ఖాన్‌తో గేమ్సా .. శాల్తీలు లేచిపోతాయ్ అనేది సినిమా డైలాగ్ కామెడీ కావొచ్చు కానీ.. దీన్నే కోబ్రాకు అన్వయిస్తే.. కోబ్రాలతో గేమ్స్ శాల్తీలు గల్లంతయిపోతాయ్ అని సీరియస్‌గా మార్చుకోవచ్చు. నిజంగానే ఖాన్‌్తో గేమ్స్ ఆడొచ్చు కానీ కోబ్రాలతో ఆడేవాళ్లు ఉంటారా?  అనే డౌట్ రావొచ్చు. కొంత మంది ఉంటారు.. ప్రొఫెషనల్స్ ఎవరితో ఆడినా వారికో లెక్క ఉంటుంది. ఇట్టే ఆడేసి సేఫ్‌గా బయటకు వస్తారు. కానీ కొంత మంది తాము లెజెండ్స్ అనుకుని కోబ్రాలతో గేమ్స్ ఆడితేనే మొదటికే మోసం వస్తుంది. అలాంటి అనుభవమే కర్ణాటకకు చెందిన మాజ్ సయ్యద్‌కు ఎదురయింది. శాల్తీ గల్లంతయినంత పనైంది.


కర్ణాటకకు చెందిన మాజ్ సయ్యద్‌కు ఓ యూట్యూబ్ చానల్ ఉంది. ఆయన పాములతో ఆటలాడి.. ఆ వీడియోలను అందులో పెడుతూ ఉంటాడు. చిన్న చిన్న పాములను ఆట పట్టిస్తూ వీడియోలు తీసి.. యూట్యూబ్‌లో పెడుతూంటే.. అందరూ భలే భలే అని అభినందిస్తూ వస్తున్నారు. దీంతో మనోడికి తనకు పాముల్ని ఓ ఆట ఆడించడంలో ఎక్కడా లేనంత ప్రావీణ్యం ఉందనుకున్నాడు. ఈ సారి మూడు కోబ్రా పాములను ఎదురుగా పెట్టుకుని విన్యాసాలు ప్రారంభించాడు. సూటు,  బూటు వేసుకుని పాములతో ఆట ప్రారంభించాడు. కానీ కాసేపటికే ఇలా అయింది. 


 






మూడు కోబ్రాలు కావడంతో ఒక దానితో ఆట ప్రారంభిచేలోపు ఇంకోటి కాటు వేసేసింది. ఎలా తప్పించుకోవాలో తెలియలేదు. ప్యాంట్ మీద నుంచి కాటు వేసినా... గట్టిగానే కోరలు దిగబడ్డాయి. దీంతో పాముల్ని అక్కడ వదిలేసి లబోదిబోముంటూ..  ఆస్పత్రికి పరుగెత్తాడు. విషం కాలు నుంచి పైకి ఎక్కకుండా జాగ్రత్తలు తీసుకున్నాడు. 


ఆస్పత్రి వైద్యులు నానా తంటాలు పడి.. 46 యాంటీ వీనం వయల్స్ ఆయన శరీరంలోకి ఎక్కించిన తర్వాత కాస్తంత తెరిపిన పడ్డాయి. ఓ దశలో ఆయన శాల్తీ గల్లంతయిపోతుందేమోనని కుటుంబసభ్యులు కంగారు పడ్డారు. అయితే చివరికి ఎలాగోలా బయటపడ్డారు. అందుకే కోబ్రాతో గేమ్స్ వద్దని ఆయనకు సలహాలిస్తున్నారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.