Viral Video:
అగ్ని ప్రమాదం..
విద్యుత్ వాహనాలు కొనాలని ప్రభుత్వాలు ప్రోత్సహిస్తున్నాయి. కానీ...వరుసగా జరుగుతున్న ప్రమాదాలు కొనాలనుకునే వాళ్లనీ వెనకడుగేసేలా చేస్తున్నాయి. పలు చోట్ల ఇప్పటికే ఎలక్ట్రిక్ స్కూటర్‌లు, కార్‌లు అగ్ని ప్రమాదానికి గురయ్యాయి. ఇలాంటి ఘటనే ఇప్పుడు బెంగళూరులోనూ వెలుగు చూసింది. రోడ్డుపై వెళ్తున్న విద్యుత్ కార్‌లో నుంచి ఉన్నట్టుండి మంటలు ఎగిసిపడ్డాయి. జేపీ నగర్ వద్ద ఈ ఘటన జరిగింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ ప్రమాదంలో కారు పూర్తిగా కాలిపోయింది. సెప్టెంబర్ 30వ తేదీన ఈ ప్రమాదం జరిగింది. జేపీ నగర్‌లోని దాల్మియా సర్కిల్‌కి చేరుకునే సమయానికి కార్‌లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఆ కార్‌లో ఉన్న ప్రయాణికులు వెంటనే అప్రమత్తమై కార్ దిగారు. లేకపోయుంటే అంతా సజీవదహనమై ఉండేవాళ్లు. ఆ స్థాయిలో మంటలు వచ్చాయి. అయితే...ఎందుకిలా మంటలు వచ్చాయన్నది ఇంకా తెలియలేదు. గతంలో ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ నడిరోడ్డుపైనే కాలిపోయింది. బైక్ నడిపే వ్యక్తి వెంటనే రోడ్డుపై వదిలేసి పక్కకు రావడం వల్ల ప్రాణాపాయం తప్పింది. ఈ ఘటనలు తరచూ జరుగుతుండటం వల్ల చాలా మంది విద్యుత్ వాహనాలు కొనడానికి ముందుకి రావడం లేదు. ఇప్పుడిప్పుడే మార్కెట్‌కి బూమ్ వస్తోందనకుంటున్న తరుణంలో ఈ ప్రమాదాలు కంపెనీలకూ ఆందోళన కలిగిస్తున్నాయి. డ్యామేజ్ కంట్రోల్‌లో భాగంగా పలు వాహనాలను వెనక్కి తెప్పించి ప్రమాదాలకు కారణాలేంటో కనుగొనే పనిలో పడ్డాయి.