Vande Bharat Trains Record: దేశంలో వందేభారత్‌ రైళ్లు (Vande Bharat Trains) సరికొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి. రైల్వే ఆధునికీకరణలో భాగంగా స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన ఈ రైళ్లు రైల్వే వ్యవస్థలో పెను మార్పులకు కారణమైంది. వచ్చే మూడేళ్లలో దేశవ్యాప్తంగా 400 వందేభారత్‌ రైళ్లు తిప్పాలని రైల్వే శాఖ (Indian Railway) లక్ష్యంగా పెట్టుకుంది. ఆ మేరకు వాటి ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుతోంది. రాత్రి వేళ తిరిగే స్లీపర్‌ వందేభారత్‌ (Sleeper Vande Bharat) రైళ్లు ప్రారంభం కాబోతున్నాయి. ఇవి కూడా అందుబాటులోకి వస్తే ప్రయాణికులకు మరింత సౌర్యవంతంగా ఉంటుంది.


సరికొత్త రికార్డు 
రైల్వే శాఖ తీసుకొచ్చిన ఈ వందే భారత్ రైళ్లు కొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి. దేశ వ్యాప్తంగా అన్ని వందేభారత్‌ రైళ్లు 18423 ట్రిప్పులు తిరిగాయి. ఇప్పటి వరకు ఈ రైళ్లు ప్రయాణించిన దూరం 1,24,87,540 కిలోమీటర్లుగా నమోదైంది. ఇది 310 సార్లు భూమి చుట్టూ పరిభ్రమించిన దూరంతో సమానమని రైల్వే శాఖ పేర్కొంది. ఇది సరికొత్త రికార్డు అని రైల్వే శాఖ వెల్లడించింది. గత ఏడాది కాలంలో 97,71,705 కిలోమీటర్లు తిరిగినట్టు వెల్లడించింది. 


అన్ని రైళ్లకు డిమాండ్
2019 ఫిబ్రవరి 15న ప్రారంభమైన ఈ వందేభారత్‌ రైళ్లు దేశవ్యాప్తంగా 105.57 శాతం ఆక్యుపెన్సీ రేషియోతో దేశం మొత్తం తిరుగుతున్నాయి. వీటిలో కేరళలో తిరుగుతున్న వందేభారత్‌ రైలుకు అత్యంత డిమాండ్ ఉంది. ఈ రైలుకు గరిష్టంగా 175.3 శాతం ఆక్యుపెన్సీ రేషియో ఉంది. 26–45 ఏళ్ల మధ్య ఉన్నవారు వందేభారత్‌ రైళ్లలో ఎక్కువగా తిరుగుతున్నారు. మొత్తం ప్రయాణికుల్లో వీరి వాటా 45.9 శాతంగా నమోదవుతోంది. అలాగే వృద్ధులు 15.7 శాతం ప్రయాణిస్తున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. గోవాలో తిరుగుతున్న వందేభారత్‌ రైళ్లలో అత్యధికంగా 42 శాతం మంది మహిళలు ప్రయాణిస్తున్నారు. జార్ఖండ్‌‌లో గరిష్టంగా 67 శాతం మంది పురుషులు వందేభారత్ రైళ్లలో తిరుగుతున్నారు. 


ఆ రూట్లో రెండో వందేభారత్
ప్రస్తుతం తెలంగాణలో మొత్తం నాలుగు వందేభారత్‌ రైళ్లు తిరుగుతున్నాయి. సికింద్రాబాద్‌ – విశాఖపట్నం మధ్య గత ఏడాది సంక్రాంతికి 16 కోచ్‌లతో కూడిన వందేభారత్‌ రైలును ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఈ రైలులో 120 శాతానికి మించి ఆక్యుపెన్సీ రేషియో ఉంటోంది. దీంతో ఇటీవల ఇదే రూట్‌లో రెండో వందేభారత్‌ రైలును ప్రారంభించారు. ఈ రైలుకు మొత్తం 8 కోచ్‌లు ఉంటాయి. ఈ ఏడాది మార్చి 13 నుంచి సికింద్రాబాద్ - విశాఖపట్నం మధ్య తిరుగుతుంది. రెండు రైళ్లు ఒకే రూట్‌లో తిరగటం మొదట కేరళలో మొదలైంది. అంతూ రాదే సికింద్రాబాద్‌ – తిరుపతి, కాచిగూడ – బెంగుళూరు మధ్య మరో రెండు వందే భారత్ సర్వీసులు తిరుగుతున్నాయి. 


సెమీ హైస్పీడ్‌ రైళ్లుగా వందేభారత్ రైళ్లు
రైళ్ల వేగాన్ని గరిష్ట స్థాయికి పెంచుతూ సెమీ హైస్పీడ్‌ రైళ్లుగా వందేభారత్ రైళ్లను రైల్వే శాఖ ప్రారంభించింది. గంటకు 160 కి.మీ. వేగంతో ప్రయాణించగలవు. కానీ ప్రస్తుతం ఈ రైళ్లు సగటున 130 కి.మీ. వేగంతో ప్రయాణిస్తున్నాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 60 వరకు వందే భారత్ రైళ్లు నడుస్తున్నట్లు సమాచారం. తొలి రైలు 2019 ఫిబ్రవరిలో ప్రారంభమైంది. వచ్చే మూడేళ్లలో దేశవ్యాప్తంగా మరో 400 వందేభారత్‌ రైళ్లు నడిపేందుకు రైల్వే శాఖ సిద్ధమవుతోంది.