Bengal second phase  polling: పశ్చిమ బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల సమరం క్లైమాక్స్‌కు చేరుకుంది. మొత్తం 294 స్థానాలకు గాను ఇప్పటికే తొలి దశ పోలింగ్ ముగియగా, బుధవారం జరగనున్న రెండో ,  చివరి దశ పోలింగ్‌కు సర్వం సిద్ధమైంది. ఈ విడతలో  142 స్థానాలకు ఎన్నికలు జరుగుతుండటంతో, బెంగాల్ పీఠం ఎవరిదో తేల్చే అసలైన ఫైనల్ ఫైట్  ఇదేనని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. కోల్‌కతా సహా ఏడు జిల్లాల్లో విస్తరించి ఉన్న ఈ నియోజకవర్గాల్లో సుమారు 3.21 కోట్ల మంది ఓటర్లు తమ తీర్పును వెలువరించనున్నారు.

Continues below advertisement

 అమిత్ షా వ్యూహం - మమతా బెనర్జీ ధీటుగా సమాధానం 

ఈ ఎన్నికలను కేంద్రంలోని బీజేపీ నాయకత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా బెంగాల్‌ను తమ ఖాతాలో వేసుకోవాలని వ్యూహాత్మక అడుగులు వేశారు. బెంగాల్ సంస్కృతికి విఘాతం కలిగిస్తున్నారంటూ దీదీ చేసిన విమర్శలను తిప్పికొడుతూ.. అభివృద్ధి, పారిశ్రామికీకరణ, నిరుద్యోగ సమస్యలను బీజేపీ అస్త్రాలుగా మలుచుకుంది. మరోవైపు, మమతా బెనర్జీ బెంగాల్ కూతురు అనే నినాదంతో ఒంటిచేత్తో పోరాడుతున్నారు. లక్ష్మీ భండార్ వంటి సంక్షేమ పథకాలు తనను గట్టెక్కిస్తాయని ఆమె నమ్ముతున్నారు.

Continues below advertisement

 కీలక నియోజకవర్గాలు - ప్రతిష్ఠాత్మక పోరు 

రెండో దశలో అత్యంత ఉత్కంఠ రేపుతున్న స్థానం  నందిగ్రామ్ . ఇక్కడ సువేందు అధికారి,  పవిత్ర కర్ మధ్య పోరు కేవలం ఒక సీటు కోసం జరుగుతున్నది కాదు, అది ఆత్మగౌరవ పోరాటంగా మారింది. అలాగే, సిలిగురిలో మేయర్ గౌతమ్ దేబ్, శంకర్ ఘోష్ మధ్య పట్టణ ఆధిపత్య పోరు సాగుతోంది. బహరంపూర్‌లో కాంగ్రెస్ సీనియర్ నేత అధీర్ రంజన్ చౌదరి తన రాజకీయ మనుగడ కోసం పోరాడుతుండగా, కృష్ణగంజ్‌లో సుకాంత బిస్వాస్ వంటి నేతల భవితవ్యం రేపు తేలనుంది. మమతా బెనర్జీ పోటీ చేస్తున్న భవానీపూర్‌లోనూ పోలింగ్ బుధవారం జరగనుంది. 

 పోలరైజేషనే పార్టీల వ్యూహం

రెండో దశలో పోలరైజేషన్, మతువా సామాజిక వర్గం ఓట్లు కీలకం కానున్నాయి. ముఖ్యంగా ఉత్తర 24 పరగణాలు, నదియా జిల్లాల్లో మతువా ఓటర్లను ఆకర్షించేందుకు బీజేపీ పౌరసత్వ సవరణ చట్టం  అంశాన్ని ప్రస్తావించగా, తృణమూల్ కాంగ్రెస్ దీనిని తీవ్రంగా వ్యతిరేకిస్తూ మైనారిటీ ఓట్లను ఏకీకృతం చేసే ప్రయత్నం చేసింది. విద్యావంతులు, యువత ఎక్కువగా ఉన్న కోల్‌కతా పరిసర ప్రాంతాల్లో ప్రభుత్వ వ్యతిరేకత ఏ మేరకు ఉందనేది ఫలితాలను శాసించనుంది.

పటిష్టమైన భద్రత

తొలి దశలో భారీగా ఓటింగ్ నమోదు కావడంతో, రెండో దశలోనూ అదే ఉత్సాహం కొనసాగుతుందని భావిస్తున్నారు. అయితే, బెంగాల్ ఎన్నికలంటేనే హింసాత్మక ఘటనలకు కేరాఫ్ అడ్రస్‌గా మారినందున, కేంద్ర బలగాలు భారీగా మోహరించాయి. సుమారు 1,448 మంది అభ్యర్థుల భవితవ్యం ఈ దశతో ఈవీఎంలలో నిక్షిప్తం కానుంది. మే 4న వెలువడే ఫలితాలు బెంగాల్ రాజకీయాల్లో  దీదీ  కొనసాగుతారా లేక  కమలం వికసిస్తుందా అన్నది తేల్చనున్నాయి.