Wayanad News : కేరళ(Kerala)లోని వయనాడ్(Wayanad) వల్లకాడిగా మారింది. ప్రకృతి అందాలకు నెలవై గాడ్స్ ఓన్ కంట్రీగా పేరుగడించిన ఈ మలబార్‌తీరంపై ఆ దేవుడే కన్నెర్ర చేశాడు. భారీ వర్షాలకు కొండచరియలు విరిగిపడిన ఘటనలో మృతుల సంఖ్య ఇప్పటికే 150 దాటేసింది. కనిపించకుండాపోయిన వారి సంఖ్య మరో వందకు పైగా ఉంది. సహాయ చర్యలు కొనసాగుతున్నాయి. మట్టి దిబ్బల కింద ఇంకా ఎంతమంది ఉన్నారో తెలియడం లేదని విపత్తు నిర్వహణ బృందాలు తెలిపాయి.
వల్లకాడుగా మారిన వయనాడ్
పచ్చని కొండలతో ప్రకృతి అందాలకు నెలవైన కేరళ(Kerala)లో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ప్రకృతి విధ్వంసానికి పాల్పడితే ఎంతటి ప్రళయాన్ని సృష్టిస్తుందో నిరూపించింది. భారీ వర్షాలకు పెద్దఎత్తున కొండ చరియలు విరిగిపడి(Land slide)...150 మందికిపైగా మృతిచెందారు. సహాయ చర్యలు కొనసాగుతున్న కొద్దీ మట్టికింద కప్పబడిన మృతదేహాలు వెలుగు చూస్తున్నాయి. చనిపోయిన వారి సంఖ్య గంటగంటకు పెరుగుతోంది. వరద బీభత్సంతో మరో వందమంది జాడ తెలియడం లేదు. వీరంతా సురక్షితంగా ఉన్నారో లేక ప్రమాదానికి గురయ్యారో తెలియడం లేదు. వందలాది మంది తీవ్రంగా గాయపడి ఆస్పత్రుల్లో చికిత్స తీసుకుంటుండగా...వేలాది మంది నిరాశ్రయులయ్యారు. ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలకు సహాయ చర్యలకు ఆటంకం కలుగుతోంది.
ముమ్మరంగా సహాయ చర్యలు
కేరళ రాష్ట్ర విపత్తు స్పందన దళంతోపాటు, ఎన్డీఆర్‌ఎఫ్(NDRF) బృందాలు రంగంలోకి దిగి వడివడిగా సహాయ చర్యలు కొనసాగిస్తున్నాయి. ఇంకా ప్రమాదకర పరిస్ధితుల్లో ఉన్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వరద నీటిలో చిక్కుకున్న వారిని ఒడ్డుకు చేర్చారు. కొండచరియలు విరిగిపడిన ప్రాంతంలో ప్రొక్లెన్లతో మట్టి, రాళ్లను తొలగిస్తున్నారు. కొన్ని గ్రామాలను మొత్తం మట్టి కమ్మేయడంతో మృతుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉందని అనుమానిస్తున్నారు. వయనాడ్(Wayanad)లో ఎటుచూసిన శవాల దిబ్బలు కనిపిస్తున్నాయి. కనిపించకుండా పోయినవారి జాడ కోసం బంధువులు, ఆత్మీయులు రోదిస్తున్నారు. అర్థరాత్రి ప్రమాదం జరగడంతో మృతుల సంఖ్య భారీగా ఉండే అవకాశం ఉంది. పిల్లాపాపలతో నిద్రిస్తున్నవారు శాశ్వతంగా నిద్రించారు. ఒక్కసారిగా కొండచరియలు విరిగిపడటంతో తప్పించుకునే అవకాశం లేకుండా పోయిందని...ప్రాణాలతో బయటపడిన ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. అటు సైన్యం కూడా రంగంలోకి దిగింది. నేవీ,నౌక దళ విపత్తు సిబ్బంది సహాయ చర్యల్లో పాల్గొన్నారు.
Also Read: కేరళ వరదలు: అన్నీ కన్నీరు పెట్టించే దృశ్యాలే, ఎన్డీఆర్ఎఫ్ రెస్క్యూ - ఫోటోలు
వలస కార్మికుల జాడ లేదు
కేరళ పర్యాటక రాష్ట్రం కావడంతో వివిధ ప్రాంతాల నుంచి పెద్దఎత్తున వలస కార్మికులు ఇక్కడికి పని కోసం వచ్చారు. వారి వివరాలేవీ ప్రభుత్వం వద్ద లేవు. ఇలాంటి వారు దాదాపు 600 మందికి పైగా ఉన్నట్లు సమాచారం. వీరంతా ఏమయ్యారో తెలియడం లేదు. అయితే వర్షాలు మరింత పెరిగే అవకాశం ఉందన్న వాతావరణశాఖ హెచ్చరికల నేపథ్యంలో కేరళలో ఐదు జిల్లాలకు రెడ్ అలెర్ట్(Red Alert), ఏడు జిల్లాలకు ఆరెంజ్(Orange Alert) అలెర్ట్ జారీ చేశారు. అలాగే కాఫీ, తేయాకు, యాలకుల తోటల్లో పనిచేస్తున్న ఇతర ప్రాంతాలకు చెందిన కూలీల జాడ తెలియడం లేదు.
జాతీయ విపత్తుగా ప్రకటించాల్సిందే
సొంత నియోజకవర్గంలో ప్రకృతి బీభత్సంపై రాహుల్‌గాంధీ స్పందించారు. తక్షణం జాతీయ విపత్తుగా ప్రకటించి సహాయచర్యలు ముమ్మరం చేయాలని డిమాండ్ చేశారు. అలాగే చనిపోయిన కుటుంబాలకు పరిహారం సైతం భారీగా పెంచాలన్నారు. కట్టుబట్టలతో శిబిరాల్లో తలదాచుకున్న బాధితులను అన్నివిధాలుగా ఆదుకోవాలని కోరారు.
Also Read: కేరళలో ఈ రేంజ్‌లో వరదలకు కారణాలేంటి? కొండచరియలు ఎందుకు విరిగిపడతాయి?