Viral News: చిన్న పిల్లలు, టీనేజర్లు ఒకరినొకరు కొట్టుకోవడం మనం చాలా సార్లే చూసుంటాం. అలాగే పల్లెటూళ్లలో ఉండే వాళ్లు నీళ్ల కోసం ట్యాంకర్ల వద్ద ఒకరిపై ఒకరు దాడి చేసుకోవడం అందరికీ తెలిసిందే. ఇలాంటి తరహాలోనే ఉపాధ్యాయురాళ్లు గొడవ పడ్డారు. ఉన్నత చదువులు చదివి.. విద్యార్థులకు బుద్ధులు నేర్పాల్సిన స్థానంలో ఉన్న వీళ్లు విచక్షణా రహితంగా ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. సిగలు పట్టుకొని మరీ.. కిందామీదా పడి దొర్లుతూ చితకబాదుకున్నారు. బడిలోని పిల్లలంతా చూస్తుండగానే చెప్పులతో కూడా దాడి చేసుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
బిహార్ రాష్ట్రంలోని పట్నాలో కొరియా పంచాయత్ విద్యాలయ్ స్కూళ్లో ఈ ఘటన చోటు చేసుకుంది. కిటికీ తలుపులు మూయడం విషయంలో ప్రధానోపాధ్యాయురాలు, ఉపాధ్యాయురాళ్ల మధ్య గొడవ మొదలైంది. క్లాస్ రూంలోకి వచ్చిన ప్రధానోపాధ్యాయురాలు కాంతి కుమారి గది కిటికీలు మూసివేయాలని అనితా కుమారి అనే టీచర్ కు చెప్పారు. ఇందుకు ఆమె అంగీకరించపోవడంతో ఇద్దరూ వాగ్వాదానికి దిగారు. ఆ తర్వాత ప్రన్సిపాల్ కాంతి కుమారి తరగతి గది నుంచి బయటకు వస్తుండగా.. టీచర్ అనిత ఆమె వెనుకే చెప్పు పట్టుకొని వచ్చి దాడి చేశారు.
అనితకు మద్దతుగా మరో టీచర్ కూడా ప్రిన్సిపాల్ పై దాడి చేశారు. గది పక్కనే ఉన్న పొలాల్లోకి వెళ్లి మరీ కిందా మీదా పడుతూ కొట్టుకున్నారు. చెప్పులతో దాడి చేసుకున్నారు. ఇష్టం వచ్చినట్లుగా తిట్టుకుంటూనే సిగలు పట్టుకుని జుట్లు పీక్కున్నారు. విద్యార్థులు చూస్తున్నా ఏమాత్రం పట్టించుకోకుండా విచక్షణారహితంగా వ్యవహరించారు. పొలాల్లో పని చేసే కొందరు వీరి గొడవను గమనించారు. వెంటనే అక్కడకు వచ్చిన వారిని ఆపారు.
అయితే, ఇందుకు సంబంధించిన వీడియోను కొందరు స్థానిక మీడియా ప్రతినిదులు సామాజిక మాధ్యమాల్లో షేర్ చేశారు. దీంతో ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఈ ఘటనపై బ్లాక్ ఎడ్యుకేషన్ అధికారి నరేష్ స్పందించారు. ప్రధానోపాధ్యాయురాలితో ఆ ఇద్దరు టీచర్లకు వ్యక్తిగత విభేదాలు ఉన్నాయని తెలిపారు. దీనిపై దర్యాప్తు చేపట్టామని ఆ ముగ్గురిపై చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.