Haryana CM Manohar Lal Khattar: ఆయన ఓ రాష్ట్రానికి ముఖ్యమంత్రి. ప్రజల కొరకు, ప్రజల చేత ఎన్నుకోబడిన వ్యక్తి. ఓ బహిరంగ సభలో పాల్గొన్నారు. అక్కడికి వేలాది మంది వచ్చారు. అందులో ఒక మహిళ తమకు ఉపాధి కోసం ఫ్యాక్టరీ కావాలని అడిగింది. అంతే ఆ సీఎంకు పట్టలేనంత కోపం వచ్చింది. మళ్లీ ఇక్కడి నుంచి చంద్రయాన్ వెళ్తే అందులో నిన్ను పంపిస్తానని ఎద్దేవా చేశారు. దీంతో అక్కడి వారంతా ఆ మహిళను వెంటనే కూర్చోమని బలవంతం చేశారు. మహిళ ప్రశ్నను, సీఎం సమాధానాన్ని కొందరు వీడియో సోషల్ మీడియాలో పెట్టారు. అది కాస్తా వైరల్ అవుతోంది.
వివరాలు.. హర్యానాలోని హిస్సార్ పట్టణంలో జన సంవాద్ అనే కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి స్వయం సహాయక గ్రూపు మహిళలు భారీగా తరలి వచ్చారు. ముఖ్యమంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మహిళలు తయారు చేసిన ఉత్పత్తులను సందర్శించిన ముఖ్యమంత్రి తర్వాత మహిళలతో కాసేపు మాట్లాడారు. వారు అడిగిన సందేహాలను నివృత్తి చేశారు.
ఇదే క్రమంలో ఓ మహిళ తమ గ్రామానికి సమీపంలో ఒక ఫ్యాక్టరీని నిర్మిస్తే మాలాంటి కొంత మహిళలకు ఉపాధి దొరుకుతుందని అభ్యర్ధించింది. ప్రస్తుతం తాము తీవ్ర పేదరికంలో బతుకుతున్నామని.. తమ సమస్యలు తీర్చేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆ మహిళ వేడుకుంది. అందుకు సీఎం బదులిస్తూ.. మళ్లీ ఇక్కడి నుంచి చంద్రయాన్ వెళ్తే అందులో నిన్ను పంపిస్తానని ఎద్దేవా చేశారు. దీంతో అక్కడి వారంతా ఆ మహిళను వెంటనే కూర్చోమని బలవంతం చేశారు.
ఈ వీడియో కాస్త వైరల్‌గా మారింది. సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ సమాధానంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అటు సోషల్ మీడియాలో నెటిజన్లు, ఇటు హర్యానాలోని ప్రతిపక్ష పార్టీల నేతలు తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. ఉపాధి కల్పించాలని మహిళ తన గోడు వినిపిస్తే కార్యక్రమానికి హాజరైన ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ వెటకారంగా సమాధానం ఇవ్వడం ఏంటని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. మహిళకు ముఖ్యమంత్రి వ్యంగంగా సమాధానం ఇవ్వడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇది ముమ్మాటికీ సీఎం అహంకార వైఖరికి నిదర్శనమని మండిపడుతున్నారు.
కాగా, ఈ సంఘటనపై ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) స్పందించింది. హర్యానా సీఎం ఖట్టర్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఉపాధి కోసం ఫ్యాక్టరీ కోరడమే ఆ మహిళ చేసిన ఏకైక నేరమా? అని ప్రశ్నించింది. గ్రామస్తులందరికీ ఉపాధి కల్పించమని ఓ మహిళ స్వయంగా ముఖ్యమంత్రిని కోరితే.. ఆయన అహంకార పూరితంగా సమాధానం ఇచ్చారని మండిపడింది. హర్యానాలో బీజేపీ అధికారంలో ఉండటం నిజంగా ఆ రాష్ట్ర ప్రజలు చేసుకున్న దౌర్భాగ్యమని విమర్శలు గుప్పించింది.
ఇలాంటి సీఎం ఉండటం సిగ్గుచేటని విమర్శించింది. సేవ చేసేందుకు ప్రజల చేత ఎన్నికైన వారే ప్రజలను ఎగతాళి చేస్తున్నారని దుయ్యబట్టింది. మోదీ స్నేహితులైన కోటీశ్వరులు తమ వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఇదే డిమాండ్ చేసి ఉంటే ఖట్టర్ వారిని ఆలింగనం చేసుకోవడంతో పాటు ప్రభుత్వం మొత్తాన్ని వారి సేవలో ఉంచేవారని ఆప్ మండిపడింది. సేవ చేయడానికి ఎన్నుకున్న సీఎం ప్రజలను ఎగతాళి చేస్తున్నారని దుయ్యబట్టింది. కాంగ్రెస్ పార్టీ కూడా ఇదే అంశంపై స్పందిస్తూ బీజేపీ ఆరెస్సెస్ మహిళలకు అంతకంటే ఏమి గౌరవమిస్తుందని విమర్శించింది. ఆ పార్టీ సీనియర్ నేత రన్‌దీప్ సూర్జేవాలా స్పందిస్తూ.. మధ్య ప్రదేశ్ నుంచి హర్యానా వరకు బీజేపీ అహాన్ని ప్రజలు అణచి వేస్తారని, పట్టపగలే చుక్కలు, చంద్రుడిని చూపిస్తారని అన్నారు.
ఆప్ నేత అనురాగ్ దండా ఖట్టర్ వ్యాఖ్యలపై మండిపడ్దారు. బీజేపీ నేతృత్వంలో ఇలాంటి వ్యక్తులు హర్యానా సీఎంగా ఉండడం దురదృష్టమన్నారు. అలాగే సీఎం ఖట్టర్ చేసిన ఈ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో క్లిప్‌ను ఆప్ ఎక్స్‌లో షేర్ చేసింది. ఇది సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను ఆమ్ ఆద్మీ పార్టీ అధికారిక సోషల్ మీడియాలో షేర్ చేస్తూ మనోహర్ లాల్ ఖట్టర్ లాంటి ముఖ్యమంత్రి ఉండటం నిజంగా సిగ్గుచేటు అని మండిపడింది. మహిళ పట్ల ముఖ్యమంత్రి వ్యవహరించిన తీరుపై ప్రతిపక్షాలు తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేశాయి. అయితే వైరల్ అవుతున్న వీడియోపై ముఖ్యమంత్రి ఇంకా స్పందించలేదు.