Bihar News :   ప్రభుత్వ అధికారులు లంచాలు తీసుకుంటారని అందరికీ తెలుసు. అయితే ఆ సొమ్మంతా ఏం చేస్తారు ? పరుపులుగా కుట్టించుకుంటారని.. గోడల్లో దాచుకుంటారని పాత సినిమాల్లో చూసి ఉంటాం. ఇప్పటి అధికారులు మరీ రాటుదేలిపోయారు. సూట్ కేసు కంపెనీల్లాంటివి పెట్టి హవాలా చేసేస్తున్నారు. కొంత మంది బంగారం లోకి మారుస్తున్నారు. చాలా మంది రియల్ ఎస్టేట్‌లోకి మళ్లిస్తున్నారు. కానీ కొంత మందికి లంచాలు ఎలా తీసుకోవాలో తెలుసు కానీ.. ఇలా దాచుకోవడం మాత్రం తెలియదు. అలాంటి వారిలో బీహార్‌కు చెందిన సంజయ్ కుమార్ రాయ్ కూడా ఒకరు. ఎందుకంటే ఆయన లంచాలు తీసుకుని గుట్టలకొద్దీ నగదు పోగేశాడు కానీ దాన్ని దాచుకోవడం మాత్రం తెలియలేదు దొరికేశాడు. 



బీహార్‌లోని కిషన్ గంజ్ డివిజన్‌లో సంజయ్ కుమార్ రాయ్ గ్రామీణాభివృద్ధి శాఖలో ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్‌గా పని చేస్తున్నాడు. ఆయన పరిధిలో పనులు జరిగినట్లే ఉంటాయి కానీ జరగవు. కానీ బిల్లులు మాత్రం ఎప్పటికప్పుడు మంజూరు చేసుకుంటూ ఉంటారు. ఆయన పరిధిలో పేపర్లపై చాలా అభివృద్ధి జరిగింది . ప్రత్యక్షంగా వెళ్తే మాత్రం అసలేమీ కనిపించదు. ఆయనపై అదే పనిగా ఆరోపణలు రావడంతో బీహార్ విజిలెన్స్ శాఖ ఓకన్నేసింది.  పూర్తి వివరాలు రాబట్టింది. చివరికి అవినీతి చేస్తున్నాడని గుర్తించింది. ఆ డబ్బంతా ఇంట్లోనే గుట్టలుగా పోస్తున్నాడని కూడా తెలుసుకుంది. ఇక ఊరుకుంటుందా..  రంగంలోకి దిగింది. 



పాట్నా నుంచి కిషన్ గంజ్‌కు వచ్చిన విజిలెన్స్ అధికారులు సంజయ్ కుమార్ రాయ్ ఇంటిపై దాడి చేశారు. ఆ సమయంలో ఆయన ఇంట్లోనే ఉన్నారు. ఇంట్లో ఎక్కడ చూసినా నోట్ల కట్టలే కనిపించాయి. వాటన్నింటినీ తీసుకొచ్చి హాల్లో గుట్టలుగా పోశారు. మెషిన్లు తీసుకొచ్చి లెక్కలేశారు. అట్టపెట్టెల్లో సర్దారు. మొత్తంగా చూస్తే... రూ. ఐదు కోట్ల వరకూ నగదు ఉండవచ్చని భావిస్తున్నారు..  కొంత బంగారాన్ని ఇతర ఆస్తులను స్వాధీనం చేసుకున్నారు.  బ్యాంకు లాకర్లు కూడా ఓపెన్ చేయడానికి విజిలెన్స్ అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఇంకా స్థిరాస్తులు ఎక్కడైనా ఉన్నాయేమోనని డాక్యుమెంట్లు చూస్తున్నారు. 


బీహార్‌లో ఈ విజిలెన్స్ రెయిడ్స్ .. దొరకిన డబ్బులు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇలాంటి అధికారులు బీహార్‌లో వందల మంది ఉంటారని.. వారందరి ఇళ్లలోనూ సోదాలు చేయాలన్న డిమాండ్లను వినిపిస్తున్నారు.