Vijay Divorce Case: తమిళనాడు రాజకీయాల్లో, సినీ వర్గాల్లో అత్యంత ఆసక్తి రేకెత్తించిన ముఖ్యమంత్రి జోసెఫ్‌ విజయ్‌, ఆయన భార్య సంగీత మధ్య నడుస్తున్న విడాకుల కేసులో అనూహ్య మలుపు తిరిగింది. తన వివాహ బంధాన్ని రద్దు చేయాలని కోరుతూ గతంలో దాఖలు చేసిన పిటిషన్‌ను సంగీత వెనక్కి తీసుకున్నారు. శుక్రవారం నాడు జరిగిన విచారణలో భాగంగా ఈ పరిణామం చోటుచేసుకుంది. 

Continues below advertisement

తమిళనాడులోని చెంగల్పట్టు జిల్లా కోర్టులో పెండింగ్‌లో ఉన్న విడాకుల కేసును సంగీత ఉపసంహరించుకోవడంతో, న్యాయమూర్తి ఆ కేసును కొట్టివేశారు. సంగీత ఈ విచారణకు వ్యక్తిగతంగా హాజరుకాకుండా, వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా కోర్టు ముందు హాజరయ్యారు. పిటిషన్‌ను వెనక్కి తీసుకోవడానికి గల కారణాలను ఆమె న్యాయమూర్తికి వివరించినట్టు సమాచారం. ఈ పరిణామంతో ముఖ్యమంత్రి విజయ్ వైవాహిక జీవితంపై సాగుతున్న ఊహాగానాలకు ప్రస్తుతానికి తెరపడింది. 

వివాదానికి కారణాలు

ఈ వివాదం ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రారంభమైంది. సంగీత తన పిటిషన్‌లో విజయ్‌పై తీవ్రమైన ఆరోపణలు చేశారు. 2021లో విజయ్‌ ఒక మహిళా నటితో సంబంధం కలిగి ఉన్నట్టు తాను గుర్తించానని, దానిని ఆపమని కోరినప్పటికీ ఆయన పట్టించుకోలేదని పిటిషన్‌లో పేర్కొన్నారు. విజయ్‌ తనను సామాజిక, వృత్తిపరమైన కార్యక్రమాలకు దూరం పెట్టారని, అదే సమయంలో సదరు నటితో కలిసి బహిరంగంగా తిరుగుతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. సామాజిక మాధ్యమాల్లో విజయ్, ఆ నటి కలిసున్న ఫొటోలు వైరల్ కావడంతో తనను, తన ఇద్దరు పిల్లలను తీవ్ర అవమానానికి గురి చేసిందని ఆమె గతంలో వాదించారు. విజయ్ తన స్వేచ్ఛను హరించడమే కాకుండా, ఆర్థికపరమైన పరిమితులు కూడా విధించారని ఆమె తన పిటిషన్‌లో ఆరోపించారు. 

Continues below advertisement

విచారణ సాగిందిలా

ఈ ఏడాది ఫిబ్రవరిలో పిటిషన్‌ దాఖలు చేసినప్పటి నుంచి ఈ కేసు పలుమార్లు వాయిదా పడుతూ వచ్చింది. గత నెలలో జరిగిన విచారణకు విజయ్‌ లేదా సంగీత ఇద్దరూ వ్యక్తిగతంగా హాజరుకాకపోవడంతో న్యాయమూర్తి ఆగస్టు 7కు కేసును వాయిదా వేశారు. అప్పటి వరకు ఇరు పక్షాల లాయర్లు మాత్రమే కోర్టుకు హాజరై, తమ క్లయింట్లు బిజీగా ఉండటం వల్ల రాలేకపోతున్నారని కోర్టుకు విన్నవించారు. 

విజయ్‌, సంగీతల వివాహం ఆగస్టు 25, 1999న చెన్నైలో సంప్రదాయ హిందూ పద్ధతిలో జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. విజయ్‌ సినిమాల నుంచి రాజకీయాల్లోకి ప్రవేశించి, ఈ ఏడాది మే నెలలో తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వేళ ఈ వైవాహిక వివాదం జాతీయ స్థాయిలో చర్చనీయాంశమైంది. 

సంగీత తన పిటిషన్‌లో మనోవర్తితోపాటు చెన్నైలోని నీలంగరైలో ఉన్న తమ నివాసంలోనే ఉండేందుకు అనుమతి కోరినప్పటికీ, ఇప్పుడు కేసును ఉపసంహరించుకోవడం ద్వారా వారు తిరిగి కలిసి ఉండే అవకాశం ఉందా అన్న చర్చ మొదలైంది. ముఖ్యమంత్రిగా విజయ్‌ రాజకీయ ప్రస్థానంలో ఈ నిర్ణయం ఆయన వ్యక్తిగత ప్రతిష్టను కొంత ఊరటనిచ్చే విషయమని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రస్తుతానికి చెంగల్పట్టు కోర్టు ఈ వివాదాన్ని అధికారికంగా ముగించింది. భవిష్యత్‌లో ఈ దంపతులు తిరిగి కలిసి జీవిస్తారా లేదా అన్నది వేచి చూడాల్సి ఉంది.