Vande Bharat Express: ఆంధ్రప్రదేశ్‌లో ఇండియన్ బుల్లెట్ ట్రైన్ అయిన వందే భారత్ రైలు అందుబాటులోకి రాబోతుంది. విజయవాడ నుంచి చైన్నై మధ్య ఈనెల 7వ తేదీ నుంచి రాకపోకలు సాగనున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ దేశ వ్యాప్తంగా ఐదు వందేభారత్ రైళ్లను వర్చువల్ విధానంలో ప్రారంభించనున్నారు. అందులో విజయవాడ నుంచి చెన్నై మధ్య నడిచే రైలు కూడా ఉంటుందని విజయవాడ డివిజన్ రైల్వే అధికారులకు సమాచారం అందింది.


విజయవాడ, చెన్నై మధ్య నడిచే  ట్రైన్ ప్రారంభోత్సవానికి అధికారులు ఏర్పాట్లలో నిమగ్నం అయ్యారు. ఈనెల 8వ తేదీ నుంచి పూర్తి స్థాయిలో రాకపోకలు సాగుతాయని అధికారులు చెబుతున్నారు. అయితే ఇందుకు సంబంధించిన రాకపోకల, షెడ్యూల్, టిక్కెట్ ధరలు గురించి ఒకటి లేదా రెండు రోజుల్లో బయటకు రానున్నాయి. ఈ రైలును రేణిగుంట మీదుగా నడపాలని విజయవాడ డివిజన్ రైల్వే అధికారులు కోరినట్టు తెలిసింది. ఆ ప్రకారం విజయవాడ నుంచి గూడూరు, రేణిగుంట, కాట్పాడి మీదుగా చైన్నై వెళ్లి.. అదే మార్గంలో తిరిగి రానుంది. విజయవాడ నుంచి తిరుపతి మధ్య రాకపోకలు సాగించే ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని, వందేభారత్ ను రేణిగుంట మీదుగా నడపాలని ఉన్నతాధికారులకు విజ్ఞప్తి చేసినట్ుల విజయవాడ డివిజన్ రైల్వే అధికారి తెలిపారు.