INDIA Alliance Vice President Candidate | న్యూఢిల్లీ: విపక్షాల ‘ఇండియా’ కూటమి ఉపరాష్ట్రపతి ఎన్నికల బరిలో నిలిచింది. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ బి. సుదర్శన్ రెడ్డి (Sudarshan Reddy)ని తమ ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా విపక్షాల కూటమి ప్రకటించింది. ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థి సి.పి. రాధాకృష్ణన్‌కు మద్దతు ఇవ్వాలని ప్రధాని నరేంద్ర మోదీ ప్రతిపక్షాలను కోరిన కొద్దిసేపటికే  ఇండి కూటమి అభ్యర్థిని ప్రకటించి షాకిచ్చింది. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే విపక్షాల అభ్యర్థిగా జస్టిస్ సుదర్శన్ రెడ్డి పేరును మంగళవారం మధ్యాహ్నం ప్రకటించారు. గోవాకు మొదటి లోకాయుక్తగా సుదర్శన్ రెడ్డి సేవలు అందించారు.

ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా తెలుగు వ్యక్తికి అవకాశం..

 కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే తమ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా తెలుగు వ్యక్తి జస్టిస్ సుదర్శన్ రెడ్డి పేరును ప్రకటించిన అనంతరం మాట్లాడుతూ, ప్రతిపక్షాలు ఉపరాష్ట్రపతి ఎన్నికలో పోటీ చేస్తున్నాయి. ఇది రాజకీయ పోటీ కాదు, "సైద్ధాంతిక యుద్ధం" అని అన్నారు. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ బి. సుదర్శన్ రెడ్డి మా ఉపరాష్ట్రపతి అభ్యర్థి. ఆయన పేదల పక్షాన ఎలా నిలిచారో, రాజ్యాంగాన్ని ఎలా కాపాడారో దేశ ప్రజలకు బాగా తెలుసు. ఇది రాజకీయ యుద్ధం కాదు, ఇది సైద్ధాంతిక యుద్ధం.

అన్ని ప్రతిపక్ష పార్టీలు మా నిర్ణయాన్ని అంగీకరించాయి. అందుకే మేం ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చేస్తున్నాం. ఉపరాష్ట్రపతి ఎన్నికలకు ఉమ్మడి అభ్యర్థిని నిలబెట్టాలని ఇండి కూటమి సంయుక్తంగా నిర్ణయం తీసుకుంది. అందరూ ఒకే పేరుపై అంగీకారం తెలిపినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇది ప్రజాస్వామ్యంలో గొప్ప క్షణం" అని ఖర్గే అన్నారు.

జస్టిస్ సుదర్శన్ రెడ్డి కెరీర్..

బి. సుదర్శన్ రెడ్డి తెలంగాణ రాష్ట్రానికి చెందిన వ్యక్తి. ఆయన 1946లో ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని ఇబ్రహీంపట్నం తాలూకాలోని అకుల మైలారం గ్రామంలో వ్యవసాయ కుటుంబంలో జన్మించారు. ఆయన హైదరాబాదులో విద్యనభ్యసించారు. 1971లో ఉస్మానియా విశ్వవిద్యాలయం (OU) నుండి న్యాయశాస్త్రంలో పట్టా పొందారు. అనంతరం ఆయన 1971 డిసెంబర్ 27న ఆంధ్రప్రదేశ్ బార్ కౌన్సిల్‌లో హైదరాబాదులో అడ్వొకేట్‌గా నమోదయ్యారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో రిట్, సివిల్ వ్యవహారాల్లో ప్రాక్టీస్ చేశారు. 1988 నుండి 1990 మధ్యకాలంలో హైకోర్టులో ప్రభుత్వ న్యాయవాదిగా పని చేశారు. 

జస్టిస్ సుదర్శన్ రెడ్డి 1990లో ఆరు నెలలపాటు కేంద్ర ప్రభుత్వానికి అదనపు స్టాండింగ్ కౌన్సెల్‌గా పనిచేశారు. ఉస్మానియా విశ్వవిద్యాలయానికి న్యాయ సలహాదారుగా, స్టాండింగ్ కౌన్సెల్‌గా కూడా వ్యవహరించారు. 1995 మే 2న ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2005 డిసెంబర్ 5న అస్సాం గౌహతి హైకోర్టు చీఫ్ జస్టిస్‌గా నియమితులయ్యారు. 2007 జనవరి 12న భారత సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టిన సుదర్శన్ రెడ్డి 2011 జూలై 8న పదవీ విరమణ చేశారు.