Operation Sindoor: జమ్మూకశ్మీర్‌లో ఉగ్ర క్రీడకు తెరతీసిన పాకిస్థాన్‌లో దాక్కున్న ఉగ్రమూకలకు భారత్ గట్టిగానే బుద్ది చెప్పింది. పాకిస్థాన్ కలుగులో దాక్కున్న ఉగ్ర ఎలకలను మూకుమ్మడిగా తగలబెట్టేసింది. 9 స్థావరాలపై బాంబుల వర్షం కురిపించింది. ఆపరేషన్ సింధూర్ పేరుతో చేపట్టిన దాడులు పాకిస్థాన్‌ను గడగడలాడించాయి. ఇంతకీ ఈ ఆపరేషన్‌కు ఆ పేరు ఎందుకు పెట్టినట్టు.. దీని వెనుక కారణం ఏంటీ?
భారతీయ స్త్రీలకు కుంకుమ బొట్టుకు చాలా ప్రాణంతో సమానం. దైవంలా భావించే భర్తకు గుర్తుంగా తమ నుదుటన కుంకుమ బొట్టుు పెట్టుకుంటారు. అష్ట ఐశ్వర్యాలకు చిహ్నంగా ప్రాణానికి ప్రాణంగా ఈ కుంకుమను భావిస్తారు. కానీ పహల్గాంలో ఉగ్రమూకలు దాడి చేసి మహిళలను విడిచి పెట్టి కేవలం వారి భర్తలను మాత్రమే టార్గెట్ చేశారు. ఇలా వారి నుదుట సింధూర్‌ను ఉగ్రవాదులు చెరిపేశారు.
ఆపరేషన్ సింధూర్ అనేది కేవలం ఒక కోడ్ నేమ్ మాత్రమే కాదు. ఇది భారతీయ మహిళల గౌరవాన్ని కాపాడుతామని, దేశంపై దాడి చేసే వారికి తగిన గుణపాఠం చెబుతామని శత్రువుకు ఇచ్చే వార్నింగ్ బెల్. ఎవరైతే భారత మాతను ఆమె బిడ్డలను క్రూరంగా చంపారో, ఆడ బిడ్డల కుంకుమను చెరిపేశారు వారికి శిక్షిస్తామని ప్రధానమంత్రి వార్నింగ్ ఇచ్చారు. వారందరికి అన్నలా ఇంటి పెద్దలా భరోసా ఇచ్చామనే సంకేతాలు ఈ ఆపరేషన్ సింధూర్ ద్వారా పంపించారు.
ఈ ఆపరేషన్ ద్వారా భారత్ సాయుధ దళాలు సమష్టి ప్రయత్నం దేశం సమగ్రతను, పౌరుల భద్రతను కాపాడటానికి సిద్ధంగా ఉన్నాయని చెప్పేందుకు ఈ కోడ్ నేమ్ పెట్టారు. ఆపరేషన్ సింధూర్ అనేది కేవలం యాథృచ్చితంగా పెట్టింది కాదు. కావాలని పహల్గాం దాడిలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు సానుభూతిగా భారత్ దేశంలో ఉన్న మహిళలకు భరోసాగా ఈ నిర్ణయం తీసుకున్నారు.
పహల్గాం దాడిలో ఓ వీడియో ఇప్పటికీ అందరి మైండ్‌లో తిరుగుతోంది. పెళ్లై నెలలు కూడా నిండని ఓ జంటను ఉగ్రమూకలు టార్గెట్ చేసి భర్తను చంపేశారు. భర్త మృతదేహం ముందు నిస్సహాయంగా ఓ ఇల్లాలు కూర్చొని ఉంటుంది. ఆ దృశ్యం చూసిన యావత్ దేశం కన్నీళ్లు పెట్టుకుంది. ఆమె కన్నీళ్ల నుంచి వచ్చిందే ఈ ఆపరేషన్ సింధూర్.
"భయంకరమైన పహల్గామ్ ఉగ్రవాద దాడి జరిగిన రెండు వారాల తర్వాత, భారత సైన్యం, నావికాదళం, వైమానిక దళం సంయుక్తంగా బుధవారం తెల్లవారుజామున పాకిస్తాన్ పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్‌లోని తొమ్మిది ఉగ్రవాద లక్ష్యాలపై క్షిపణి దాడులు చేసింది.
'ఆపరేషన్ సిందూర్' కింద తెల్లవారుజామున 1.44 గంటలకు సైనిక దాడులు జరిగాయి. ఈ ఆపరేషన్ కింద, పాకిస్తాన్, పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్రవాద స్థావరాలపై దళాలు దాడి చేశాయి. అక్కడి నుంచే భారత్‌లో ఉగ్రవాద దాడులకు ప్రణాళికలు వేశారు.," అని సైన్యం ఒక ప్రకటనలో తెలిపింది.
మూడు దళాలు, భారత సైన్యం, నావికాదళం, వైమానిక దళం కచ్చితమైన లక్ష్యాలను టార్గెట్ చేసేలా ఆయుధ వ్యవస్థలను దాడుల్లో ఉపయోగించారని సైనిక వర్గాలు తెలిపాయి. దళాలు కామికేజ్ డ్రోన్‌లను - లూటరింగ్ మందుగుండు సామగ్రి వాడారు. లక్ష్యాన్ని విధ్వంసం చేసేలా రూపొందించిన ఆయుధాలు ఉపయోగించాయి, ఇవి సాధారణంగా వార్‌హెడ్‌ను కలిగి ఉంటాయి.
"పాకిస్తాన్ సైనిక సౌకర్యాలు లక్ష్యంగా చేసుకోలేదని" నొక్కి చెబుతూ తొమ్మిది ఉగ్రవాద స్థావరాలను లక్ష్యంగా చేసుకున్నట్లు సైన్యం తెలిపింది. ఈ విషయంలో చాలా సంయమనాన్ని పాటించినట్టు సైన్యం తెలిపింది.