన్ యూనియన్ నాయకుడు రాకేష్ టికాయత్ డిమాండ్ చేశారు. లేకపోతే దేశవ్యాప్తంగా ఆందోళనలు ఉద్ధృతం చేస్తామని కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. రెజ్లర్ల సమస్యలను పరిష్కరించాలని, వారి డిమాండ్లను నెరవేర్చాలని కోరారు. లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న బ్రిజ్ భూషణ్ ను జూన్ 9 లోగా అరెస్టు చేయాలన్నారు. లేదంటే అదే రోజూ నుంచి రెజ్లర్లతో సహా జంతర్ మంతర్ వద్ద భారతీయ కిసాన్ యూనియన్ కూడా దీక్షకు కూర్చుంటుందని హెచ్చరించారు. అలాగే దేశవ్యాప్తంగా తీవ్ర స్థాయిలో ఆందోళనలు నిర్వహిస్తామని పేర్కొన్నారు.
'రెజ్లర్లపై కేసులు ఉపసంహరించుకోవాలి'
రెజ్లర్లపై పెట్టిన కేసులను ఉపసంహరించుకోవాలని రాకేష్ టికాయత్ డిమాండ్ చేశారు. రెజ్లర్లకు సంఘీభావంగా ఉత్తరప్రదేశ్ లో రైతుల సంఘాలు ఖాప్ మహాపంచాయిత్ లు, పంజాబ్, హరియాణాల్లో నిరసనలు నిర్వహించినట్లు గుర్తు చేశారు. లైంగిక వేధింపులు బెదిరింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ ను అరెస్టు చేయాల్సిందేనని డిమాండ్ చేశారు.
వరల్డ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(WFI) ప్రెసిడెంట్, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ లైంగికంగా వేధించాడని, ఆయనను అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ రెజ్లర్లు ఉద్యమం చేస్తున్నారు. ఈ ఏడాది జనవరిలో ప్రారంభమైన ఈ నిరసనలపై స్పందించిన కేంద్ర క్రీడా శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్.. భారత స్టార్ బాక్సర్ మేరీకోమ్ నేతృత్వంలో ఏడుగురు సభ్యులతో ఓ కమిటీ వేసి విచారణకు ఆదేశించారు. విచారణ జరిపిన కమిటీ.. ప్రభుత్వానికి తమ నివేదికను అందజేసింది. అయితే ఈ నివేదికలో ఆ కమిటీ ఏ రిపోర్టు ఇచ్చిందో బహిర్గతం చేయలేదు. ఈ కమిటీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ పై రెజ్లర్లు చేసిన ఆరోపణలకు ఆధారాలు లేవని క్లీన్ చిట్ ఇచ్చినట్లు ప్రముఖ వార్తా సంస్థ పీటీఐ పేర్కొంది. దీంతో రెజ్లర్లు మళ్లీ ఆందోళన బాట పట్టారు. బ్రిజ్ భూషణ్ ను అరెస్టు చేయాలని, రెజ్లర్లు రోడ్లపైకి వచ్చి ఆందోళన చేస్తున్నారు.
మే 28వ తేదీన పార్లమెంట్ కొత్త భవనం ప్రారంభోత్సవం సందర్భంగా రెజ్లర్లు అంతా కలిసి పార్లమెంట్ వరకు ర్యాలీగా వెళ్లాలని ప్రణాళిక వేసుకున్నారు. దీని గురించి తెలుసుకున్న ఢిల్లీ పోలీసులు వారందరినీ అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఢిల్లీ పోలీసులు వ్యవహరించిన తీరు ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అంతర్జాతీయ క్రీడాకారులపై అలా ప్రవర్తించడంపై దేశవ్యాప్తంగా తీవ్ర నిరసన వ్యక్తం అయింది. ప్రతిపక్షాలు మోదీ సర్కారును, ఢిల్లీ పోలీసులను తీవ్రంగా విమర్శించారు.
ఆ తర్వాత మీడియా ముందుకు వచ్చిన రెజ్లర్లు.. తమకు న్యాయం చేయాలని వేడుకున్నారు. తాము సాధించిన పతకాలను, పురస్కారాలను గంగా నదిలో పారవేసి అనంతరం ఇండియా గేట్ వద్ద ఆమరణ నిరాహార దీక్ష చేస్తామని అన్నారు. రెజ్లర్లు అందరి పతకాలను మూటకట్టి గంగా నదిలో పారవేయాలని సిద్ధమైన సమయంలో రైతు ఉద్యమ నేత రాకేష్ టికాయత్ అక్కడికి చేరుకున్నారు. రెజ్లర్ల సమస్యకు పరిష్కారం వెతుకుదామని, ప్రస్తుతానికి పతకాలను గంగలో పారవేయడాన్ని వాయిదా వేసుకోవాలని కోరారు. రెజ్లర్ల చేతిలో ఉన్న పతకాల మూటను తీసుకుని, సమస్య పరిష్కారం కోసం నరేష్ టికాయత్ ఐదు రోజులు గడువు ఇవ్వాలని కోరగా మహిళా రెజ్లర్లు కన్నీళ్లు పెట్టుకుంటూనే అందుకు ఓకే చెప్పారు.