పశ్చిమ బెంగాల్‌లో అవమానకరమైన ఘటన వెలుగు చూసింది. నిస్సహాయుడైన ఓ తండ్రి తన 5 నెలల చిన్నారి మృతదేహాన్ని బ్యాగులో పెట్టుకుని బస్సులో 200 కిలోమీటర్లు ప్రయాణించాల్సి వచ్చింది. ఆషిమ్ దేబ్ శర్మ (తండ్రి) ఆదివారం (మే 14) మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ అంబులెన్స్ డ్రైవర్‌కు చెల్లించడానికి తన వద్ద సరిపడినంత డబ్బు లేదని, అందుకని తన 5 నెలల చిన్నారి మృతదేహాన్ని బ్యాగ్‌లో ఉంచుకుని బస్సులో 200 కి.మీ. ప్రయాణించానని చెప్పుకొచ్చాడు.
బాధితుడు ఆషిమ్ దేబ్ శర్మ వీడియో సోషల్ మీడియాలో మరింతగా వైరల్ అవుతోంది. ఆయన మాట్లాడుతూ.. “నా 5 నెలల కుమారుడికి సిలిగురిలోని నార్త్ బెంగాల్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌లో ఆరు రోజుల జరిగింది. ఆ చికిత్స తర్వాత శనివారం (మే 13) రాత్రి బిడ్డ మరణించాడు. ఈ సమయంలో నేను అతని చికిత్స కోసం రూ.16 వేలు ఖర్చు చేశాను. అయినా ఫలితం లేకపోవడంతో చనిపోయిన నా బిడ్డను కలియగంజ్‌కు తీసుకెళ్లడానికి అంబులెన్స్ డ్రైవర్ రూ.8 వేలు అడిగాడు, అవి నా దగ్గర లేకపోవడంతో నేను బిడ్డను బ్యాకులో ఉంచి బస్సులో తీసుకొని వెళ్లాను’’ అని తెలిపారు.
అంబులెన్స్ అందుబాటులో లేనప్పుడు, మృతదేహాన్ని బ్యాగ్‌లో పెట్టుకుని డార్జిలింగ్‌లోని సిలిగురి నుండి నార్త్ దినాజ్‌పూర్‌లోని కలియాగంజ్‌కు సుమారు 200 కి.మీల దూరంలో బస్సులో ప్రయాణించినట్లు దేబ్‌శర్మ పేర్కొన్నారు. ఈ సమయంలో, తండ్రి ఎవరికీ దీని గురించి చెప్పలేదు. ఎందుకంటే ఈ విషయం సహ ప్రయాణీకులకు తెలిస్తే తనను బస్సులోంచి దింపేస్తారేమోనని భయపడ్డానని చెప్పాడు. పశ్చిమ్ బంగాల్‌లో 102 పథకం కింద నడుస్తున్న అంబులెన్స్ డ్రైవర్ మాట్లాడుతూ.. మృతదేహాలను తీసుకెళ్లేందుకు కాకుండా రోగులకు ఈ సౌకర్యం ఉచితమని చెప్పుకొచ్చారు.
ఈ ఏడాది జనవరిలో పశ్చిమ బెంగాల్‌లోని జల్‌పైగురి జిల్లాలో అలాంటి సంఘటన ఒకటి జరిగింది. అంబులెన్స్ డ్రైవర్‌కు నిర్ణీత రుసుము కంటే మూడు రెట్లు చెల్లించలేక ఓ వ్యక్తి తన తల్లి మృతదేహాన్ని దాదాపు 50 కిలోమీటర్లు తన భుజాలపై మోసుకుని ఇంటికి చేరుకున్నాడు.
ఈ విషయానికి సంబంధించి, పశ్చిమ బెంగాల్ శాసనసభలో ప్రతిపక్ష నాయకుడు (బీజేపీ) సుబేందు అధికారి (సువేందు అధికారి) తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వ 'స్వాస్థ్య సాతి' (Swasthya Sathi) అనే ఆరోగ్య బీమా పథకాన్ని ప్రశ్నించారు. మరోవైపు, చిన్నారి మృతిపై బీజేపీ రాజకీయాలు చేస్తోందని టీఎంసీ ఆరోపించింది. తన అధికారిక ట్విటర్ హ్యాండిల్‌లో.. దేబ్‌శర్మ మీడియాతో ఇంటరాక్ట్ అవుతున్న వీడియోను పంచుకుంటూ, ‘‘స్వాస్త్య సాథి పథకం సాధించాల్సింది ఇదేనా? ఇది దురదృష్టవశాత్తూ 'అగియే బంగ్లా' (అధునాతన బెంగాల్) మోడల్ అసలైన రూపంలా ఉంది’’ అని ట్వీట్ చేశారు.