Gas Cylinder Booking Rules:భారతీయ వంటగది బడ్జెట్‌పై అంతర్జాతీయ పరిణామాలు నేరుగా ప్రభావం చూపుతున్నాయి. మే నెల ప్రారంభం నుంచి గ్యాస్ సిలిండర్ వినియోగదారులకు కొత్త సవాళ్లు, మార్పులు ఎదురుకానున్నాయి. పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధం వాతావరణం వల్ల ఇంధన మార్కెట్లు అస్థిరంగా మారడం, సప్లై చైన్‌లో ఇబ్బందులు తలెత్తడంతో ప్రభుత్వం, చమురు సంస్థలు బుకింగ్‌ రూల్స్ కఠినతరం చేస్తున్నాయి. 

Continues below advertisement

మే నెలలో పెరగనున్న గ్యాస్ ధరలు

ఫిబ్రవరి చివరిలో ప్రారంభమైన పశ్చిమాసియా సంక్షోభం భారత్ ఇంధన మార్కెట్‌ను కుదిపేస్తోంది. దీని ప్రభావంతో చమురు మార్కెటింగ్‌ సంస్థలు అప్పటికే 14.2 కిలోల డొమెస్టిక్‌ ఎల్పీజీ సిలిండర్‌ ధరను దేశవ్యాప్తంగా రూ. 60 మేర పెంచాయి. వాణిజ్య అవసరాల కోసం వాడే 19 కిలోల సిలిండర్‌ ధరలు కేవలం ఒక్క నెలలోనే మూడుసార్లు పెంచారు. ఏప్రిల్ 2026లో మెట్రో నగరాల్లో దీని ధర 196 రూపాయల నుంచి 218 రూపాయలకు పెరిగింది. మే నుంచి ధరలలో మరోసారి సవరణలు జరిగే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. 

బుకింగ్ వ్యవధి కంటిన్యూ 

పెరుగుతున్న డిమాండ్, అక్రమ రవాణాను అరికట్టేందుకు పెట్రోలియం, నేచురల్ గ్యాస్ మంత్రిత్వ శాఖ బుకింగ్ ఫ్రేమ్‌వర్క్‌ను సవరించింది. గతంలో ఉన్న 21 రోజుల బుకింగ్ వ్యవధిని ఇప్పుడు 25 రోజులకు పెంచారు. అంటే ఒక సిలిండర్ బుక్‌ చేసిన తర్వాత రెండో సిలిండర్‌ కోసం కనీసం 25 రోజులు వేచి ఉండాలి. గ్రామీణ ప్రాంతాల్లో ఈ గ్యాప్‌ను 45 రోజులకు పెంచారు. 

Continues below advertisement

డెలివరీ అథెంటికేషన్ సిస్టమ్‌ శాశ్వతం 

గ్యాస్ సిలిండర్ల పంపిణీలో పారదర్శకత కోసం ప్రవేశపెట్టిన ఓటీపీ ఆధారిత డెలివరీ అథెంటికేషన్ సిస్టమ్‌ను మే నుంచి శాశ్వతం చేయాలని ఇండియన్ ఆయిల్, బీపీసీఎల్, హెచ్‌పీసీఎల్ సంస్థలు నిర్ణయించాయి. ప్రస్తుతం దేశంలో 98 శాతం బుకింగ్‌లు ఆన్‌లైన్‌లోనే జరుగుతుండగా, 94శాతం డెలివరీలు డీఏసీ ద్వారా విజయవంతంగా పూర్తి అవుతున్నాయి. దీని వల్ల సబ్సిడీ సిలిండర్లు పక్కదారి పట్టకుండా అడ్డుకోవచ్చని ప్రభుత్వం భావిస్తోంది. 

ఈ కేవైసీ తప్పనిసరి 

ప్రధానమంత్రి ఉజ్వల్ యోజన లబ్ధిదారులకు ఆధార్ అధారిత బయోమెట్రిక్ అథెంటికేషన్ తప్పనిసరి చేశారు. అయితే ఇప్పటి వరకు ఈ ప్రక్రియ పూర్తి చేయని వారు మాత్రమే ఇప్పుడు చేసుకోవాల్సి ఉంటుంది. సాధార కస్టమర్లు, అంటే పీఎంయూవై లబ్ధి పొందని వారు చేయాల్సిన అవసరం లేదు. ఉజ్వల్ లబ్ధిదారులు సంవత్సరానికి ఒకసారి మాత్రమే ఈ ప్రమాణీకరణను పూర్తి చేయాలి. ముఖ్యంగా ఒక ఆర్థిక సంవత్సరంలో ఎనిమిదో రీఫిల్‌ నుంచి సబ్సిడీ పొందాలంటే ఈ కైవైసీ పూర్తి చేయడం తప్పదు. 

పీఎన్జీకి మారకుంటే ఎల్పీజీ కట్‌ 

ప్రభుత్వం గృహ వినియోగదారులను ఎల్పీజీ నుంచి పైపుడ్‌ నేచురల్ గ్యాస్‌ వైపు మళ్లించే ప్రయత్నం చేస్తోంది. పీఎన్జీ సదుపాయం ఉన్న ప్రాంతాల్లో కచ్చితంగా ప్రజలు ఎల్పీజీ కనెక్షన్ వదులుకోవాల్సి ఉంటుంది. కొత్తగా ఎల్పీజీ కనెక్షన్ కోసం దరఖాస్తు చేసుకోవడంపై నిషేధం విధించారు. సౌకర్యం అందుబాటులో ఉన్న పీఎన్జీకి మారకపోతే మూడు నెలల తర్వాత సదరు ఇంటికి ఎల్పీజీ ఆపేస్తారు. గత మార్చి నుంచి ఇప్పటి వరకు దాదాపు 5.45 లక్షల కొత్త పీఎన్జీ కనెక్షన్‌లు ఇవ్వగా, మరో 2.62 లక్షల కనెక్షన్లకు మౌలిక వసతులు సిద్ధం చేస్తున్నారు. 

Also Read: హైదరాబాద్‌లో పైప్‌డ్ గ్యాస్ (PNG) కనెక్షన్ ఎలా పొందాలి? మధ్య తరగతికి LPG లేదా PNGలలో ఏది బెస్ట్..?

అంతర్జాతీయంగా సరఫరాలో ఇబ్బందులు ఉన్నప్పటికీ దేశీయ వినియోగదారులకు వంద శాతం సరఫరాను ప్రభుత్వం హామీ ఇస్తోంది. వాణిజ్య విభాగంలో మాత్రం ఆసుపత్రులు, విద్యాసంస్థలు, ఫార్మా, స్టీల్, ఆటోమొబైల్‌, వ్యవసాయ రంగాలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. వలస కార్మికుల కోసం ఐదు కిలోల సిలిండర్ల సరఫరాను ప్రభుత్వం రెట్టింపు చేసింది. 

Also Read: వంట గ్యాస్ లేకున్నా చేసుకోగలిగే హెల్తీ రెసిపీ.. టేస్టీ ఫుడ్​తో బరువు కూడా తగ్గొచ్చు

ప్రజలు మే 1 లోపు తమ ఈకైవైసీ స్టాటస్ చెక్ చేసి , పీఎన్జీ అందుబాటులో ఉన్న ప్రాంతాల్లో తగిన చర్యలు తీసుకోవడం ద్వారా అంతరాయం లేని గ్యాస్ సరఫరాను పొందవచ్చు.