కరోనా కారణంగా గతేడాది వరకు చదువు ఊసే లేదు. చాలా మంది ఆన్‌లైన్ చదువులతో తంటాలు పడ్డా మరికొందరు పిల్లలు తమ అభిరుచులపై దృష్టి పెట్టి కొత్త స్కిల్స్ నేర్చుకున్నారు. ముఖ్యంగా స్కూల్‌లో కొత్తగా జాయిన్ కావాల్సిన వారు ఇలాంటి స్కిల్స్‌పై దృష్టి పెట్టారు. అలాంటి కిడ్స్‌లో దేవక్‌ ఒకడు 


కేరళలోని నీలేశ్వరంలో నివాసం ఉండే దేవక్‌ చేస్తున్న ఫీట్‌లకు ఫిదా అయిపోయిన యూనివర్సల్‌ రికార్డ్‌ ఫోరమ్‌ 'వండర్ కిడ్స్' విభాగంలో గ్లోబల్ అవార్డు విజేతగా ప్రకటించేసింది. దైర్యంతో గుర్రపు స్వారీ చేస్తున్న ఆయన స్కిల్‌ను గుర్తించి ఈ అవార్డు అందజేసింది. 


2వ తరగతి విద్యార్థి గత ఒకటిన్నర సంవత్సరాలుగా గుర్రపు స్వారీ చేస్తున్నాడు.  తన అభిరుచికి తగ్గట్టుగానే తల్లిదండ్రులు కూడా దేవక్‌ను ప్రోత్సహించారు. ఆ బుడతడు గుర్రపు స్వారీ చేస్తుంటే ఫేమస్‌ సినిమా పాటలు మైండ్‌లో ట్యూన్ అవుతాయి.   గుర్రపు స్వారీ పట్ల అతని పట్టుదల, సహనం అతన్ని గుర్రంపై స్వారీ చేసేలా చేస్తాయి. గంటకు సగటున 40 నుంచి 48 కి.మీ వేగంతో రైడ్ చేస్తాడీ దేవక్.


కోవిడ్ వ్యాప్తి టైంలో బిను పరక్కత్, శృతి దంపతులు మున్నార్‌లోని వారి రిసార్ట్‌లో ఐసోలేషన్‌లో ఉండే వాళ్లు. ఆ టైంలో  నాలుగున్నర సంవత్సరాల వయస్సు ఉన్న  పెద్ద కుమారుడు దేవక్ బిను గుర్రపు స్వారీ చేస్తానంటూ పట్టుబట్టాడు. సరదాగా మొదలైన ఈ స్కిల్‌ తర్వాత దేవక్‌ను ప్రత్యేక స్థానంలో నిలబెట్టింది. సందర్శకులు స్వారీ చేయడం కోసం ‘కర్ణన్’ అనే తెల్లని గుర్రాన్ని రిసార్ట్‌కు తీసుకొచ్చారు. దానిపై స్వారీ చేయాలన్న కుతూహలంతో తల్లిదండ్రులను ఒప్పించి స్వారీ స్కిల్ నేర్చుకున్నాడు. 


కోవిడ్ కారణంగా తీవ్ర విసుగు ఆందోళన నుంచి దేవక్‌ను ఉపశమనం కలిగించేందుకు స్వారీ చేసేందుకు ప్రోత్సహించారు. తమ రిసార్ట్‌లో ఉండే సంరక్షకుల పర్యవేక్షణలో స్వారీని నేర్చుకున్నాడు. ఎనిమిది నెలల కాలంలో గుర్రపు స్వారీలో ప్రాథమిక పాఠాలు నేర్చుకున్నాడని అతని తండ్రి బిను తెలిపారు. 
కరోనా సడలింపులు తర్వాత ఇంటికి వచ్చినప్పటికీ గుర్రపు స్వారీపై తన ఇష్టాన్ని తల్లిదండ్రులకు చెప్పాడు దేవక్. రోజులు గడిచిన కొద్దీ గుర్రాన్ని కొనివ్వాలని పట్టుబట్టారు. 


"మా కొడుకు గుర్రపు స్వారీపై ఆసక్తి చూపడం మమ్మల్ని ఆశ్చర్యపరిచింది. కానీ అతను దాని పట్ల మక్కువ చూపుతున్నాడని మేము గ్రహించిన తర్వాత, రెండో ఆలోచన రాలేదు, అని బిను చెప్పారు. "మేము మలయత్తూర్‌లోని టోలిన్స్ వరల్డ్ స్కూల్‌లో ట్రైనర్ అయిన రఫీక్‌ని కలిశాము. దేవక్ మేము బెంగుళూరు నుంచి తెచ్చిన తన కొత్త గుర్రం 'రాణి'తో శిక్షణ ప్రారంభించాడు," అని అతను చెప్పాడు.


దాదాపు ఒకటిన్నర సంవత్సరాల తర్వాత, దేవక్ 5 కిలోమీటర్ల పాటు రద్దీగా ఉండే ట్రాఫిక్ మధ్య హైవే వెంట గుర్రపు స్వారీ చేశాడు. గత వారం వండర్ కిడ్స్ విభాగంలో URF ప్రపంచ గుర్తింపును గెలుచుకున్నాడు. రద్దీగా ఉండే హైవే వెంట రోజూ గుర్రపు స్వారీ చేస్తూ పాఠశాలకు వెళ్తున్న బాలుడు ప్రజల దృష్టిని ఆకర్షించాడు. అతని వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. "అతని అభిరుచి ఏదైనా కావచ్చు, అది గుర్రపు స్వారీ లేదా మరేదైనా కావచ్చు, మేము అతని కలను సాధించడానికి అన్ని విధాలుగా హెల్ప్ చేస్తాం." అని బిను చెప్పారు.