Vice-President Poll: ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటింగ్‌కు దూరంగా ఉండాలని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయించుకుంది. అధికారికంగా తమ నిర్ణయాన్ని ప్రకటించింది. ఈ నిర్ణయంతో విపక్ష కూటమి అభ్యర్థి మార్గరేట్ అళ్వాకు మరింత ఇబ్బందికర పరిస్థితి ఏర్పడనుంది. తమతో సరైన రీతిలో సంప్రదించకుండానే అభ్యర్థిని ఖరారు చేశారని అందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని మమతా బెనర్జీ మేనల్లుడు, ఎంపీ అయిన అభిషేక్ బెనర్జీ ప్రకటించారు. మమతా బెనర్జీ నిర్ణయం రాజకీయవర్గాల్లో సహజంగానే చర్చకు దారి తీస్తోంది.
ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా నిలబడింది ఇప్పటి వరకూ బెంగాల్ గవర్నర్‌గా ఉన్న జగదీప్ ధన్‌ఖడ్. అయితే ఆయనతో మమతా బెనర్జీకి ఎలాంటి సత్సంబంధాలు లేవు. మమతా బెనర్జీ ప్రభుత్వాన్ని జగ్దీప్ ధన్ ఖడ్ ఎంత ఇబ్బంది పెట్టాలో అంతా పెట్టారని దీదీ చాలా సార్లు ఆరోపించారు. సమాంతర ప్రభుత్వం నడిపే ప్రయత్నం చేశారన్నారు. కేంద్రం అండతో మమతా బెనర్జీ విషయంలో చాలా సార్లు దూకుడుగా వ్యవహరించారని.. కొన్ని సందర్భాల్లో రాష్ట్రపతి పాలనకు సిఫార్సు చేస్తారన్న ప్రచారం కూడా జరిగిందని టీఎంసీ ఎవర్గాలు చెబుతూ ఉంటాయి.
ధన్‌ఖడ్ కూడా బెంగాల్ లో శాంతిభద్రతల పరిస్థితిపై అనేక విమర్శల చేస్తూ ఉంటారు. అంతటి వ్యతిరేకత ఉన్న ధన్‌కడ్‌ను ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా నిలబెడితే.. ఓటింగ్‌కు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు మమతా బెనర్జీ. విపక్షాల అభ్యర్థికి మద్దతు ఇవ్వకూడదని డిసైడయ్యారు. గవర్నర్ బెంగాల్ నుంచి వెళ్లిపోతే చాలని ఇలా చేశారని కొంత మంది అంటున్నా.. అసలు మమతా విపక్షాలకు మద్దతిచ్చినా ధన్‌ఖడ్‌కు పోయేదేమీలేదని.. కానీ ఆయనపై వ్యతిరేకత చూపించినట్లు ఉండేదని అంటున్నారు. కానీ మమతా మాత్రం గైర్హాజర్ కావడం ద్వారా ధన్‌ఖడ్‌కు మేలు చేయాలని డిసైడయ్యారు.
అయితే మమతా బెనర్జీ ఈ నిర్ణయం తీసుకోవడానికి కారణం పైకి చెబుతున్నట్లుగా సరైన సంప్రదింపులు జరపకపోవడం కాదని అంటున్నారు. కొద్ది రోజుల కిందట డార్జిలింగ్‌లో అసోం సీఎం హిమంత బిశ్వశర్మ, గవర్నర్ ధన్‌ఖడ్‌తో మమతా బెనర్జీ సమావేశం అయ్యారని... అప్పుడే మద్దతుపై చర్చ జరిగిందని..ఆ చర్చల ప్రకారమే మమతా బెనర్జీ ఈ నిర్ణయం తీసుకున్నారని అంటున్నారు. కారణం ఏదైనా కానీ ... విపక్షాలకు ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో షాక్ తగిలినట్లయింది.