Koramangala Fire Accident: 


కోరమంగళలో అగ్ని ప్రమాదం..


బెంగళూరులోని కోరమంగళలో ఓ మల్టీస్టోర్ బిల్డింగ్‌లో అగ్ని ప్రమాదం (Koramangala Fire Accident) సంభవించింది. ముందుగా ఓ కేఫ్‌లో మంటలు ఎగిసిపడ్డాయి. అక్కడి నుంచి పరిసర ప్రాంతాల్లోకి మంటలు వ్యాప్తి చెందాయి. ఆ తరవాత పేలుడు కూడా సంభవించింది. బిల్డింగ్‌లోని వాళ్లంతా గట్టిగా కేకలు వేస్తూ బయటకు వచ్చారు. అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. వెంటనే రెస్క్యూ టీమ్‌ ఘటనా స్థలానికి చేరుకుంది. బిల్డింగ్‌లో చిక్కుకున్న వాళ్లను సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. ఈ ప్రమాదంలో ఎలాంట ప్రాణనష్టం జరగలేదని అధికారులు వెల్లడించారు. ప్రాథమిక వివరాల ప్రకారం...బిల్డింగ్‌లోని కేఫ్‌లో గ్యాస్ సిలిండర్ పేలుడు కారణంగానే అగ్ని ప్రమాదం సంభవించింది. రెస్క్యూ టీమ్ వచ్చి కాపాడినప్పటికీ కొందరు తమ ప్రాణాలు కాపాడుకునేందుకు బిల్డింగ్ పై నుంచి దూకేశారు. ఓ వ్యక్తి మంటల్లో చిక్కుకున్నాడు. అక్కడి నుంచి ఎలాగైనా తప్పించుకోవాలని నాలుగో అంతస్తు నుంచి కిందకు దూకేశాడు. చెట్టుమీద పడడం వల్ల గాయాలయ్యాయి. వెంటనే ఆసుపత్రికి తరలించారు.





కేఫ్‌లో గ్యాస్ లీక్ అయిందని, అప్పుడే మంటలు అంటుకున్నాయని పోలీసులు వెల్లడించారు. ప్రాథమిక విచారణలో ఇదే తేలిందని వివరించారు. నిముషాల్లోనే మంటలు వ్యాపించాయని, కేఫ్‌లోని సిబ్బంది అంతా వెంటనే బయటకు వచ్చి ప్రాణాలు కాపాడుకున్నారని తెలిపారు. ఈ ఘటనలో రెండు బైక్‌లు పూర్తిగా కాలిపోయాయి. ఈ ప్రమాదం వల్ల కేఫ్‌ మొత్తం ధ్వంసమైంది. మొత్తం 8-10 సిలిండర్‌లు పేలి ఉంటాయని, అందుకే ఇంత నష్టం వాటిల్లిందని పోలీసులు చెప్పారు. ఇందులోనే వెహికిల్ షోరూమ్‌ కూడా ఉండడం వల్ల వాహనాలూ కాలి బూడిదైపోయాయి.