ఉత్తరప్రదేశ్ లోని నోయిడాలో నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన ట్విన్ టవర్స్ మరికొన్ని గంటల్లో నేలమట్టమవనున్నాయి. ఆదివారం మధ్యాహ్నం రెండున్నర గంటలకు దీన్ని కూల్చివేయనున్నారు. ఇప్పటికే అన్ని అంతస్థుల్లో పేలుడు పదార్థాలు అమర్చారు. 100 మీటర్ల దూరంలో ఉన్న బటన్ నొక్కడం ద్వారా.. కేవలం 10 సెకన్లలో ఈ జంట భవనాలు కూలిపోనున్నాయి. 


కుతుబ్ మినార్ కంటే ఎక్కువ ఎత్తు


40 అంతస్థులు ఉన్న ఈ భవనానన్ని సూపర్ టెక్ సంస్థ నిర్మించింది. ఇది నిబంధనలు ఉల్లఘించి కట్టారని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. చాలా ఏళ్ల క్రితమే వీటిని కూల్చేయాలని ఆదేశాలు ఇచ్చినా.. పలు కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చింది. దిల్లీలోని కుతుబ్ మినార్ కంటే ఎత్తుగా ఉన్న ఈ భవనాల్లో ఒక దాని ఎత్తు 108 మీటర్లు కాగా.. మరొకటి 97 మీటర్లు ఉంటుంది. 


12 శాతం వడ్డీతో డబ్బులు వెనక్కి


ట్విన్ టవర్స్‌లో మొత్తం 915 ప్లాట్స్ ఉన్నాయి. ఒక్కో ట్రిపుల్ బెడ్ రూమ్ ఫ్లాట్‌ విలువ రూ.1.13 కోట్లు. వీటిని అమ్మితే రూ. 1200 కోట్లు వస్తాయి. ఇప్పటికే 633 ప్లాట్స్ బుక్ అయ్యాయి. అందుకోసం కొనుగోలుదారుల నుంచి రూ.180 కోట్లను సేకరించింది సూపర్ టెక్ సంస్థ. అయితే కూల్చివేత సందర్భంగా.. తిరిగి కొనుగోలుదారులకు తిరిగి డబ్బు చెల్లించాల్సిన పరిస్థితి వచ్చింది. అది కూడా 12 శాతం వడ్డీతో డబ్బు చెల్లించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. 


కూల్చేందుకు కోట్ల ఖర్చు


సాధారణంగా ఇంత భారీ భవనాన్ని కట్టేందుకు వందల కోట్లు ఖర్చవుతుంది. అయితే దీనిని కూల్చేందుకు కూడా కోట్లల్లోనే ఖర్చు పెట్టనున్నారు.  కూల్చివేతలో భాగంగా ఒక్కో చదరపు అడుగుకు రూ.267 ఖర్చుకానుంది. ఈ లెక్కన 7.5 లక్షల చదరపు అడుగుల్లో ఉన్న నిర్మాణాలను కూల్చేందుకు దాదాపు రూ.20 కోట్లు ఖర్చవుతుంది. ఇందులో రూ.5 కోట్లు సూపర్ టెక్ కంపెనీ చెల్లింస్తుంది. మిగిలిన డబ్బును భవన వ్యర్థాలను విక్రయించడం ద్వారా సమీకరించనున్నారు. ఈ రెండు భవనాల నుంచి 55వేల టన్నుల వ్యర్థాలు వస్తాయని.. అందులో 4  వేలకు పైగా స్టీలే ఉంటుందని అధికారులు వెల్లడించారు.


వేల కేజీల పేలుడు పదార్థాలు


ట్విన్ టవర్స్‌ను కూల్చేందుకు ఎడిపైస్ అనే సంస్థ ఒప్పందం తీసుకుంది. ఇందుకోసం ముందు జాగ్రత్తగా రూ.100 కోట్ల బీమా చేయించింది. పరిసర ప్రాంతాల్లో ఏదైనా నష్టం సంభవిస్తే దీనిని చెల్లిస్తారు. హర్యాానాలోని పాల్‌వాల్‌ నుంచి కూల్చివేతలో ఉపయోగించే పేలుడు పదార్ధాలను తీసుకొచ్చి భవనంలో అమర్చారు. డైనమైట్‌, ఎమల్షన్స్, ప్లాస్టిక్ పదార్థాలు కలగలిసిన 3,700 కేజీల పేలుడు పదార్థాలను వినియోగించనున్నారు. మొత్తం 100 మంది సిబ్బంది ఇందులో పాల్గొంటారు. 


వ్యర్థాల తొలగింపునకు 3 నెలల సమయం


ఆగస్టు 28న చేతన్‌ దత్తా అనే భారత బ్లాస్టర్‌ ఫైనల్‌ స్విచ్‌ నొక్కి ఈ భవనాలను కూల్చివేయనున్నారు. భవనాలు కూలిన తర్వాత పెద్ద మొత్తంలో వ్యర్థాలు ఏర్పడతాయని.. వీటిని తొలగించేందుకు 3 నెలల సమయం పడుతుందని అధికారులు చెప్పారు. పక్కన ఉండే నివాస భవనాలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వీటిని నేలమట్టం చేయనున్నారు. మనదేశంలో చాలా అరుదుగా జరగనున్న ఈ  కూల్చివేత కోసం దేశ ప్రజలంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.