Article 370 Abrogation: 



సుప్రీంకోర్టులో విచారణ..


జమ్ముకశ్మీర్‌లో ఆర్టికల్ 370 రద్దు చేయడాన్నిసవాలు చేస్తూ నేషనల్ కాన్ఫరెన్స్ లీడర్ ఒమర్ అబ్దుల్లా సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై సుప్రీంకోర్టు విచారణ మొదలు పెట్టింది. ఐదుగురు జడ్జ్‌లతో కూడిన ధర్మాసనం విచారణ కొనసాగిస్తోంది. దీనిపై స్పందించిన ఒమర్ అబ్దుల్లా ఈ విషయంలో తమకు సుప్రీంకోర్టు న్యాయం చేస్తుందన్న నమ్మకం ఉందని వెల్లడించారు. తమ సమస్యేంటో కోర్టుకి చెప్పామని తెలిపారు. 


"మా సమస్యలేంటో చీఫ్ జస్టిస్‌తో పాటు ఆయన అసోసియేట్ జడ్జ్‌కి వివరించాను. 2019 ఆగస్టు 5న జమ్ముకశ్మీర్‌కి ఆర్టికల్ 370ని రద్దు చేయడంపై మా అభిప్రాయాలేంటో కూడా చెప్పాను. సుప్రీంకోర్టు నుంచి ఎలాంటి న్యాయం కోరుకుంటున్నామో కూడా స్పష్టంగా చెప్పాను. చీఫ్ జస్టిస్ నన్ను కొన్ని ప్రశ్నలు అడిగారు. నేను ఒకటే విషయం చెప్పాను. ఆర్టికల్ 370ని రద్దు చేయడం రాజ్యాంగ వ్యతిరేకం. ఇన్నాళ్లకు మాకు మా గొంతు వినిపించే అవకాశం వచ్చింది. మా తరపున ఆలోచించి సుప్రీంకోర్టు ఓ నిర్ణయం తీసుకుంటుందని నమ్ముతున్నాం. ఇక్కడ మేం మాట్లాడేది కేవలం రాజ్యాంగం గురించి మాత్రమే. రాజకీయాలు చేయడం లేదు. జమ్ముకశ్మీర్‌కి సంబంధించి ఇది చాలా విషయం"


- ఒమర్ అబ్దుల్లా, జమ్ముకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి 






ప్రాథమిక సమాచారం ప్రకారం...ఐదుగురు సభ్యులతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్‌పై విచారణ చేపడుతుంది. చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వం వహిస్తారు. పిటిషనర్ల తరపున కపిల్ సిబల్ వాదిస్తున్నారు. 


మళ్లీ రాష్ట్ర హోదా..? 


జమ్ముకశ్మీర్‌కు రాష్ట్ర హోదాను పునరుద్ధరించనున్నారా..? గతేడాది నవంబర్‌లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చేసిన వ్యాఖ్యలను బట్టి చూస్తే కేంద్రం ఆ దిశగా అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది. ఆత్మనిర్భర భారత్‌పై ప్రసంగిస్తున్న సందర్భంలో ఈ సంకేతాలిచ్చారు నిర్మలా సీతారామన్. కేరళలోని తిరువనంతపురంలో ఓ కార్యక్రమానికి హాజరైన ఆమె ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. "ప్రధాని నరేంద్రమోదీ ఆర్థిక సంఘం చేసిన సిఫార్సులకు ఆమోదం తెలిపారు. అందుకే పన్నుల రూపంలో వచ్చిన ఆదాయంలో  42% మేర రాష్ట్రాలకు అందజేస్తున్నాం. ప్రస్తుతానికి దీన్ని 41%కి తగ్గించాం. ఇందుకు కారణం...జమ్ము, కశ్మీర్‌ను రాష్ట్రాల జాబితా నుంచి తొలగించడమే. బహుశా భవిష్యత్‌లో ఎప్పుడైనా జమ్ము, కశ్మీర్‌కు మళ్లీ రాష్ట్ర హోదా వస్తుండొచ్చు" అని వెల్లడించారు. 14వ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకే రాష్ట్రాలకు నిధులు పంచుతున్నట్టు స్పష్టం చేశారు. 14వ ఆర్థిక సంఘం చేసిన సిఫార్సులను ప్రధాని నరేంద్ర మోదీ మరో ఆలోచన లేకుండా అంగీకరించారని తెలిపారు.2019లో మోదీ సర్కార్ జమ్ము, కశ్మీర్‌కు స్వయంప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370ని తొలగించింది. వాటిని కేంద్ర పాలిత ప్రాంతాలుగా మార్చింది. అప్పటి నుంచి రాష్ట్ర హోదాపై చర్చ జరుగుతూనే ఉంది. ఇప్పుడు నిర్మలా సీతారామన్ వ్యాఖ్యలతో మరోసారి ఇది చర్చకు వచ్చింది. 


Also Read: Haryana Clashes: హరియాణా అల్లర్లకు ఇంటిలిజెన్స్ ఫెయిల్యూర్ కారణమా? రిపోర్ట్ ఏం చెబుతోంది?