Wayanad Landslide Survivors: "కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షాలు పడటం నదులు పొంగడం మాకు అలవాటే. కానీ మంగళవారం వేకువ జామున విపరీతమైన నీటి ప్రవాహ శబ్దాలు వినిపిస్తున్నాయి. ఎప్పుడూ వినని శబ్ధాలు. సుమారు 1.30కి లేచి చూసి షాక్ అయ్యాను. ఇళ్లంతా నీటిలో మునిగిపోయి ఉంది. కరెంటు లేదు. ఇన్వర్టర్ ఏమైందని సెల్‌ఫోన్ వెతికితే కనిపించలేదు. బయట ఉండాల్సిన జీప్ ఇంట్లోకి వచ్చి ఉంది. కనీసం నాలుగు అడుగులు వేద్దామన్నా ఖాళీ లేదు. " కేరళ ప్రకృతి విలయంలో చిక్కుకున్న ప్రత్యక్ష సాక్షి సుదర్శన చెబుతున్న భయానక విషయాలు.
కేరళలో కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు వయనాడ్ అల్లాడిపోయింది. దీనికి తోడు కొండచరియలు విరిగిపడటంతో వందల మంది కొట్టుకుపోయారు. శిథిలాలు తవ్వి తీస్తున్న కొద్దీ శవాలు వెలుగుచూస్తూనే ఉన్నాయి. ఈ ప్రకృతి విపత్తులో కొందరు సురక్షితంగా బయటపడి మంగళవారం వేకువజామున జరిగి విధ్వంసాన్ని గుర్తు చేసుకొని వణికిపోతున్నారు. అలాంటి వ్యక్తుల్లో సుదర్శన్ అనే డ్రైవర్ ఒకరు. ఆయన మీడియాతో మాట్లాడుతూ... తను ఎదుర్కొన్న భయాందోళనను ప్రపంచానికి తెలియజేశారు.
"మంగళవారం తెల్లవారుజామున 1.30 గంటలకు మెలకువ వచ్చింది. ఎప్పుడూ వినని నీటి ప్రవాహన శబ్దాలు వినిపించాయి. వెంటనే లేచాను. కరెంటు లేదు. చుట్టూ చీకటి అలుముకుంది. ఇన్వర్టర్ కూడా పని చేయడం లేదు. ఇంట్లో ఉన్న పరిస్థితి చూస్తే అది నీటిలో కొట్టుకుపోయిందని అర్థమైంది. ఇంటి బయట ఉండాల్సిన నా జీపు తలుపులు పగలగొట్టుకొని ఇంట్లోకి వచ్చేసింది. ఇంట్లో ఉన్న చాలా వస్తువులు పూర్తిగా నీట మునిగిపోయి ఉన్నాయి. రెండు అడుగులు కూడా వేయడానికి లేని పరిస్థితి ఉంది. ఏదోలా బయటకు వచ్చి చూస్తే మొత్తం మట్టి దిబ్బలే కనిపించాయి."
వాయనాడ్‌లోని చూరల్‌మలలో ఉంటున్న సుదర్శన్ డ్రైవర్‌గా వర్క్ చేస్తున్నాడు. కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాల గురించి పొరుగు వారితో మాట్లాడుతూ ఏం జరుగుతుందో అని భయపడ్డారు. అనుకున్నట్టే ఆ రాత్రి భయానక వాతావరణం వాళ్లకు అనుభవంలోకి వచ్చింది. మొదట ముండక్కై పట్టణాన్ని కొండచరియలు ముంచేశాయి. తర్వాత చూరల్‌మల గ్రామాన్ని కమ్మేశాయి.
సుదర్శన్ భయపడింది వాళ్ల అమ్మ భవానీ కోసం. ఆమె క్యాన్సర్ రోగి. తన ఇంట్లో మరికాసేపు ఉంటే కచ్చితంగా తామూ ముగనిగిపోతామని గ్రహించి సుదర్శన తన తల్లిని తీసుకొని అతి కష్టమ్మీద టెర్రస్‌పైకి వెళ్లాడు. "ఆ క్షణంలో మా అమ్మను రక్షించుకోవాలనే ఆలోచన ఒక్కటే నా బుర్రలో తిరుగుతోంది. ఎక్కడి వెళ్లాలో కూడా తెలియలేదు. ఎవరికైనా ఫోన్ చేద్దామా అంటే ఫోన్ లేదు. చుట్టుపక్కల చూస్తే ఎవరూ లేరు. అందుకే కవర్లతో కప్పి ఉన్న టెర్రాస్‌పైకి వెళ్లాం. అక్కడి నుంచి చూస్తే మొత్తం నదీ ప్రవాహమే కనిపిస్తుంది. మేం చూస్తుండగానే మా ఇంటికి సమీపంలో ఉన్న స్కూల్‌పై కొండచరియలు విరిగిపడ్డాయి."
Also Read: కేరళ ప్రకృతి విలయానికి 150 మందికిపైగా మృతి- సహాయ చర్యలు ముమ్మరం
మేడపై నుంచి ఆ భయానక దృశ్యాలు చూస్తూ వణికిపోయారు సుదర్శన్, వాళ్ల అమ్మ. సాయం చేసేందుకు కూడా వాళ్లకు ఎవరూ కనిపించలేదు. సాయం కోసం ఎదురు చూడటం.. వరద వస్తే కొట్టుకుపోవడంతో తప్ప వేరే దారి వాళ్లకు లేదు. "చూరల్‌మల నది మా ఇంటి వెనుక 400 మీటర్ల దూరంలో ప్రవహిస్తుంది. మా ఇంటి చుట్టూ నదీ ప్రవాహమే కనిపించింద. ఇరుగు పొరుగు ఇళ్లు నీటిలో కొట్టుకుపోతున్నాయి. అప్పుడు మా అమ్మతో ఒకటే చెప్పాను. 'ఈ ప్రపంచంలో మనకు నూకలు చెల్లాయని... తర్వాత మన ఇల్లే కొట్టుకుపోవచ్చని అన్నాను."అని సుదర్శన గుర్తు చేసుకున్నాడు.
చుట్టుపక్కల ఇళ్లు కొట్టుకుపోతున్నా.. సుదర్శన ఇల్లు మాత్రం ప్రకృతి విధ్వంసాన్ని తట్టుకొని నిలబడింది. మొత్తం మూడుసార్లు కొండచరియలు విరిగిపడినా వాళ్లు సురక్షితంగా బయటపడ్డారు. వారికి సమీపంలో ఉంటే ఓ కుటుంబంలోని 11 మంది సభ్యులు కనిపించకుండా పోయారు. వారిలో ఇద్దరి మృతదేహాలు లభించాయి. మిగతా వారి గురించి ఎలాంటి సమాచారం ఇంత వరకు లేదు. రాత్రి నుంచి ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ఉన్న సుదర్శన్, అతని తల్లిసహా మరో 20 మందిని రెస్క్యూ టీం ఉదయం ఏడు గంటలకు రక్షించి బయటకు తీసుకొచ్చారు. ఇప్పుడు సుదర్శన తన సిస్టర్ ఇంట్లో ఉంటున్నాడు.
తను ప్రమాదంలో ఉంటున్న సుదర్శన కొందరిని రక్షించగలిగాడు. సాయం చేయాలని కేకలు వేసిన వారి ఇంటిపైకి నిచ్చెనతో వెళ్లి వారిని తన ఇంటి డాబాపైకి తీసుకొచ్చాడు. ఇలా 20 మందిని రక్షించాడు. సుదర్శన ఇంటితోపాటు జీవనోపాధి అయిన జీపు కూడా పోయింది. ఇప్పుడు లైఫ్‌ను మొదటి నుంచి స్టార్ట్ చేయాలని అంటున్నాడు సుదర్శన్
Also Read: కేరళలో ఈ రేంజ్‌లో వరదలకు కారణాలేంటి? కొండచరియలు ఎందుకు విరిగిపడతాయి?