West Bengal Elections 2026: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల రెండో దశ పోలింగ్ బుధవారం ఉదయం 7 గంటలకు ప్రారంభంకానుంది. ఈ క్రమంలో రాజకీయ వర్గాల మధ్య ఘర్షణలు తీవ్ర రూపం దాల్చుతున్నాయి. ముఖ్యంగా సౌత్ 24 పరగణాస్ జిల్లాలోని ఫాల్టా ప్రాంతంలో ఒక ఆసక్తికరమైన, అదే టైంలో ఉద్రిక్తతతో కూడిన ఘటన చోటు చేసుకుంది. ఉత్తర్‌ప్రదేశ్ కేడర్‌కు చెందిన 2011 బ్యాచ్ ఐపీఎస్ అధికారి అజయ్ పాస్ శర్మను కేంద్ర ఎన్నికల సంఘం ఇక్కడ పోలీస్ పరిశీలకుడిగా నియమించింది. అజయ్ పాల్ శర్మకు ఉత్తర్‌ప్రదేశ్‌లో ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్‌గా , సింగంగా పేరుంది.
ఫాల్టా నియోజకవర్గంలోని టీఎంసీ అభ్యర్థి జహంగీర్ ఖాన్ అనుచరులు ఓట్ల గుర్తింపు కార్డులను సేకరిస్తున్నారని, ఓటర్లను భయపెడుతున్నారని ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదులు అందాయి. ఈ ఫిర్యాదులపై స్పందించిన అజయ్ పాల్ శర్మ, నేరుగా జహంగీర్ ఖాన్ నివాసానికి వెళ్లి హెచ్చరించారు.
సింగం వార్నింగ్
సోమవారం నాడు జహంగీర్ ఖాన్ నివాసానికి చేరుకున్న అజయ్ పాల్ శర్మ, అక్కడ ఉన్న ఖాన్ బంధువులతో కఠినంగా మాట్లాడారు. ఓటర్లను ఎవరైనా ఇబ్బంది పెట్టినా, అక్రమాలకు పాల్పడినా సహించేది లేదు. జహంగీర్‌కు ఈ విషయం స్పష్టంగా చెప్పండి. నిరంతరం ఫిర్యాదులు వస్తున్నాయి. పరిస్థితులు ఇలాగే కొనసాగితే మేం కఠిన చర్యలు తీసుకుంటాం అని హెచ్చరించారు. పోలీస్ పరిశీలకుడు నేరుగా అభ్యర్థి ఇంటికి వెళ్లి ఇలా హెచ్చరించడం, బెంగాల్ రాజకీయాల్లో కలకలం రేపింది.
పుష్ప కౌంటర్
ఈ హెచ్చరికలై జహంగీర్ ఖాన్ అంతే ధీటుగా స్పందించారు. అజయ్ పాల్ శర్మ తీరును తప్పుబడుతూ ఇది బెంగాల్ ఆయన సింగం అయితే నేను పుష్ప, ఎవరికి తలవంచను అని వ్యాఖ్యానించారు. బీజేపీ ప్రయోజనాల కోసం ఉత్తర్‌ప్రదేశ్ పోలీస్ అధికారులు బెంగాల్ వచ్చి తమపై ఒత్తిడి తీసుకురావాలని చూస్తున్నారని, ఇది ప్రజాస్వామ్య వ్యవస్థలో అంగీకరించలేని విషయమని ఆయన మండిపడ్డారు. ఒక పోలీస్ పరిశీలకుడు నేరుగా అభ్యర్థికి ఇంటికి వెళ్లి బెదిరించడం ఏం నిబంధనల కిందకు వస్తుందని ఆయన ప్రశ్నించారు. తమ కార్యకర్తలను భయపెట్టడం ద్వారా గెలవాలని చూస్తున్నారని కానీ తాము దేనికీ భయపడబోమని ఖాన్ స్పష్టం చేశారు.
ఈ పరిణామాల తర్వాత ఫాల్టాలో పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారాయి. అజయ్ పాల్ శర్మ కాన్వాయ్ ఫాల్టా గుండా వెళ్తున్న సమయంలో టీఎంసీ మద్దతుదారులు జై బంగ్లా నినాదాలతో నిరసన తెలిపారు. కేంద్ర బలగాల వాహనాలు తోడుగా ఉన్నప్పటికీ నిరసనకారులు అధికారి తీరును తప్పుబడుతూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
మరోవైపు ఈ వివాదానికి కొత్త మలుపు ఇస్తూ ఓ మహిళా ఫాల్టా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అర్ధరాత్రి సమయంలో అజయ్ పాల్ శ్రమ, కేంద్ర బలగాలు ఇళ్లల్లోకి చొరబడి మహిళలపై అసభ్యంగా ప్రవర్తించారని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఈ అంశంపై టీఎంసీ అగ్రనాయకత్వం కూడా తీవ్రంగా స్పందించింది. పశ్చిమ బెంగాల్ మంత్రి చంద్రిమా భట్టాచార్య మాట్లాడుతూ... మీడియా ఆయనకు ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్ అని పేరు పెట్టింది. అటువంటి అధికారి ఇక్కడ ఏం చేస్తున్నారు అర్ధరాత్రి ఇళ్లల్లోకి వెళ్లి బెదిరించే అధికారం ఆయనకు ఎవరిచ్చారు అని ప్రశ్నించారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించడానికి ఇటువంటి అధికారులను ఇక్కడకు తీసుకొచ్చారని ఆమె ఆరోపించారు.
