Viral Video: మన దేశంలో రైళ్లు అంటేనే రద్దీకి పర్యాయపదం. పండగ రోజుల్లో అయితే కాలు పెట్టడానికి కూడా వీలు ఉండనంతగా జనాలతో రైళ్లు కిక్కిరిసిపోయి కనిపిస్తాయి. జనరల్ బోగీల్లో విపరీతమైన జనం ఎప్పుడూ ఉంటారు. రద్దీ రైళ్లు అనగానే మొదట గుర్తుకు వచ్చేది ముంబై లోకల్ ట్రైన్స్. చాలా మంది సినిమాల్లో చూసే ఉంటారు. 


కిక్కిరిసిపోయి పరుగులు పెడుతుంటాయి ముంబై లోకల్ ట్రైన్స్. వచ్చీ పోయే ప్రయాణికులతో అక్కడి రైల్వే స్టేషన్లు కూడా రద్దీగా ఉంటాయి. ఉదయం పనులు ప్రారంభమయ్యే సమయంలో, సాయంత్రం ఇంటికి చేరుకునే వేళ ఈ ట్రైన్లలో రద్దీ విపరీతంగా ఉంటుంది. అలాంటి రద్దీ ట్రైన్లలో పక్క ప్రయాణికుడికి కాలు, చేయి తగలకుండా ప్రయాణించలేం. వెనక ఉన్న వాళ్లు తోసినప్పుడో, పక్కన ఉన్న వాళ్లు గెంటినప్పుడో వేరే వారిని తగలడం సర్వసాధారణం. చాలా మంది ఇలాంటి వాటికి అడ్జస్టైపోయి లోకల్ ట్రైన్స్ లో ఇవన్నీ సాధారణమే అనుకుని ప్రయాణాలు సాగిస్తుంటారు. అయితే కొన్ని సార్లు, కొంత మంది మాత్రం వెనక ఉన్న వ్యక్తి నెట్టేశాడని, ముందున్న వ్యక్తి తగిలాడని గొడవకు దిగుతారు. తాజాగా వైరల్ అవుతున్న వీడియోలో జరిగింది ఇదే. విపరీతంగా రద్దీ ఉన్న ముంబై లోకల్ ట్రైన్ లో ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. 


ఇద్దరు వ్యక్తులు ఏదో విషయంలో గట్టిగా ఒకరిపై ఒకరు అరుచుకుంటూ మాట్లాడుకున్నారు. అది కాస్త చేతికి పని చెప్పేంత వరకు వెళ్లింది. పైపైకి వస్తున్న ఓ వ్యక్తిని మరో వ్యక్తి నెట్టేశాడు. వెంటనే ఆ వ్యక్తి కూడా ఎదుటి వ్యక్తిని నెట్టేశాడు. అలా ఘర్షణ మొదలైంది. ఇద్దరు వ్యక్తులు మిగతా ప్రయాణికులపై పడుతూ లేస్తూ ఒకరిని ఒకరు కొట్టుకున్నారు. ఈ తతంగాన్ని అంతా అదే ట్రైన్ లో ప్రయాణిస్తున్న మరో వ్యక్తి తన మొబైల్ ఫోన్ చిత్రీకరించాడు. వారు మాటా మాటా అనుకుంటూ కొట్టుకుంటుంటే చాలా మంది చూస్తూ ఉండిపోయారు.






ఇద్దరు వ్యక్తులు కొట్లాడుకోవడాన్ని మిగతా వారంతా చూస్తుండిపోయినా.. ఒక వ్యక్తి మాత్రం మధ్యలో కలగజేసుకుని ఇద్దరిని చేరో వైపు ఆపాడు. గొడవ ఆపాలని వారి కొట్లాటను వారించాడు. అలా ప్రయాణికుల మధ్య ఘర్షణను ఆపాడు. ఈ వీడియో కాస్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 


ఈ వీడియోను ముంబై మ్యాటర్స్ (mumbaimatterz) అనే ట్విట్టర్ హ్యాండ్లర్ ట్వీట్ చేసింది. రద్దీగా ఉండే ముంబై లోకల్ ట్రైన్ లో ఇదో సాధారణ దృశ్యం అని ఆ పోస్టుపై రాసుకొచ్చారు. వారిద్దరిని కొట్లాడుకోకుండా ఆపిన వ్యక్తిని కూడా ప్రశంసించారు. 






ఈ ట్వీట్ పై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. వారి మధ్యలో కలగజేసుకుని ఘర్షణను నివారించిన వ్యక్తిని చాలా మంది ప్రశంసిస్తున్నారు. అలాంటి వ్యక్తుల వల్లే ఆ కొట్లాట అక్కడితో ఆగిపోయిందని కామెంట్లు పెడుతున్నారు.