Uttarakashi Tunnel Rescue News Today:
ఉత్తరాఖండ్ సొరంగంలో రెస్క్యూ ఆపరేషన్ (Uttarakashi Tunnel Rescue Operation)కు అడుగడుగునా అవాంతరాలు తలెత్తుతున్నాయి. మరో రోజులు అయిపోతుంది, కార్మికులు బయటకు వచ్చేస్తారని భావించేలోపే కొత్త సమస్యలు ఎదురవుతున్నాయి. ఈ క్రమంలో ప్రభుత్వం సొరంగంలో చిక్కుకుపోయిన కార్మికుల కోసం ఓ ల్యాండ్ లైన్ సౌకర్యం (landline set up at Silkyara Tunnel) కల్పించింది. టన్నెల్ లో చిక్కుకున్న కార్మికులు బయటకు వచ్చే వరకు వారి కుటుంబసభ్యులతో మాట్లాడేందుకు ఈ ఏర్పాట్లు చేశారు. ల్యాండ్ లైన్ కనెక్షన్ పూర్తయింది, ఆ ఫోన్ ను కార్మికులకు అందించి, వారిని కుటుంబసభ్యులతో మాట్లాడేలా చూస్తామన్నారు.
ఉత్తరకాశీ టన్నెల్ రెస్క్యూ ఆపరేషన్ జరిగే చోట బీఎస్‌ఎన్‌ఎల్ ఉద్యోగి కుందన్ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వ సూచనలతో బీఎస్ఎన్ఎల్ ల్యాండ్ లైన్ సాకర్యం ఏర్పాటు చేశాం. శ్రమించి వైర్లు లాగి ల్యాండ్ లైన్ కనెక్షన్ ఇచ్చినట్లు పేర్కొన్నారు. సొరంగంలో చిక్కుకున్న కార్మికులకు ఈ ల్యాండ్ లైన్ ఫోన్ పంపిస్తున్నామని చెప్పారు. టన్నెల్ లోపల చిక్కుకున్న కార్మికులు వారి కుటుంబ సభ్యులతో మాట్లాడుకునేందుకు ఈ సౌకర్యం ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ దామీ శనివారం సిల్క్యారాలోని టన్నెల్ వద్దకు చేరుకుని రెస్క్యూ ఆపరేషన్‌ను పరిశీలించారు. సొరంగంలో కొనసాగుతున్న సహాయక చర్యల వివరాలను అడిగి తెలుసుకున్నారు. రెస్క్యూ చేపట్టిన ఆగర్ యంత్రానికి సంబంధించిన వివరాలు అడిగి, అక్కడ పరిస్థితిని గమనించారు. టన్నెల్ వద్ద పైప్‌లో ఇరుక్కున్న ఆగర్ మిషన్‌ను వీలైనంత త్వరగా తొలగించి, కార్మికులను బయటకు తెచ్చే రెస్క్యూ ఆపరేషన్ కొనసాగించాలన్నారు.
దాదాపు 14 రోజులుగా కార్మికులు సిల్ క్యారా సొరంగం ( Silkyara Tunnel)లో చిక్కుకున్నారు. 41 మంది కార్మికులను ఇదివరకే బయటకు తెస్తామని రెస్క్యూ టీమ్, అధికారులు భావించారు. కానీ అమెరికా నుంచి Augur Machine ని తెప్పించి డ్రిల్లింగ్ చేస్తుంటే ఓ ఐరన్ బీమ్ అడ్డం తగిలింది. మరో 12 మీటర్లు డ్రిల్లింగ్ పెండింగ్ ఉంది. ప్రస్తుతం ఆగర్ మిషన్ ను తొలగించాలని భావించి రెస్క్యూ ఆపరేషన్ ను తాత్కాలికంగా నిలిపివేశారు.
రెస్క్యూ ఎక్స్ పర్ట్ ఆర్నాల్డ్ డిక్స్ ఏమన్నారంటే..
ఇంటర్నేషనల్ టన్నెలింగ్ ఎక్స్‌పర్ట్ ఆర్నాల్డ్ డిక్స్ రెస్క్యూ ఆపరేషన్‌పై స్పందించారు. సొరంగంలో చిక్కుకున్న వారిని ఇప్పుడే బయటకు తీసుకొస్తాం, రేపు వారిని రెస్క్యూ చేస్తాం లాంటి మాటలు తాను చెప్పడం లేదని గమనించాలన్నారు. శిథిలాల కింద చిక్కుకున్న వాళ్లని బయటకు తీసుకొచ్చేందుకు మరో నెల రోజుల సమయం పట్టిన ఆశ్చర్యం అక్కర్లేదన్నారు. కానీ కార్మికులను సురక్షితంగా టన్నెల్ నుంచి బయటకు తీసుకొస్తామని, తమపై నమ్మకం ఉంచాలని మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. అనివార్య కారణాలతో రెస్క్యూ ఆపరేషన్ కు అడ్డంకులు ఏర్పాడుతున్నాయని తెలిపారు.