మూడు గంటల పాటు ప్రశ్నలు..


నేషనల్ హెరాల్డ్ కేసులో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న సోనియా గాంధీ తొలిసారి ఈడీ ఎదుట హాజరయ్యారు. ఈడీ అధికారులు ఆమెను దాదాపు మూడు గంటల పాటు విచారించారు. నేషనల్ హెరాల్డ్‌లో జరిగిన అవకతవకలపై ఆమెను ప్రశ్నించారు. ఇప్పటికే రాహుల్ గాంధీని ప్రశ్నించింది ఈడీ. ఈ విచారణలో ఆయన సరిగా సహకరించలేదని ఈడీ అసహనం వ్యక్తం చేసింది. రాహుల్ గాంధీ మాత్రం..ఈడీ అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పానని వెల్లడించారు. తొలిసారి సోనియా గాంధీ ఈడీ విచారణకు హాజరైన క్రమంలో కాంగ్రెస్ కార్యకర్తలు, నేతలు పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టారు. సెంట్రల్ డిల్లీలోని ఈడీ హెడ్‌క్వార్టర్స్‌కి జెడ్ ప్లస్ సెక్యూరిటీతో వచ్చారు సోనియా. ఆమె వెంట ప్రియాంక గాంధీ కూడా వచ్చారు. మొత్తం ఐదుగురు అధికారులు ఆమెను ప్రశ్నించినట్టు సమాచారం. వీరందరినీ ఓ మహిళా అడిషనల్ డైరెక్టర్ లీడ్ చేస్తోందని తెలుస్తోంది. సోనియాను విచారించేందుకు దాదాపు 50 ప్రశ్నలు సిద్ధం చేసుకున్నారని వినికిడి. ప్రియాంక గాంధీని కూడా బిల్డింగ్‌లోకి అనుమతించారు. ఈ విచారణ జరిపే గదికి దూరంగా ఆమెను ఉంచారు. సోనియా గాంధీకి ఏదైనా అనారోగ్యం కలిగితే వెంటనే మెడికేషన్ ఇచ్చేందుకు వీలుగా...ప్రియాంక గాంధీ అందుబాటులో ఉన్నారు. 


దేశవ్యాప్తంగా కాంగ్రెస్ ఆందోళనలు 


ఈ ఈడీ విచారణపై కాంగ్రెస్ తీవ్ర స్థాయిలో మండి పడుతోంది. దీన్ని కావాలనే రాజకీయం చేస్తున్నారని ఆరోపించింది. జాతీయ స్థాయిలో నిరసన కార్యక్రమాలు చేపట్టినందుకు...కొందరు సీనియర్ నేతల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. "ఈడీ అధికారాలను దుర్వినియోగం చేయకండి" అని కొందరు నేతలు నినదించారు. దేశంలోని పలు చోట్ల కాంగ్రెస్ కార్యకర్తలు ఆందోళనలు చేశారు. దిల్లీలో మూడు రైళ్లను అడ్డుకున్నారు. కొన్ని చోట్ల వాహనాలకు నిప్పు పెట్టారు.