AAP  For Sinha :   రాష్ట్రపతి ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ విపక్ష కూటమి ఉమ్మడి అభ్యర్థి యశ్వంత్ సిన్హాకు మద్దతు ప్రకటించింది. బీజేపీ తరపున బరిలో నిలబడిన ద్రౌపది ముర్ము అంటే తమకు ఎంతో అభిమానం ఉందని అయితే మద్దతు మాత్రం యశ్వంత్ సిన్హాకే ఇస్తామని ఆప్ ప్రకటించింది. ఇప్పటి వరకూ ఆమ్ ఆద్మీ పార్టీ ఎలాంటి ప్రకటనా చేయలేదు. రాష్ట్రపతి ఎన్నికల విషయంలో విపక్ష కూటమి సమావేశాలకూ హాజరు కాలేదు. రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ 18వ తేదీన జరగనున్నాయి. ఈ క్రమంలో ఏదో ఓ నిర్ణయం తీసుకోక తప్పని పరిస్థితి ఏర్పడింది. 





పార్టీ నేతలందరితో చర్చించిన కేజ్రీవాల్.. ముర్ము అంటే తమకు  గౌరవం ఉన్నప్పటికీ ఓట్లు మాత్రం యశ్వంత్ సిన్హాకే వేయాలని నిర్ణయించుకున్నారు. ఇటీవలి కాలంలో ఆ పార్టీ మంత్రి ఈడీ అరెస్ట్ చేసింది. డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా కూడా ఈడీ రాడార్‌లో ఉన్నారన్న ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో ఆప్ ఏ నిర్ణయం తీసుకుంటుందోనన్న ఉత్కంఠ ఏర్పడింది. విపక్ష పార్టీల్లో ఇప్పటికే పలు పార్టీలు ముర్ముకు మద్దతు ప్రకటించాయి. ఎన్డీఏలో లేని బిజూ జనతా దళ్, వైఎస్ఆర్‌సీపీ మద్దతు ప్రకటించాయి. 



అలాగే బీజేపీకి దూరంగా ఉన్న టీడీపీ కూడా ముర్ముకే మద్దతు తెలిపింది.  ఇక కాంగ్రెస్ తో పొత్తులో ఉన్న శివసేన, జేఎంఎం వంటి పార్టీలు కూడా ద్రౌపది ముర్ముకే మద్దతు తెలిపాయి. దీంతో ఎన్డీఏ అభ్యర్థికి భారీ ఆధిక్యం కనిపిస్తోంది. ఈ క్రమంలో ఆప్ మద్దతు ఇచ్చినా ఇవ్వకపోయినా ముర్ముకు విజయావకాశాలపై ఎలాంటి ప్రభావం చూపవు.  అయినప్పటికీ బీజేపీతో తమకు ఉన్న రాజకీయ వైరుధ్యం కారణంగా ఆ పార్టీకి మద్దతివ్వకూడదని ఆమ్ ఆద్మీ నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. సిన్హాకు కాంగ్రెస్,  టీఎంసీ, టీఆర్ఎస్,  డీఎంకే, ఆప్ వంటి పార్టీలు మద్దతిస్తున్నాయి.