అమృత్‌సర్, పంజాబ్: దేశ ప్రజలారా ప్రశాంతంగా ఉండండి, సరిహద్దుల్లో మేం ఉన్నంత వరకు మీ మీద ఎవరూ కన్నెత్తి చూడలేరని ఓ జవాను చెప్పిన మాటలు వైరల్ అవుతున్నాయి. త్రివిధ దళాలు ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor)తో పాకిస్తాన్ ఉగ్రవాదులతో పాటు పాక్ సైన్యానికి గట్టిగా బుద్ధి చెప్పాక ప్రత్యర్థి తోక ముడిచింది.
పంజాబ్ సరిహద్దులో గస్తీ కాస్తున్న ఓ భారత సైనికుడు ఒకరు ఏఎన్ఐ మీడియాతో మాట్లాడుతూ.. మేం ఆపరేషన్ సిందూర్‌లో భాగం. మే 8- 9 తేదీ రాత్రి పాకిస్తాన్ సైన్యం మాపై అకస్మాత్తుగా కాల్పులు జరిపింది, కాల్పులకు తెగబడి దేశంలోకి చొరబడటానికి ప్రయత్నించారు. కానీ వారి ప్రయత్నాలను మేం అడ్డుకున్నాం. వెంటనే స్పందించిన భారత సైనికులం పాక్ సైన్యంపై కాల్పులు జరిపాం, వారి డ్రోన్లను నేలకూల్చాం. వారి పన్నాగాన్ని తిప్పికొట్టాం.
భారత్‌లో చొరబాటకు యత్నించిన పాక్ సైనికుల ప్రయత్నాన్ని నిర్వీర్యం చేశాం. మేం జరిపిన కాల్పులతో పాక్ తోక ముడిచింది. మేం జరిపిన ఎదురుకాల్పులు, దాడులతో పాక్ మా ముందు మోకరిల్లింది. ఉదయంలోగా పాక్ సైన్యం వెనక్కి తగ్గి వారి ఆర్మీ పోస్ట్‌పై శాంతిని కోరుతూ తెల్ల జెండాను ఎగురవేశారు. భారత సైన్యం దేశ సరిహద్దుల్లో మోహరించినంత వరకు, మన వైపు ఎవరూ కన్నెత్తి చూడలేరు. మేము సరిహద్దులో ఉన్నంత వరకు మీకు ఏ అపాయం ఉండదు. మీరు సురక్షితమేనని భావించాలని. దేశ ప్రజలకు హామీ ఇస్తున్నాం’ అని ఆ జవాన్ అన్నారు. జవాను మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. జై జవాన్ అని కామెంట్ చేస్తున్నారు.
ఆకాష్ క్షిపణి వ్యవస్థ, L-70 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్, భారత వైమానిక రక్షణ వ్యవస్థలు అమృత్‌సర్‌లోని స్వర్ణ దేవాలయాన్ని, పంజాబ్ నగరాలను పాకిస్తాన్ క్షిపణి దాడులు, డ్రోన్ దాడుల నుండి ఎలా రక్షించాయో భారత సైన్యం ప్రదర్శిస్తుంది.