Independence Day 2025: భారత్ దేశానికి స్వాతంత్య్రం ఎప్పుడు వచ్చిందంటే 1947 ఆగస్టు 15 అని ఠక్కున చెప్పేస్తారు. సెలబ్రేషన్స్ ఎప్పుడంటే కూడా ఆగస్టు 15 అని చెబుతాం. భారతదేశాన్ని చాలా కాలం పాలించిన బ్రిటిష్ వాళ్లు మనకు ఆగస్టు 14 అర్థరాత్రి స్వాతంత్య్రం ఇస్తున్నట్టు ప్రకటించారు. అందుకే అప్పటి నుంచి ఆగస్టు15న స్వాతంత్య్రం వచ్చినట్టు సెలబ్రేషన్స్ చేసుకుంటాం. స్వాతంత్ర్యం కోసం పోరాడిన యోధులను గుర్తు చేసుకుంటాం. వారి ప్రసాదించిన స్వేచ్ఛను అనుభవిస్తూ వారి అడుగు జాడల్లో నడవాలని కోరుకుంటాం. అందుకే ఆ రోజు భారతీయులందరూ జెండా ఎగురవేస్తారు సంతోషంతో ఉత్సవాలు జరుపుకుంటారు. కానీ మన దేశంలోని ఒక నగరం మాత్రం ఆగస్టు 15న కాకుండా ఆగస్టు 14 రాత్రి జెండాను ఎగురవేస్తారు. ఆ నగరం గురించి తెలుసుకుందాం.
ఆగస్టు 14న ఎక్కడ జెండా ఎగురవేస్తారు
దేశంలో బిహార్ రాష్ట్రంలో పూర్ణియా అనే నగరం ఉంది, ఇక్కడ ప్రతి సంవత్సరం ఆగస్టు 14 రాత్రి జెండాను ఎగురవేస్తారు. స్వాతంత్ర్య సమరయోధుడు రామేశ్వర్ ప్రసాద్ సింగ్ తన సహచరులతో కలిసి స్వాతంత్ర్య సమయంలో 1947 ఆగస్టు 15 కంటే ఒక రోజు ముందు, ఆగస్టు 14 అర్ధరాత్రి జెండాను ఎగురవేశారని చెబుతారు. అతను రాత్రి 12.01 గంటలకు త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి ప్రజలకు మిఠాయిలు పంచి స్వాతంత్ర్య దినోత్సవం జరిపారు. ప్రజలకు శుభాకాంక్షలు చెబుతూ వేడుకలు చేశారు.
ఇలా ఎందుకు జరుగుతుంది?
1947లో రాత్రి 12 గంటల ఒక నిమిషానికి రేడియోలో భారతదేశ స్వాతంత్ర్యం ప్రకటించినప్పుడు, రామేశ్వర్ సింగ్, రామరతన్ సాహ్, షంసుల్ హక్ కలిసి జెండా చౌక్ వద్ద త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. రామేశ్వర్ ప్రసాద్ సింగ్ కుటుంబ సభ్యులు ఇప్పటికీ ఈ సంప్రదాయాన్ని పాటిస్తున్నారు. కొంతకాలంగా ప్రజలు జెండా చౌక్ వద్ద జెండాను ఎగురవేస్తున్నారు. వాఘా సరిహద్దు తర్వాత పూర్ణియా దేశంలోనే చీకటి రాత్రిలో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసే ఏకైక ప్రాంతమని ప్రజలు నమ్ముతారు.
ఈ సంవత్సరం ఎన్నో స్వాతంత్య్ర దినోత్సవం
భారతదేశం 1947 ఆగస్టు 15న స్వాతంత్ర్యం పొందిందని అందరికీ తెలుసు. సాధారణంగా లెక్కిస్తే, 2025లో 1947ని తీసివేస్తే 78 సంవత్సరాలు అవుతాయి. దీని ఆధారంగా, 2025లో 78వ స్వాతంత్ర్య దినోత్సవం జరుపుకుంటారని ప్రజలు భావిస్తున్నారు, అయితే వాస్తవానికి మొదటి స్వాతంత్ర్య దినోత్సవం 1947 ఆగస్టు 15న జరుపుకున్నారు. కాబట్టి మొదటి సంవత్సరాన్ని సున్నాగా పరిగణించరు. ఇప్పుడు సంవత్సరానికి ఈ సంఖ్య పెరుగుతుంది. కాబట్టి ఈసారి 79వ స్వాతంత్ర్య దినోత్సవంగా పరిగణించాల్సి ఉంటుంది.