చైనా సరిహద్దుల్లో  భారత అప్రమత్తత ఎప్పుడూ అత్యున్నత స్థాయిలో ఉంటుంది.  ప్రస్తుతం భారత్ " చికెన్ నెక్ " అని పిలిచే ప్రాంతంలో అద్భుతమైన వైమానిక విన్యాసాలు చేస్తోంది. మార్చి 24, 25 తేదీల్లో జరిగిన ఈ వైమానిక విన్యాసాల్లో దాదాపుగా ఆరు వందల మంది పారాట్రూపర్లు (Para Troopers ) సిలిగురి కారిడార్ సమీపంలో ఆకాశం నుండి ఒక్క సారిగా కిందకి దూకారు. వారు అలా దూకడంతో దూరం నుంచి చూసే వారికి పక్షుల గుంపు వస్తుందేమో అనుకునేలా అద్భుతమైన దృశ్యాలు సాక్ష్యాత్కరించారు. 


 






సిలిగురి కారిడార్ ( Siliguri Corrider ) ప్రాంతం చైనా సరిహద్దుకు సమీపంలో ఉంది. రక్షణ పరంగా ఇది అత్యంత కీలకమైన ప్రాంతం. ఈ ప్రాంతంలో భారత్ సైనిక కసరత్తులు ఇటీవలి కాలంలో ముమ్మరం చేసింది. గత మూడు వారాల్లో ఇటువంటి కసరత్తు చేయడం రెండో సారి. సిలిగురి కారిడార్‌ను భారతదేశంలోని 'చికెన్ నెక్' ( Chicken Neck ) అని కూడా పిలుస్తారు, ఇది భారతదేశంలో వాణిజ్యపరంగా భౌగోళికంగా మాత్రమే కాకుండా వ్యూహాత్మకంగా కూడా ముఖ్యమైన ప్రాంతం.. 


సిలిగురి కారిడార్ నేపాల్ ( Nepal ) , భూటాన్ , ( Bhutan )  బంగ్లాదేశ్‌లకు ( Bangladesh ) సరిహద్దుగా ఉన్న భూభాగం. చైనాతో సరిహద్దు కూడా సమీపంలో ఉంది. ఇది ఈశాన్య ప్రాంతాన్ని భారతదేశంలోని మిగిలిన ప్రాంతాలతో కలుపుతుంది. రక్షణ పరంగా చాలా ముఖ్యమైనదిగా పరిగణిస్తారు. అందుకే ఆ ప్రాంతానికి భారత్ ఎప్పుడూ అత్యధిక ప్రాధాన్యత ఇస్తుంది. 


వైమానిక కసరత్తుల్లో సుశిక్షితులైన పారా ట్రూపర్లు పాల్గొంటున్నారు.  అధునాతన ఫ్రీ-ఫాల్ ( Free Fall )  పద్ధతులు, ఎంట్రీ , నిఘా , టార్గెట్ ఛేజింగ్ ( Target Chasing ) వంటి వాటిని ప్రదర్శించడం ఈ ఎక్సర్‌సైజ్ లక్ష్యం. సిలిగురి ప్రాంతంలో భారత సైన్యం, అస్సాం రైఫిల్స్, సరిహద్దు భద్రతా దళం  పశ్చిమ బెంగాల్ పోలీసులు గస్తీ నిర్వహిస్తున్నారు.