Tiger Video: ప్రపంచంలో ప్లాస్టిక్‌ భూతం అత్యంత వేగంగా విస్తరిస్తోంది. ప్లాస్టిక్ వినియోగం ఆరోగ్యానికి ప్రమాదకరమని, వాతావరణంపై తీవ్ర ప్రభావం చూపుతుందని తెలిసినా ప్రజల్లో ఏమాత్రం మార్పు రావడం లేదు. దైనందిన జీవితంలో నిత్యం వినియోగిస్తూనే ఉన్నారు. నగరాల నుంచి పట్టణాలకు, పట్టణాల నుంచి గ్రామాలకు విస్తరించిన ఈ ప్లాస్టిక్ క్రమంగా అడవులు, నదుల్లోకి చేరుతోంది. ఇప్పటికే జంతువులు ప్లాస్టిక్‌ తిని మృత్యువాత పడుతుండగా క్రమంగా దాని ప్రభావం అటవీ జంతువులపై పడే ప్రమాదం ఉందనే ఆందోళన వ్యక్తం అవుతోంది.

  


తాజాగా అడవిలో నీటి గుంట నుంచి ప్లాస్టిక్ వాటర్ బాటిల్‌ను పులి ఎత్తుకు పోతున్న వీడియో ఇంటర్నెట్‌లో హల్ చల్ చేస్తోంది. దీనిపై పలువురు నెటిజన్లు, ప్రకృతి, జంతు ప్రేమికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రముఖ వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ దీప్ కతికర్ ఈ వీడియోను చిత్రీకరించారు. అడవి నీటి గుంట నుంచి గంభీరమైన ఓ పులి తన నోటితో బాటిల్ పట్టుకుని కెమెరా వైపు నడుస్తున్నట్లు కనిపించింది. ఈ వీడియో మానవుల అనారిక చర్యను ప్రశ్నించినట్లు ఉందని, అడవుల్లోకి సైతం ప్లాస్టిక్‌ను తీసుకొచ్చారంటూ పులి ప్రశ్నిస్తున్నట్లు ఉందని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.






వీడియోపై దీప్ కతికర్ స్పందిస్తూ.. పులి ప్లాస్టిక్ బాటిల్ పట్టుకున్న వీడియో అడవులను శుభ్రంగా, పర్యావరణ హితంగా ఉంచాల్సిన ప్రాముఖ్యతను వివరిస్తూ.. ప్రజలకు స్పష్టమైన సందేశాన్ని పంపుతుందని వ్యాఖ్యానించారు. ఫిబ్రవరి 13న ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన డీప్.. ‘పులి తన చర్యల ద్వారా అద్భుతమైన సందేశాన్ని ఇచ్చింది. మేము మా అడవులను శుభ్రంగా ఉంచడానికి ప్రయత్నిస్తాం’ అంటూ క్యాప్షన్ పెట్టారు.


ఈ వీడియోకు నెటిజన్ల నుంచి అనూహ్య స్పందన వచ్చింది. నిమిషాల్లో 21 వేలకు పైగా వ్యూస్ సంపాదించింది. పులి బాటిల్ పట్టుకుని వస్తున్న దృశ్యాన్ని చూసి సోషల్ మీడియా యూజర్లు మైమరచిపోయారు. అంతే బాధపడ్డారు. ‘ఈ దృశ్యం అందంగా ఉంది, అదే సమయంలో విచారంగా ఉంది. మనం చేయాల్సిన పనిని ఒక పులి చేయవలసి వచ్చినందుకు సిగ్గుపడాల్సిందే’ అంటూ ఒకరు వ్యాఖ్యానించారు. 


‘అందమైన వీడియో. మన అడవిని ప్రేమిద్దాం. ప్లాస్టిక్ రహితంగా ఉంచడానికి ప్రయత్నిద్దాం’ అని మరొక వినియోగదారు చెప్పారు. ‘వావ్, ఎంత మంచి వీడియో! ప్లాస్టిక్ నిషేధం ఆవశ్యకత గురించి అవగాహన పెంచేలా ఉంది’ అని తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. మరి ఆ వీడియోను చూసి మీకు ఏమనిపించిందో చెప్పండి!